బ్రహ్మకడిగిన పాదము అని అన్నమయ్య అనడంలో యెంత గొప్ప అర్థం ఉందో
బ్రహ్మకడిగిన పాదము అని అన్నమయ్య అనడంలో యెంత గొప్ప అర్థం ఉందో !!
- లక్ష్మీరమణ
వంకటేశ్వరుని రూపము అనన్య సామాన్యము . భూత, భవిష్యత్, కాలాల్లో ఆ కరుణామూర్తికి సాటివచ్చే దేవదేవుడు లేనేలేడన్నది శృతి వచనం . ఆ స్వామీ తన పాదాలనే శరణని వేడిన వారికి ఆపదల్లో ఆదుకొనే కొంగుబంగారం . అందుకే భక్తులు ఆయన్ని ఆపదమొక్కులవాడా ! అనాథ రక్షకా ! గోవిందా! గోవిందా! అని మొక్కుతూ ఉంటారు . ఇదంటే బాగానే ఉందిగానీ అన్నమాచార్యుల వారు ‘ బ్రహ్మ కడిగిన పాదము; బ్రహ్మము తానైన పాదము’ కీరించారు కదా ! భక్తులు నిత్యమూ స్మరించే ఆ దివ్యపాదాలని బ్రహ్మ గారు ఎప్పుడు కడిగారు ? ఇందులో చాలా గొప్ప విశేషమే దాగుందండోయ్ !!
అన్నమాచార్యులవారు ఆ పాదాల గురించి ఎంతో అద్భుతంగా కీర్తించారు . బ్రహ్మకడిగిన పాదము, బ్రహ్మము తానయిన పాదము, భూమిని కొలిచి, ఆకాశాన్ని కొలిచి, మూడవసారి ముచ్చటగా మూడవపాదం బలి తలన మోపి, బలిని సంరక్షించిన పాదమని ఆ శ్రీనివాసుని పాదాలని దివ్యంగా వర్ణించాడు.
అహల్య శాపాన్ని కడిగిన పాదము, కాళీయుని పడగలపై తద్దిమ్మి తకదిమ్మి తాండవములాడిన నృత్యపాదం. ప్రేమతో లక్ష్మీదేవి పిసికే పాదము, ఇరవై ఒక్కమార్లు భూమిని నడిచి ధర్మాన్ని స్థాపించిన పాదము, యోగుల పాలిట వరములు కురిపించే పాదము, తిరుమల గిరులపై తిరిగి నిలచిన పాదమని ఆ భగవంతుని అవతారాల పరమార్థ సహితంగా పాద మహాత్మ్యాన్ని వర్ణించాడు అన్నమయ్య.
ఇందులో మిగిలిన ఉదంతాలన్నీ బాధపడినా బ్రహ్మగారు ఎప్పుడు ఆ శ్రీనివాసుని పాదాలని కడిగారో తెలుసుకుందాం . వామన పురాణాంతర్గతంలో ఈ కథ వస్తుంది. ఇంకా శ్రీమద్భాగవతంలో కూడా ఈ కథను చూడవచ్చు. వామనమూర్తి ముల్లోకాలను ఆక్రమించడం అనే విషయంలో అంతరార్థం ఇక్కడ అర్థం చేసుకోవాలి .
పరమాత్మ తన సర్వవ్యాపకత్వాన్ని వెల్లడించడం చేసినప్పుడు, తానూ ఒక రూపం తీసుకుని నభమునంతా తాను వ్యాపించినప్పుడు, బ్రహ్మ ఆ రూపానికి తన కమండలంలోని జలంతో కాళ్ళు కడిగాడు. ఆ పాదముల దగ్గర గంగమ్మ స్థిరనివాసం ఏర్పరుచుకుంది .
అలాగే, భాగవతంలోని ఎనిమిదవ స్కందంలోను ఈ కథ కనిపిస్తుంది. కానీ దీని అంతరార్థం ఏంటంటే, మూడు అడుగుల నేలలో కూర్చుని సమస్త ఈశ్వర స్వరూపాన్ని చూడక, నువ్వే ఈశ్వరుడవని తెలుసుకోక, అరిషడ్వార్గాలకి బానిసలవుతున్నారు . ప్రపంచమంతా వ్యాపించిన పరమాత్మ మనలోనూ ఉన్నారని గ్రహించలేక, అనవసరమైన కార్పణ్యాలతో మలినమవుతూ బ్రతుకుతున్నాము. పరిశుద్ధమైన అంతఃకరణంతో ఉంటే, మనం స్వయంగా గంగ అంత పవిత్రులమని చెప్పడమే ఇందులో అంతరార్థం.
స్వయంగా ఆ వేంకటేశ్వరుని స్వరూపం కూడా ఇదే చెబుతుంది కదా ! ఆయన పాడాలని ఆశ్రయించమని , అప్పుడిక ఆశ్రీతుల బాధ్యత తనదేనని ! ఇంతకన్నా గొప్ప సౌందర్యం, ఇంతకన్నా గొప్ప దైవం ఎందెందు వెతికితే మాత్రం దొరుకుతుంది !!
నమో వెంకటేశాయ ! శుభం .
#annamacharya #annamayya #brahmakadiginapadamu
Tags: Annamayya, annamacharya, brahma kadigina padamu,