Online Puja Services

తిరుమలలో తలనీలాలు సమర్పించడం వలన

3.139.239.157

తిరుమలలో తలనీలాలు సమర్పించడం వలన ఫ‌లితం ఏంటీ?
- లక్ష్మి రమణ 
 
భగవంతునికి పూలో,ఫలమో, తోయమో అర్పిస్తే పుణ్యమూ పురుషార్థమూ కానీ, ఈ జుట్టు సమర్పించడమేమిటి ? దానివల్ల కలిగే ఫ‌లితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వ‌స్తుంటుంది. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. తొలిసారి కేశాలు తొలగించే కార్యక్రమాన్ని సంప్రదాయానుసారం వేడుకగా నిర్వహిస్తారు . పాపాలను కలిగివున్నందునే శిరోజాలను ‘శిరోగతాని పాపాని’ అంటారు.
 
నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. భగవంతునికి ఇలా భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం. ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు కేశాలను ఇస్తాం. తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన వుంది. జయద్రధుడు(సైంధవుడు), దౌపదిని చెడు దృష్టితో చూస్తాడు.  కౌరవుల సోదరి దుశ్శల భర్త ఈ సైంధవుడు. అంటే, పాండవులకి కూడా దుశ్శల  ఆడపడుచు,  సైంధవుడు ఆమె భర్త. అయినా, భార్యని అవమానించాడనే కోపం భీముడికి పట్టశక్యం కాదు .  అతనిని సంహరించేందుకు భీముడు సిద్ధపడతాడు . ఆ  నేపథ్యంలో ధర్మరాజు తమ్ముణ్ణి వారిస్తాడు. చెల్లెలి పసుపు కుంకుమలు తీసేస్తూ , అతన్ని వధించడం అన్నలుగా తమకి ధర్మసమ్మతం కాదని హితవు చెబుతాడు . అలా అని అతన్ని వదిలేయమనలేదు . ఆ పనికి పురికొల్పిన అతని అహంకారాన్ని తుంచేయమన్నారు. తల వెంట్రుకలను తీసేస్తే, తల తీసేసినంత పనవుతుందని ధర్మరాజు ధర్మసూక్ష్మాన్నీ వివరిస్తాడు. అప్పుడు సైంధవుడికి గుండు గీస్తారు. అదే విథంగా రుక్మిణిని తీసుకెళుతున్న మాధవుణ్ణి ఎదుర్కొన్న ఆమె అన్న రుక్మికి కూడా భగవానుడు అదే శిక్షవేస్తారు. 

దీనిని బట్టి , తలపైన వెంట్రుకలు అనేవి, మన అహంకారానికి ప్రతీకలని తెలుస్తోందికదా ! ఆ అహంకారమే భగవంతునితో వైరానికి కారణం . అహాన్ని తొలగిస్తే, ఆ పరమాత్మ స్వయంగా మనల్ని ఆదరిస్తారు . ఆయన వాత్సల్యం మనకి అర్థమవుతుంది . ఆ పరమాత్మకీ , మనకీ ఉన్న అడ్డుతెర ఆ అహంకారం మాత్రమే కదా ! అందుకే తలనీలాలిస్తే చాలు, మన అహంకారాన్ని తీసి ఆ స్వామీ పాదాల దగ్గర పెట్టినట్టే. అహంకారానికి ప్రతీక అయినా మన శిరస్సుని ఖండించి ఆయనకి అర్పించినట్టే . ఆయన అనుగ్రహించడానికి , ఆ కరుణని దోసిళ్ళతో ఆస్వాదించడానికి మనం ఇంతకన్నా ఏం చేయగలం ?  ఇంతకన్నా భగవంతునికి సమర్పించగలిగేది మరేదీ లేదు కూడా .  
 
 ఇక కలియుగానికి అధిదేవుడైన ఆ వేంకటేశ్వరుడు అధివశించింది దక్షిణాదిలో ఉన్న తిరిమలగిరులనైనా , ఆయన దేశవిదేశాలలో అశేషమైన భక్తులు కలిగినవారు. ఆయనకీ తలనీలాలు అర్పిస్తామని, పుట్టువెంట్రుకలు ఆయన కళ్యాణకట్టలోనే తీయిస్తామనీ మొక్కుకునేవారు , దానిని ఒక సంప్రదాయంగా పాటించేవారు అనేకమంది. అందువల్ల ఆయనకీ కేశ సమర్పణ చాలా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. 
 
తిరుమలలో క్షవరం చేయడం అని పలకరు, కళ్యాణం అని పలుకుతారు . మన సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని చెప్పడం అందుకు కారణం కావొచ్చు .   క్షవరం అనే బదులు కల్యాణం అని పలకాలని జనమేజయుడి సోదరుడైన శతానీకుడు సూచించినట్టు మన ఇతిహాసం చెబుతోంది. దీంతో కల్యాణమనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలక్రమంలో కల్యాణకట్టగా ఆ పేరు  స్థిరపడింది.
 
వేం అంటే పాపాలు కట అంటే తొలగించేవాడు అందుకనే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వేంకటనాయక అంటారు. కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే. అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది.

#tirumala #venkateswaraswami #venkateswara #thalaneelalu

Tags: Venkateswara, Tirumala, Tirupati, hair, thalaneelalu. Swamy,
 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi