తిరుమల శ్రీవారికి ధర్మామీటరు పెడితే,
తిరుమల శ్రీవారికి ధర్మామీటరు పెడితే, యెంత ఉష్ణోగ్రత చూపిస్తుందో తెలుసా !
లక్ష్మీ రమణ
తిరుమలేశుడు ఎవరో బొమ్మని చెక్కితే తీసుకొచ్చి నిలబెట్టినవాడు కాదు. తనకుతానుగా కలియుగోద్ధరణకోసం భువికి వచ్చి స్థాణువైన వాడు. స్వయంగా వ్యక్తమైన అటువంటి స్వామి నిత్యం 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటారట .
100 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే , మనం జ్వరంగా ఉందని డాక్టరు దగ్గరికి వెళతాం . మందులు వేసుకుంటాం . కానీ, వెంకటేశ్వర స్వామీ నిత్యం 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటారని చెబుతున్నారు పురోహితులు.
పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు.వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం శ్రీ వేంకటేశ్వరుడు.
అలా తిరుమల కొండలపైన కొలువైన శ్రీవారి మూలవిరాట్టు నిజానికి ఒకరాతి శైలే అయితే, చల్లగా ఉండాలి. ఆ తిరుమల కొండ దాదాపు మూడు వేల అడుగుల ఎత్తు కలది మరి . ఎప్పుడూ చల్లని వాతావరణంతో కూడిన ప్రదేశము. ఇక పైన నిత్యం ఎడతెగని భక్తులు బారుతీరి ఆయన దర్శనానికి వస్తూనే ఉంటారు. ఆ వాకిలి తెరిచే ఉంటుంది, భక్తులని ఆహ్వానిస్తూ !! తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం కూడా చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. అయినా కూడా 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆస్వామి ఉంటారని చెబుతారు ఆయన సేవకి నోచుకున్న అర్చకస్వాములు .
ప్రతి గురువారం అభిషేకానికి ముందు, వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.
వెంకన్న గురించిన ఎన్నో అద్భుతమైన విశేషాలలో ఇది కూడా ఒకటి ! నమో వెంకటేశాయ !!