Online Puja Services

తెలంగాణా లోని చిన తిరుపతి - వట్టెం వెంకన్న కొండ .

18.189.184.99

తెలంగాణా లోని చిన తిరుపతి - వట్టెం వెంకన్న కొండ . 

తెలంగాణా రాష్ట్రం లోని నాగర్ కర్నూల్ జిల్లా , బిజినేపల్లిమండలంలోని వట్టెం  గ్రామంలో 
‘వెంకన్నకొండ’ పైన కొలువయ్యాడు కోనేటిరాయడు. బిజినేపల్లినుండీ 6 కిలోమీటర్లు, వనపర్తి నుండీ 35 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కలియుగ దైవం నెలకొన్న కొండ. ఈ కొండని తొలుత అడ్డగట్టు గా పిలిచేవారు. శ్రీవారి ప్రభావంతో, ఆవిర్భావం తో ప్రభవించిన వెలుగులతో ఈ అడ్డగుట్ట నేడు వెంకన్న కొండగా మారి అడుగడుగు దండాలు అందుకొంటోంది.

ప్రయాణం :

తెలంగాణా చిన తిరుపతిగా  సుప్రసిద్ధమైన  ఈ క్షేత్రానికి ప్రయాణం భక్తులకు ఒక మరపురాని ఆధ్యాత్మికానుభూతిగా మిగిలిపోతుందనడంలో సందేహంలేదు .  దారంతా పరుచుకున్న పచ్చదనం, మెలికలు తురుగుతూ  ఆదిశేషున్ని గుర్తు తెచ్చే మలుపులు , మెలికల నడుమన స్వచ్ఛంగా ఒదిగిపోయిన పల్లె సోయగం …. ఉరుకుల పరుగుల జీవనసరళికి ఆటవిడుపులా అనిపిస్తుంది .  అక్కడి ప్రకృతిలో ప్రతి అణువునా గోవింద నామం నిండిఉందేమో అనిపిస్తుంది . 

విష్ణుసేవకుల్లో అగ్రగణ్యులనదగిన వారు ముగ్గురు  శేషతల్పమైన ఆదిశేషుడు, వాహనమైన గరుక్మంతుడు, దాసానుదాసుడైన హనుమంతుడు. శ్రీనివాసుడు వెంకటేశునిగా అవతరించే శుభ ముహూర్తంలో, స్వామి ఆదేశానుసారం గరుక్మంతుడు, హనుమంతుడు చెరో పాదరక్షనూ ఇద్దరు చర్మకారుల వద్ద చేయించి తెచ్చారని శృతి వచనం. అలా వేంకటేశుని దూతలై ఆయన భక్తులను బ్రోచే పనిలో వీరిద్దరూ ముందు వరుసలో నిలుస్తారు. అందికే కాబోలు తానెక్కడ ఉన్నా తనతో పాటే వీరినీ వెంట తీసుకు వెళతారు స్వామి.  అడ్డగుట్టకు వెళ్ళే దారిలో,  మలుపుల మెలికల రూపంలో ఆదిశేషుడే భక్తులను వెంటతీసుకొని వేంకటేశుని గుట్టవైపుగా ముందుకు సాగితే, నిలువెత్తు గరుక్మంతుడు, హనుమంతుడు బాటకు ఇరువైపులా  నిలిచి స్వామిసన్నిధికి స్వాగతిస్తారు . 
  
పరమాత్మ అభివ్యక్తిని తన ఆనందంతో వెల్లడిచేస్తుంటుంది ప్రకృతీమాత .  ఈ వెంకన్న కొండను చూస్తే ఆ మాట అక్షర సత్యం అనిపిస్తుంది. ఈ కొండ వనమూలికలకు నిండైన అండ .  విలువైన వృక్ష జాతులతో పచ్చగా కనిపిస్తుంటుంది .  ఆచార్యద్వారాన్ని దాటుకొని కొండపైకి చేరుకుంటే , ఇరువైపులా తీర్చిన మెట్ల తో చెంతకు ఆహ్వానిస్తూ కనిపిస్తుంది స్వామి కోనేరు . మానవ నిర్మితమే అయినా ఈ కోనేటిలోని నీరు  చాలా స్వచ్ఛంగా ఉంటాయి . ఈఆలయ ధ్వజస్తంభం పైన అలా ఆయన దాల్చిన దశావతారాల విశేషాలు చూడొచ్చు .  


శ్రీవారు :

సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ముఖమండపంలోకి అడుగు పెట్టగానే ఆహ్లాదకరంగా అనిపిస్తూ వుంటుంది. జయ విజయులు ద్వారానికి ఇరువైపులా కావలి నిలువగా  … ప్రధానఆలయంలోని వెంకటేశ్వరుడు  ప్రసన్న వదనంతో నిలిచి ఉంటారు . చక్కని రూపు ... చల్లని చూపు వేంకటేశ్వరస్వామి సొంతం. అచ్యుతుడు అలంకార ప్రియుడు కదా , ఏ అవతారంలో ఉన్నా సౌందర్య దీప్తితో ప్రకాశిస్తూనే ఉంటాడు . శ్రీవారు శంఖ , చక్ర , గదా, హస్తాలతో చతుర్భుజునిగా దర్శనమిస్తారు.   వెంకటేశునిగా  స్వామి భక్తుల పాపాలను నాశనం చేస్తారని ప్రతీతి .  అందుకే ఆయన ప్రాంగణంలోకి ప్రవేశించగానే మానసిక ప్రశాంతత లభిస్తుంది. స్వామి నీలమేఘశ్యాముడై, తులసీ మాలలతో, పుష్పమాలా శుశోభితంగా దర్శనమిస్తారు  .ఈ ఆలయ వైశిష్ట్యం అపారమని, ఈ కొండపైని స్వామి కరుణాసముద్రుడని స్థానికుల విశ్వాసం.

దేవేరులు :

శ్రీవారి తోపాటు ఇక్కడ  దేవేరులు పద్మావతి , గోదామాత నెలకొని ఉన్నారు . నిరుపేదగా ఉన్న వెంకటవిభుని పతిగా వలచి వలపించిన   రాకుమారి  పద్మావతి. మధుర భక్తిలో తననే శ్రీ రంగనాధునిగా భావించి, ఆయన కోసం ఎంచి , అల్లిన మాలలను తాను ధరించి, అటుతర్వాత స్వామికి ధరింపజేసిన రంగనాయకి గోదాదేవి. ఈ ఇరువురూ స్వామికి సర్వస్య శరణాగతి చేసి, పరమాత్మ ప్రేమకి వశుడని నిరూపించారు. మధురమైన  భక్తి మార్గాన్ని ప్రబోధించారు . అలా స్వామిని చేరిన గోదామాత ఆత్మ, పరమాత్మల నడుమ భేదం లేదని, సర్వం పరమాత్మ స్వరూపమేనని తన చిరునగవుల మాటున పురుషోత్తముని చేరే దారిని చూపిస్తుంటుంది. ఇక  ఈ పరతత్వాన్ని గ్రహించి అనంతుని చేరి అమృత ఆనందాన్ని అనుభవించమని పద్మావతి ప్రబోధిస్తుంటుంది.

వట్టెం వెంకటేశ్వరాలయం చారిత్రిక వైభవం:

వట్టెం వెంకటేశ్వరాలయం చారిత్రిక వైభవం సుప్రసిద్ధమైనది. సత్యం ఉన్న స్వామని  ఇక్కడి ప్రజలు శ్రీవారి గురించి చెప్పుకునే కథలు మనకి తెలియజేస్తాయి. చుట్టుపక్కలున్న ఉపాలయాలు , గోసేవా నిలయాలు దర్శనీయాలు . 

వెంకటాచలపతి  ఆవిర్భావం పుట్టలోనుండే జరిగిందని ఆయన చరిత చెబుతుంది. పుట్టనుండీ బయటకొచ్చిన స్వామిని పొరపాటున గొడ్డలితో కొట్టిన గొల్లవాని చరిత సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే, ఇక్కడ వట్టెం వేంకటేశుడు కూడా పుట్టనుండే ఆవిర్భవించడం ఒక అద్భుతంగా ఇక్కడి స్థానికులు చెప్పుకుంటారు. ఈ ప్రాంతానికి దగ్గరలోని గ్రామంలో నివసించే ఒక యాదవుడు ఇక్కడ పుట్టను గుర్తించి పూజలు చేస్తుండేవాడు .  ఆతర్వాత క్రమంగా ప్రజలు వారానికొకసారి ఇక్కడ పూజలు నిర్వహించడం మొదలయ్యింది. అయితే శ్రీవారు స్వయంగా ఆ భక్తునికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి తానూ ఇక్కడే ఉన్నాన ని , ఆలయాన్ని నిర్మించమని ఆనతి ఈయడంతో ఇక్కడ  ఆలయనిర్మాణం మొదలయ్యింది. గ్రామ పెద్దలతోపాటు నాటి జిల్లా కలెక్టరుగారి  సాయాన్ని సముపార్జించి, శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ గారి నేతృత్వంలో  ఇప్పటి ఈ ఆలయ నిర్మాణాన్నీ పూర్తి చేశారు.  

ఆలయంలోని ఇతర విశేషాలు  :
ప్రధాన ఆలయంలో  ఆంజనేయుడు , గరుడాళ్వార్ లను దర్శించుకోవచ్చు . ఇక సమీపంలోనే    పరమపదాన్ని ప్రబోధించిన ఆచార్యులు రామానుజాచార్యులు ఇక్కడకి వచ్చే భక్తులను అనుగ్రహిస్తున్నట్టు ఆశీనులై కనిపిస్తారు . చుట్టూ ఉన్న స్వామీ ఉద్యాన వనం పూలతో అలరారుతూ సుగంధ పరిమళాలతో విరాజిల్లుతూ ఆహ్లాదకరంగా ఉంటుంది. 

 గోపాలుడు, గోవులది  - లక్ష్మీ నారాయణ సంబంధం. నీలమేఘశ్యాముడు ఎక్కడుంటే , అక్కడ లక్ష్మీదేవి గోవుల రూపంలో నెలకొని ఉంటుంది. సాక్షాత్తూ కామధేనువులై  ఇక్కడి గోశాలలో ఆవులు స్వామి కైంకర్యాలలో పాల్గొంటున్నాయి. గోసేవను చేసుకోదలచినవారు ఈ గోమాతలను దర్శించి తరిస్తుంటారు . ఇక్కడ భక్తులకు నిత్యమూ అన్నదానం నిర్వహిస్తుంటారు . 

భక్తితో తపమాచరించిన ఆదిశేషుడు, పిపీలికం, చింతచెట్టులను అనుగ్రహించేందుకు వైకుంఠాన్ని వదలి వచ్చిన స్వామి భక్తితో చేసే ఒక్క నమస్కారానికి పరమానంద భరితుడవుతాడు .  ఒక్క క్రీగంటి చూపుతో సకల సంపదలూ అనుగ్రహిస్తాడు. ఆ సిరినివాసుడు కొలువైన వట్టెం వెంకన్న కొండ  ఎల్లరకూ దర్శనీయం.శుభం .

- లక్ష్మి రమణ 

Quote of the day

The moment I have realized God sitting in the temple of every human body, the moment I stand in reverence before every human being and see God in him - that moment I am free from bondage, everything that binds vanishes, and I am free.…

__________Swamy Vivekananda