స్వామి వారి నైవేద్యం కథ
పూర్వం తొండమాను చక్రవర్తి స్వామివారిని బంగారు తులసి దళాలతో పూజ చేసేవాడు. కొంతకాలానికి ఎవరు ఈ విధంగా చేసి ఉండరు అనే గర్వం తొండమానుడికి బయలుదేరింది. ఈ విధమైన భావంతోనే ఒకరోజు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే సమయమునకు తాను పూజించిన బంగారు తులసి దళాలు ప్రక్కకు తోయబడి, మట్టితో చేసిన పూలు స్వామివారి పాదాలపై వేయబడి ఉన్నాయి. అది చూసిన తొండమానుడు ఆశ్చర్యానికి లోనై, స్వామి వారిని ప్రార్థించాడు.
అది ఆలకించిన స్వామి. "రాజా! నీవే కాదు. నాకు ప్రియమైన భక్తులు అనేక మంది ఉన్నారు. అటువంటి వారిలో భీముడు ఒకడు. కుండలు చేసుకుని జీవించే కుమ్మరి అయినా భీముడు చెక్కతో నా విగ్రహాన్ని ఇంటిలో ప్రతిష్టించి, ప్రతిరోజు కుండలు చేసిన తర్వాత చేతులకంటిన మట్టితో పూలు చేసి వాటితో నన్ను పూజిస్తాడు. అవే ఈ మట్టి పూలు. "నాకు బంగారపు పూలైన, మట్టి పూలైనా ఒక్కటే. అవి సమర్పించడం వెనుక ఉన్న భక్తే నాకు కావాల్సింది" అని పలికాడు.
స్వామి వారి మాటలు విని జ్ఞానోదయమైన తొండమానుడు మరియు స్వామివారు భీముని ఇంటికి చేరారు. శ్రీ వేంకటేశ్వరుని చూసిన ఆనందంతో భీముడు పరిపరి విధములుగా కీర్తించి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని కోరగా, స్వామివారు అందుకు అంగీకరించగా పగిలిన మట్టి పెంకు (ఓడు)లో సంకటి తెచ్చి స్వామివారికి అందించాడు. స్వామివారు స్వీకరించారు. ఇది చూసిన తొండమానుడు భక్తి పారవశ్యంలో మునిగి పోయాడు.
అప్పటినుండి ప్రతిరోజు సగం పగిలిన మట్టి పెంకు (ఓడు) లో నివేదన పెట్టే ఆచారం ఏర్పరిచాడు. ఇప్పటికీ నిత్యం నైవేద్యం కుండ పెంకులోనే సమర్పించబడుతుంది. వివిధ రకాలైన పిండి వంటలు గంగాళాలా కొద్ది నైవేద్యంగా సమర్పించబడుతూ ఉన్నా, అవన్నీ గర్భాలయానికి ముందున్న శయనమండపంలోనే నివేదిస్తారు. ఒక్క ఓడు నైవేద్యం మాత్రం గర్భాలయంలోకి తీసుకువెళ్లి నివేదిస్తారు. ప్రతిరోజు నివేదన కొరకు కొత్త కుండ పెంకునే ఉపయోగిస్తారు. అందువల్లనే స్వామివారికి "తోమని పళ్లాల వాడు" అనే పేరు ఏర్పడింది. కాగా కుమ్మరి భీముడు కురవతి నంబి గా ప్రసిద్ధి చెందాడు.
- sekarana