సుప్రభాత సమయం, క్రమం మీకు తెలుసా?
సుప్రభాత సమయం, క్రమం మీకు తెలుసా?
ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తం (2.30 నుండి 3.00) గంటల మధ్యలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. ఆ సమయంలోనే 'సన్నిథిగొల్ల' దివిటీ పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైఖాసన అర్చకస్వామి ఇంటికి వెళ్తారు. వారు కూడా స్నానసంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తిచేసుకుని సన్నిథిగొల్ల రాకకోసం ఎదురు చూస్తుంటారు. సన్నిథిగొల్ల శ్రీవారి ఆలయానికి విచ్చేయమని ఆయన్ను స్వాగతిస్తారు. అప్పుడు అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే 'కుంచెకోల' అనే సాధనాన్ని తాళం చెవులను తీసుకుని శ్రీవారిని స్మరిస్తూ సన్నిథిగొల్లని అనుసరిస్తూ మహాద్వారం వద్దకు చేరుకుంటారు.
అర్చకస్వాములు మహాద్వారం వద్దకు రాగానే 'నగారా' మండపంలోని నౌబత్ ఖానా (పెద్ద పలకగంట)ని హెచ్చరికగా మోగిస్తారు.
ఆ ఘంటారావం తర్వాతే ముఖద్వారాన్ని తెరుస్తారు.
సన్నిథిగొల్ల వెంట నడుస్తున్న అర్చకులు ప్రధాన ద్వార దేవతా గణానికి మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయం లోపలికి ప్రవేశిస్తారు.
తమ వద్ద ఉన్న 'కుంచెకోల'ను, తాళం చెవుల్ని ధ్వజస్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు.
వారు క్షేత్ర పాలకులకు, ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణం చేసి వెండివాకిలి దాటి, బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు.
సన్నిథిగొల్ల అర్చకులను అక్కడే వదిలి శ్రీవారి సన్నిధి వీధిలోని బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్తారు.
ఆ సమయానికి జియ్యంగారు కానీ వారి పరిచారకుల్లో ఎవరైనా ఏకాంగి కానీ సిద్ధంగా ఉంటారు కాబట్టి వారిని తోడ్కొని సన్నిథిగొల్ల ఆలయానికి వెళ్తారు.
సరిగ్గా ఆ సమయానికి ఆలయ అధికారి పేష్కారు, శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేదపండితులు అందరూ బంగారు వాకిలిముందు సిద్ధంగా ఉంటారు.
తాళ్ళపాక అన్నమయ్య వంశం వారిలో ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడడానికి సిద్ధంగా ఉంటారు.
సుప్రభాత సేవ కోసం రుసుం చెల్లించిన భక్తుల్ని అప్పుడు బంగారు వాకిలి వద్దకు అనుమతిస్తారు. పైన పేర్కొన్న వారందరి ముందు అర్చకులు తమ దగ్గరున్న తాళం చెవితో గడియకు వేసిన తాళాన్ని తీస్తారు.
సన్నిథిగొల్ల పేష్కారు వద్దనున్న సీలువేసిన చిన్న సంచిలో ఉన్న తాళం చెవులతో, సీలువేసి ఉన్న మూడు పెద్ద తాళాలను తీస్తారు. తీసే సమయంలో అక్కడున్న అందరికీ చూపించడం ఆనవాయితీ.
తాళాలు తీసిన తర్వాత సన్నిథిగొల్ల బంగారు వాకిలి తెరచుకొని దివిటీతో లోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాతే అర్చకులు మధురస్వరంలో "కౌసల్యా సుప్రజా రామా ...'' అంటూ సుప్రభాతం అందుకొంటూ లోనికి ప్రవేశిస్తారు.
ఆ తర్వాత మహంతు, మఠం వారు తెచ్చిన 'పాలు, చక్కర, వెన్న, తాంబూలం' ఉన్న పళ్లెరాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకొని వెళ్తారు.
వారటు లోనికి వెళ్ళగానే బంగారు వాకిలిని దగ్గరకు వేస్తారు.
బంగారు వాకిలి ముందునున్న వేదపండితులు అర్చకులు సుప్రభాత గీతాలాపనాను కొనసాగిస్తారు.
సుప్రభాతంలో స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం పూర్తయిన తరువాత అన్నమయ్య వంశీయులు భూపాలరాగంలో ఒక మేలుకొలుపు కీర్తన గానం చేస్తారు.
సన్నిథిగొల్ల వద్దనున్న దివిటీ వెలుగులో అర్చకులందరూ రాములవారి మందిరానికి వేసిన తలుపు తాళాలను తీసి శయన మండపంలో పానుపుపై ఉన్న భోగ శ్రీనివాసమూర్తికి ప్రదక్షిణంగా సన్నిధికి చేరుకుంటారు.
దివిటీతో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిథిగొల్ల 'కులశేఖర పడి' వద్ద నిలిచి ఆ వెలుగులో శ్రీవారి దివ్యమంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు.
ఆ తరువాత అర్చకులు, ఏకాంగి 'కులశేఖరపడి' దాటి లోపలికి ప్రవేశిస్తారు.
తరువాత సన్నిధిలోని దీపాలను వెలిగిస్తారు. అర్చకులు శ్రీవారికి పాద నమస్కారం చేస్తారు.
తరువాత శయన మండపంలో బంగారుపట్టు పరుపుపై పవళించి ఉన్న భోగ శ్రీనివాసమూర్తిని సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు. ఆ విధంగా ఆయన్ని మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు.
ఆపైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో ... మూల మూర్తి సన్నిధిలో వేంచేపు చేస్తారు.
ఆనంద నిలయంలో కులశేఖరపడి వద్దనున్న తెరవేసి అర్చకులు శ్రీవారికి దంతధావన, ఆచమనాది అనుష్ఠాన క్రియలను సమర్పిస్తారు.
మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం, పాలు, చక్కెరలను నివేదన చేసి, స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు.
బంగారు వాకిలి ముంగిట్లో వేదపండితులు (సుప్రభాతం) మంగళా శాసనాన్ని ముగిస్తూ ఉండగా, లోపల అర్చకులు శ్రీవారికి నవనీత హారతి ఇస్తుంటారు. 'నవనీత హారతి' అంటే నివేదనాంతరం ఇచ్చే కర్పూర హారతిని నవనీత హారతి అని పిలుస్తారు. ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు.
అపుడు శ్రీవారి పాదాలపై తులసీదళాలు, పుష్పాలు కూడా ఉండవు. భక్తులకు ఆపాదమస్తకం స్వామి దివ్యమంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది. అందుకే ఈ దర్శనాన్ని 'విశ్వరూప సందర్శనం' అని భక్తితో పిలుస్తారు.
ఈ హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మతీర్థాన్ని, చందనాన్ని, శఠారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జియ్యంగారికి, ఎకాంగికి ఇస్తారు. సన్నిథిగొల్లకు కూడా తీర్థం, శఠారితో పాటు నివేదన పళ్ళెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు.
దీని తరువాత జియ్యంగారు, ఏకాంగి, సన్నిథిగొల్ల బంగారు వాకిలి వెలుపలకు వస్తారు. దేవస్థానం పరిచారికలు లోపలికి వెళ్ళి శ్రీవారి పాన్పును, మంచాన్ని బయటగల 'సబేరా' గదిలోకి తీసుకు వెళ్తారు.
సుప్రభాతం పఠించిన వేదపండితులు, అన్నమాచార్య వంశీయులు, మహంతు, మైసూరు సంస్థానం తరపు వారు ఇంకా స్వామి వారి కైంకర్యంలో పాల్గొన్న స్థానీయులు స్వామి వారి సన్నిధికి వెళ్ళి హారతి, తీర్థం, చందనం, శఠారి మర్యాదలు పొందుతారు. వీరందరికీ శ్రీవారికి నివేదించిన చందనం, వెన్న ప్రసాదంగా ఇస్తారు.
ఆ తరువాత ఆలయాధికారులు, సర్కారు (దేవస్థానం) వారి హారతి జరిపి తీర్థచందన నవనీత ప్రసాదం స్వీకరిస్తారు.
స్వామివారి సుప్రభాత సేవకోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్యమంగళ మూర్తిని దర్శించి తీర్థం, శఠారులను స్వీకరిస్తారు.