రావణాసురుడికి స్త్రీలోలత్వం చాలా ఎక్కువ
రావణాసురుడికి స్త్రీలోలత్వం చాలా ఎక్కువ ! అదే అతని మరణానికి కారణమయ్యింది !
లక్ష్మీ రమణ
రావణాసురుడు చనిపోయిన తర్వాత , ఆతని భార్య మండోదరి భర్త శవాన్ని చూస్తూ ఒక్కమాటంటుంది. ‘ నువ్వు బలవంతంగా అణిచి పెట్టిన ఇంద్రియాలు, నువ్వు జయించానని అణగదొక్కిన ఇంద్రియాలు, నువ్వు జయించాల్సిన ముఖ్యమైన శత్రువులు నీమీద పగబూనాయి. అందుకే నువ్వు ఇప్పుడు ఒక మానవుడి చేతిలో ఒక మానవ కాంత కోసం చనిపోయావు’ అని . దీనికి ముందు కూడా రావణుడు స్త్రీల విషయంలో చాలా లోలత్వాన్ని ప్రదర్శించాడని కథలు ప్రచారంలో ఉన్నాయి .
రావణుడి తండ్రి మానవుడు , మహాతపస్సంపన్నుడు, బ్రాహ్మణుడైన విశ్రవసు బ్రహ్మ. రావణుడి తల్లి రాక్షస స్త్రీ అయిన కైకసి. వీళ్ళ సంతానం రావణుడు , కుంభకర్ణుడు , విభీషణుడు , సూర్పణఖ. ఆవిధంగా రావణుడు బ్రాహ్మణుడు. కానీ, అతనిలో రాక్షస లక్షణాలే ఎక్కువ .కర్ణుడు చావుకి సవాలక్ష కారాణాలున్నట్టు , దశకంఠుని చావుకి కూడా అన్నే స్త్రీ శాపాలు కారణమయ్యాయి . ఆయన చెరబట్టిన స్త్రీలు సామాన్యులు కారు .
కన్నుచూసిన సౌందర్యమంతా తన సొంతం కావాలనుకునే మనసున్న వాడు రావణుడు . సీతమ్మ పూర్వ జన్మలో వేదవతి. ఒకసారి రావణుడు పుష్పక విమానంలో వెళ్తూ, తపోనిష్ఠలో నారాయణున్నే భర్తగా పొందాలని తపస్సు చేస్తున్న వేదవతిని చూసి మోహిస్తాడు. అగిశిఖ లాంటి తేజోరాశి అయినా ఆమెని బలవంతం చేయబోతాడు . అప్పుడు వేదవతి యోగాగ్నిలో ప్రాయోపవేశం చేసి, దహించుకుపోతూ, తన వల్లే రావణుడు మరణిస్తాడని శాపం పెడుతుంది.
తన భార్య మండోదరి చెల్లెల్ని కూడా కోరుకుంటాడు రావణుడు. మండోదరి చెల్లెలు మాయ. బలవంతంగా , దౌర్జన్యంగా తనని చేపట్టబోయిన రావణున్ని ‘ స్త్రీ వల్లే నువ్వు చనిపొతావు’ అని శపిస్తుంది .
అంతేకాకుండా వావీవరసా లేకుండా, కుబేరుడి కొడుకు ప్రియురాలు అయినా రంభని మోహిస్తాడు . కుబేరుడు రావణుని అన్న . ఆవిధంగా చూస్తే, రంభ రావణునికి కోడలు వరుస . కొడుకు భార్య . ఆమెను చేరబట్టబోతుండగా, నల కుబేరుడు ఒక శాపాన్నిస్తాడు . అదేంటంటే , ‘ రావణుడు ఏ స్త్రీనైనా బలవంతంగా అనుభవించాలని ప్రయత్నిస్తే తల పగిలి చస్తాడు’ అని.
అందుకే రావణుడు సీతమ్మను తాకలేక, సీతమ్మని ఆమె నిలబడిన భూమితో సహా పెల్లగించి , లంకకు తెస్తాడు. లంకలో కూడా సీతమ్మను చంపేస్తానని బెదిరిస్తాడేగానీ , చేరలేకపోతాడు . అలా రావణుడు ఇంద్రియ చాపల్యాన్ని గెలవలేక , తన చావుని తానె కొనితెచ్చుకున్నాడు .
రామో విగ్రహవాన్ ధర్మః అని మారీచుడు చెప్పినా వినలేదు. సీతమ్మను తీసుకు రావడం తప్పని తిరిగి రామునితో కలపమని మండోదరి,విభీషణుడు,కుంభకర్ణుడు ఎంతగా వారించినా వినలేదు.తన వారందరూ చనిపోతున్నా పట్టించుకోలేదు.కేవలం సీతమ్మను పొందాలని మాత్రమే ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.