భగవంతుని తీర్థం ఇన్నిరకాలుగా ఉంటుందా ?
భగవంతుని తీర్థం ఇన్నిరకాలుగా ఉంటుందా ?
- లక్ష్మి రమణ
గుడిలో దేవుకి మీదకంటే, గుడిలో ఇచ్చే తీర్థ ప్రసాదాల మీదే భక్తి ఎక్కువగా ఉంటుందని చిన్నప్పుడు మా బామ్మ అంటూ ఉండేది. చాలా సందర్భాలలో ఆ మాట నిజమే అనిపిస్తూ ఉంటుంది. కానీ తీర్థ ప్రసాదాలు అనేవి మలమూత్రాదుల్లోకి చేరనంతగా మాత్రమే స్వీకరించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంచితే, ప్రసాదాలు పులిహోర , దద్యోజనం , లడ్డూలు ఇలా రకరకాలుగా ఉంటాయి. అదే విధంగా దేవాలయంలో ఇచ్చే తీర్ధము కూడా విభిన్నంగా ఉంటుందా ? అంటే, నాలుగు రకాల తీర్థాలని గమనించమంటున్నారు పండితులు . ఆ విశేషాలు ఇక్కడ చదువుకుందాం రండి .
ప్రసాదాలు ఎన్నిరకాలుగా ఉన్నా , సాధారణంగా ఆలయాలలో మనకి ఇచ్చే తీర్థము తులసీదళములతో ఉన్న తీర్థము, కొబ్బరి నీళ్లు లేదా పంచామృతాలతో నిండినది ఇవన్నీ కాకుంటే, అభిషేకజలము ఇస్తుంటారు. ఇది మంత్రపూరితమై దివత్వాన్ని పొంది ఉంటుంది .
అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం!
సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!!
అంటూ మూడుసార్లు అక్కడి ఆచార్యవర్యులు తీర్థాన్నిస్తారు . ఈ విధంగా మూడుసార్లు తీర్థాన్నివ్వడంలోనూ గొప్ప ఆంతర్యం ఉంది .
మొదటిసారి తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. అకాల మృత్యువు దరిచేరకుండా ఉంటుంది . రెండవసారి తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. పరివర్తన వలన దోషాలు పరిహరించబడతాయి. సర్వవ్యాధి బాధలు కూడా నివృత్తి అవుతాయి. ఇక, మూడవది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి. దీనివలన సమస్త పాపములు నశించి, భగవంతుని అనుగ్రహం సిద్ధిస్తుంది .
పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు స్వీకరించడం వలన భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. ఇవి సాధారణంగా ఆలయాలలో అనుసరించే నియమాల ఆధారంగా నాలుగు రకాలుగా ఉండవచ్చని పెద్దలు సూచిస్తున్నారు. అవేమంటే,
1) జల తీర్ధం
2) కషాయ తీర్ధం
3) పంచామృత తీర్ధం
4) పానకా తీర్ధం
----
1) జల తీర్ధం
తీర్థాన్నిచ్చేప్పుడు ఆచార్యవర్యులు చెప్పినట్టు అకాలమరణం నివారించబడుతుంది . కష్టాలనుండి విముక్తి లభిస్తుంది . సర్వరోగాలు హరించబడతాయి . బుద్ధి ధర్మ పరివర్తనని పొంది, చక్కని సత్యమార్గంలో వ్యక్తి ప్రయాణించే అవకాశం ఉంటుంది .
2) కషాయ తీర్ధం
ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం, కొల్లూరు ముకాంబిక దేవాలయం,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు .రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలో పంచుతారు. వీటిని సేవెంచటం ద్వారా కనిపెంచే, కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి.
3) పంచామృత అభిషేక తీర్థం
పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటమే కాకుండా , బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని శాస్త్రవచనం.
4)పానక తీర్ధం
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి, అహోబిలం నరసింహ దేవునికి పానకం నివేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి, పానకాల నరసింహస్వామి దేవునిగా వారు ఖ్యాతిని పొందారు. ఈ విధంగా భగవంతునికి అర్పించిన పానకా తీర్ధాన్ని సేవిస్తే, దేహంలో ఉత్సహం పెరిగి, భగవానుగ్రహముతో కొత్త చైతన్యం వస్తుంది. దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది. రక్తపోటు ఉన్నవారికి, తల తిరగడం, నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు రుమాటిజం, ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి. నీరసం దరిచేరదు .
ఆకలి బాగా వేస్తుంది. దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. జీవితంలో శత్రువుల బాధ ఉండదు. బుద్ధి చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది .
ఈ సారి ఆలయంలో కానీ, ఇంట్లోకానీ పూజానంతరం తీర్థాన్ని సేవించేప్పుడు ఈ విషయాలని జ్ఞప్తికి తెచ్చుకొనే ప్రయత్నం చేయండి . శుభం !