సూర్యచంద్రులు ఉన్నంతవరకూ నరకబాధలు పడతారు .
ఇటువంటి వారు సూర్యచంద్రులు ఉన్నంతవరకూ నరకబాధలు పడతారు .
- లక్ష్మి రమణ
పురాణాలలో ఉండే కథల్లో చెప్పిన అంశాలు ఒక్కొక్కసారి ఒకదానితో ఒకటి సరిపోలేకుండా, సామాన్యులని గందరగోళానికి గురిచేసేవిగా ఉండే అవకాశం ఉంది . అయితే అవి ఆ పురాణ కాలానికి సంబంధించినవనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తు ఉంచుకోవాలి . వృతాసుర సంహారానికి తన ఎముకల్ని అస్త్రంగా మార్చి ఇచ్చిన దధీచి మహర్షి త్యాగం అనితర సాధ్యమైనది .అటువంటి దధీచి మహర్షి, శివపురాణంలో హరిహరుల అభేద భావాన్ని వ్యక్తీకరించేలా ఒక సన్నివేశంలో హరిహరులనే ఎదురెదురుగా నిలబెడతారు . అద్భుతమైన ఆ కథని ఇక్కడ మనం చెప్పుకుందాం .
హరిహరుల ఏకీకృత స్వరూపాన్ని గురించి శివపురాణము చక్కని ఉదంతాన్ని చెబుతుంది. పూర్వకాలంలో క్షుపుడు అనే మహారాజు రాజ్యం చేస్తున్నాడు. అతడు వేద వేదాంగములూ తెలిసినవాడు . ధర్మనిరతుడు. గొప్ప విష్ణు భక్తుడు.
భృగు వంశంలో పుట్టిన దధీచి మహర్షి గొప్ప శివ భక్తుడు. వీళ్ళిద్దరూ తరచూ కలుసుకొని ఆధ్యాత్మిక విషయాలపై చర్చిస్తూ ఉండేవారు. అలాగే , ఒకసారి మహారాజు దధీచి ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు ఆయనకు చిన్న సందేహం కలిగింది. ఆయన మహర్షిని ఇలా అడిగారు . “ మునీంద్రా ! ఈశ్వరుడు దిగ్పాలకులలో ఒకరు. పైగా బిచ్చం ఎత్తుకునేవాడు. స్మశానవాసి. ఆయనకన్నా విష్ణువు సర్వమూ వ్యాపించినవాడు. లక్ష్మీపతి. సంపదల్ని అనుగ్రహించేవాడు .అటువంటి విష్ణువును కాదని, ఇల్లు వాకిలి లేని వాడు అయిన శివుడిని ప్రధానంగా ఈశ్వరుడని ఆరాధించడం వింతగా లేదా” అన్నాడు.
ఆ మాటలు విన్న మహర్షి “రాజా భిక్షాటన అనేది నిర్వ్యామోహత్వానికి ప్రతీక . ఇల్లు వాకిలి లేకపోవడం అంటే భవ బంధాలు లేనట్లే. స్మశానంలో ఉంటాడు అంటే, మరణానంతరము కూడా ఉండేవాడు . అంటే నాశనము లేనివాడు . భస్మధారణ చేస్తాడు అంటే, సంపదలు మీద మోహము లేనివాడు. శుద్ధుడు . చైతన్య స్వరూపుడు అని అర్థం . ఆయన దివ్యత్వముని గురించి తెలియకుండా శివుడిని నిందించరాదు. అయినా, కుబేరుడికి నవనిధులను ఇచ్చిన వాడు శివుడే కదా !అటువంటి శివునికి వస్తు వాహనముల మీద బ్రాంతి ఎలా ఉంటుంది ? అలా ఉన్నవాడు పామరుడే గాని పరమేశ్వరుడు ఎలా అవుతాడు ? అన్నాడు.
ఈ వివరణని తన ఇష్టదైవానికి జరిగిన అవమానంగా భావించాడు రాజు. దీంతో కోపగించి మహర్షిని కత్తితో నరికి వెళ్లిపోయాడు. దధీచి ఆఖరి క్షణంలో తన తాత శుక్రాచార్యుని ప్రార్థించాడు. ఆయన వచ్చి దధీచిని బ్రతికించి, మృత సంజీవిని మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. దధీచి మంత్ర జపం చేశాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. మహర్షి కోరినట్లుగా ఆత్మరక్షణకు త్రిశూలాన్ని, వజ్ర దేహాన్ని, మృత్యువు లేని జీవితాన్ని ప్రసాదించాడు.
అప్పుడు దధీచి మహాదానందంతో రాజాస్థానానికి వెళ్ళారు. అప్పుడు రాజు సభ తీర్చి ఉన్నారు. మహర్షి కోపంతో రాజు కిరీటాన్ని ఒక్క తన్ను తన్నాడు. రాజు కూడా కోపించి, తన ఆయుధంతో దధీచిని నరకబోయాడు. శివుని శూలం అడ్డు పెట్టాడు మహర్షి. నిండు సభలో అవమానం భరించలేని రాజు, చేసేది లేక విష్ణువును ప్రార్థించాడు. మహర్షి శివుని ప్రార్థించాడు. శివ కేశవులు ఇద్దరు అక్కడ ప్రత్యక్షమయ్యారు.
కేశవుడు రాజును చూచి “రాజా! బ్రహ్మ తేజము ముందు క్షాత్ర తేజం పనికిరాదు. దధీచి శివ భక్తుడు. శివుడంటే ఎవరనుకున్నావు? నేనే శివుడు. శివుడే నేను. మా ఇద్దరికీ భేదం లేదు. నా భక్తుడు శివుని ద్వేషించినా, శివ భక్తుడు నన్ను ద్వేషించినా వారికి సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరక బాధలు తప్పవు” అన్నాడు.
శివుడు తన భక్తుడైన దధీచిని చూసి , “ మహర్షి నువ్వు రాజును అవమానించకూడదు. విష్ణువు అంశ లేనివాడు రాజు కాజాలడు. రాజు లేకపోతే ధర్మ నాశనము జరుగుతుంది. కాబట్టి మీరు ఇద్దరు హరిహరులకు భేదము లేదని గుర్తించి, ఇదివరకు లాగే సఖ్యంగా ఉండండి.” అని చెప్పి అదృశ్యమయ్యారు.
కాబట్టి శివ కేశవులు ఇద్దరికీ భేదం లేదు వాళ్ళిద్దరూ ఒకటేనని శివపురాణంలోని ప్రథమస్వాసము తెలియజేస్తుంది . మహా శివరాత్రి సమీపిస్తున్న పుణ్య సమయంలో ఈ కథని స్మరించి ఆ పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా గొప్ప పుణ్యఫలం . శుభం . !!