వైశ్వదేవం అంటే ఏమిటి ?
వైశ్వదేవం అంటే ఏమిటి ?
- లక్ష్మీరమణ
స్నానం, సంధ్యావందనం,జపమూ, దేవపూజ ,వైశ్వదేవమూ ప్రతి దినమూ చేయవలసిన విధులని మన పెద్దలు చెప్పారు. దేవతార్చన తర్వాత ఈ వైశ్వదేవం అనే కార్యక్రమం చేయాలి. విశ్వేదేవతలను ఉద్దేశించి చేసే హోమమే వైశ్వదేవం. ఈ దేవతలకు అన్నాన్ని బలిగా (ఆహారంగా) హోమంలో సమర్పిస్తారు . దేవయజ్ఞం ఇది . దీనివల్ల అన్నం పవిత్రమై భోజన యోగ్యం అవుతుంది. అన్నం తినడానికి యోగ్యంగా మారడమేమిటి ? అనే సందేశం వస్తుంది . దానికి సమాధానంగా సనాతన ధర్మం ఇలా చెబుతోంది .
ప్రతిరోజూ గృహస్థులు తప్పనిసరిగా కొన్ని కార్యాలు చేస్తారు వాటివల్ల వారికి పంచదోషాలు (పంచ సూనములు) చుట్టుకుంటాయి . అవేంటంటే,
1. ఖండిని - కూరలు తరగడం
2. పేషిణి - రుబ్బడం
3.చుల్లీ- పొయ్యి అంటించడం
4. ఉదకుంభీ - నీళ్ళ కుండ నేలపై పెట్టడం
5. మార్జని - నేల ఊడ్చడం.
ఇవి దోషాలు ఎలా అవుతాయి అంటారేమో! ఇక్కడే అహింస పరమ ధర్మమని మనవారు ఎంతలా పాటించమని చెప్పారో గమనించండి . ఉదాహరణకి, వంట చేసేందుకు ఉపయోగించే కట్టెలను ఆశ్రయించి కొన్ని రకాలైన క్రిమి కీటకాలు ఉండవచ్చు. ఇల్లు ఊడ్చేప్పుడు , ఆ చీపురు తగలడం వలన కూడా అక్కడ ఉండే సూక్షం క్రిములు, జీవులు చనిపోతాయి . ఇటువంటివే ఇతర దోషాలు కూడా ! మనం వాటిని హింసిస్తున్నాము అనుకుంటే, ఇంటిపని, వంటపని సాగదు కదా ! ఈ దోషాలు అన్నాన్ని లేదా ఆహారాన్ని చేరుతాయి. కాబట్టి దానికి పరిహారంగా పంచ మహాయజ్ఞాలు , వైశ్వదేవమూ చేసి భోజనం చేయాలి. అతిథి సేవ, గోసేవ , జీవకోటికి , దేవతలకు అన్నబలి , ప్రాణులపై దయ ఆచరణ ద్వారా పంచ సూనములు ( పంచ హింసల దోషాలు ) పోగొట్టుకోవాలి.
ఇంట్లో వండిన అన్నం తోనే వైశ్వదేవం చేయాలి .అన్నం సమయానికి లేకపోతే కాయగూరలతో, పండ్లతో చేయవచ్చు. ఇక, అవకాశం లేదు అనుకున్నప్పుడు పూర్తిగా ఉడకని అన్నంతోనైనా, నీటితోనైనా సరే, వైశ్వదేవం చేయాలని చెబుతారు. తాను ఉపవాసం ఉండే రోజున గూడా పంచ యజ్ఞాలకోసం అన్నం వండి వైశ్వ దేవం చేయాలి .
ఇంతకీ పంచ యజ్ఞాలు అంటే ఏమిటి ?
1.బ్రహ్మ యజ్ఞం -నిత్యమూ కుదిరినంతవరకూ వేదభాగం పారాయణ చేయడం
2 .దేవ యజ్ఞం -దేవతల వల్లనే మనకు సౌకర్యాలన్నీ సమకూరుతున్నాయి . ఆహారాదులు , ఆరోగ్యం, కీర్తి మొదలైనవి కలుగుతాయి. కాబట్టి వాళ్లను అర్చించి ఋణ విముక్తులు కావడం.
3.భూతయజ్ఞం- భూతముల అధిష్ఠాన దేవతలకు ధాత , విధాత అనే వాళ్లకూ , క్రిమి, కీటక, పశు, పక్ష్యాదులకూ ఆహారం సమర్పించడం.
4. పితృ యజ్ఞం - మరణించిన పితరులకు స్వధా కారంతో అన్నం, జలం అర్పించడం
5.మనుష్య యజ్ఞం - ఇంటికి వచ్చి న అతిథులను నారాయణ స్వరూపులుగా భావించి మర్యాదలు చేయడం.
( గీతా ప్రెస్—నిత్య కర్మ, పూజా ప్రణాళిక గ్రంథం 2018 ప్రచురణ
ఆధారంగా)
#vaiswadevam, #panchayajnam
Tags: vaiswadevam, panchayajnam, panchasoonam,