Online Puja Services

సర్వదేవతారాధనకూ కార్తీకమాసం

3.21.159.223

#సర్వదేవతారాధనకూ కార్తీకమాసం శ్రేష్టమైనదని ఎందుకు చెబుతారు ?
- లక్ష్మి రమణ  

కార్తీకమాసంలో శివారాధనకే ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూంటారు . అయితే కార్తీకమాసం సర్వదేతారాధనకీ అత్యంత అనుకూలమైనదని విశ్లేషిస్తున్నారు పండితులు. దానికి వేదములలోని నక్షత్ర శాస్త్రముతోకూడా అనుబంధమున్నట్టు వారు చెబుతున్నారు . శివకేశవులతోపాటు మిగిలిన దేవీదేవతలు అనుగ్రహాన్ని పొందేందుకు ఈ మాసంలో పూజలు నిర్వహించడం అత్యంత శ్రేష్టం అని చెబుతున్నారు. అసలు ఇంతటి ప్రాముఖ్యత కార్తీకమాసానికి ఎలా వచ్చింది ? 

శివారాధన : 
కార్తీకమాసంలో శివారాధన శ్రేష్టమైనదని మనందరికీ తెలిసిన విషయమే . అయితే, శివాపురాణాంతర్గతమైన ఒక గొప్ప విశేషాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. శివయ్య బోళాశంకరుడు . అందుకే శివుణ్ణి ఉద్దేశించి మనం ఏది సమర్పించినా కూడా అది గొప్ప ఫలితాన్ని అందిస్తుంది . ఒక  నమస్కారం చేసినా, ఒక పుష్పం , ఫలం , జలం ఇలా ఏది మనస్ఫూర్తిగా అర్పించినా కూడా అనంతమైన ఫలితాన్ని అందించేవాడు ఆ భోళాశంకరుడు . ఈ కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం, ఆ జ్యోతులతో ఆ దేవదేవుని ఆరాధించడం  పూజించడం  శివుని అవతారవిశేషాన్ని ప్రతిబింబిస్తుంది . ఆయన అగ్ని స్వరూడైన స్వామి. ఈ మాసంలో సర్వ దేవతారాధన అందులోనూ ఆదిదేవుడైన శివారాధన ఈ మాసంలో అత్యంత  ఫలప్రదం . 

నక్షత్రశాస్త్రానుబంధం :
వేదములలో చెప్పిన నక్షత్ర శాస్త్రముతో అనుబంధముంది . 
నక్షత్రాలలో యమదేవతగణ  నక్షత్రాలుగా అనూరాధ మొదలు భరణి వరకూ అని మనకి వేదం చెబుతోంది . ఈ నక్షత్రాలలో ఆసురీశక్తులని వినాశనం చేసే శక్తుఉంటాయి. వీటిని కొన్నిముహూర్తాలకు శాస్త్రం నిషేధించింది .  కృత్తిక నక్షత్రం మొదలుకొని మిగిలిన నక్షత్రాలని దేవతానక్షత్రాలు అంటారు . దేవతానక్షత్రాలకి తొలి నక్షత్రం కృత్తిక అయితే, ఆ నక్షత్రం ఉన్న పూర్ణిమలో మనకి వచ్చేమాసం కార్తీకమాసం .  

కృత్తికా నక్షత్రం నక్షత్రాలకు ముఖం వంటిది అని చెప్పబడింది. ఆరునక్షత్రాలుకలిసి ఈ కృత్తికా నక్షత్రంగా మనకి దర్శమిస్తాయి. ఈ నక్షత్రాలన్నీ కూడా జ్యోతి స్వరూపాలే. ఈ జ్యోతి స్వరూపంలో యున్న  ఆ అగ్ని సంబంధమైన నక్షత్ర దేవదేవతాగణాల యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు మనం జ్యోతులు వెలిగించి, ఆరాధించడం అనేది ఆచారంగా పెట్టారు పెద్దలు . ఈ సంప్రదాయం వెనుక సనాతన ధర్మంలోని ఎంతటి గొప్ప విజ్ఞానం దాగుందనేది  మనం గమనించాలిక్కడ .

కేశవారాధన:
కార్తీకమాసంలో శివారాధనకి యెంత ప్రాముఖ్యత ఉన్నదో కేశవారాధనకి అంతటి ప్రాముఖ్యత ఉన్నది . అగ్నిని ముఖంగా కలిగినవాడు నారాయణుడు అని వేదం చెబుతోంది . విరాట్ పురుషుని వర్ణనలో అగ్నిముఖంగా కలిగిన పరమాత్మని వర్ణించడం జరిగింది .  కృత్తికా నక్షత్రం అగ్నిదేవతా  సంబంధమైనది.  అందువల్ల కేశవారాధన ఈ మాసంలో  అత్యంత విశిష్టమైనది . అందుకే ఈ మాసంలో సత్యనారాయణ స్వామీ వ్రతాలని విశేషంగా నిర్వహించుకుంటూ ఉంటాం .  

కుమారదర్శనం:
కార్తీకమాసంలో వచ్చే పొర్ణమికి కుమారదర్శనం అని పేరుంది . కృత్తికనక్షత్రం అగ్నిసంబంధమైనది అని చెప్పుకున్నాం కదా ! అదే  అగ్నితత్వాన్ని కలిగిన స్వామి కార్తికేయుడు . యజ్ఞాగ్ని స్వరూపం . కృత్తికా నక్షత్ర సమయంలో స్వామి అవతరించారు.  అందువల్లే ఆయనకి  కార్తికేయ అని పేరొచ్చింది .కృత్తికా నక్షత్రదేవతలు ఆరుగురు పసిబాలురుగా రెల్లిగడ్డిలో (శరవణం) అవతరించిన శివతేజస్సును జోలపాడారు . పార్వతీదేవి ఆ ఆరుగురిని షణ్ముఖా అనిపిలవడంతో ఆ ఆరుగురూ ఒక్కరై షన్ముముఖునిగా అవతరించారు .  అందువల్ల ఈ మాసంలో కార్తికేయుని ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనది . 

పార్వతీ పరమేశ్వరుల ఆరాధన : 
కార్తీక పౌర్ణమిలోని విశేషం కూడా ఈ  కార్తీకమాస విశిష్టతని తెలియజేస్తోంది. పౌర్ణమి తిథులలో  కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు ద్విగుణీకృతమైన వెన్నెలతో ప్రకాశిస్తూ ఉంటారు . అందుకే మనకి శరత్చంద్రుడు అనే మాట వచ్చింది . ఇక్కడ కృత్తికా నక్షత్రం అగ్ని తత్త్వం అయితే, ఆ చంద్రుడు జలతత్వం కలిగినవారు . అగ్నితత్వం జలతత్వం జంటగా ప్రభవించే మాసం ఈ కార్తీకం అయితే, ఆ ఆగి, జల తత్వాలు కలిసిన స్వరూపం శివపార్వతులు . స్వామి అగ్నిస్వరూపం అయితే అమ్మవారు జలతత్వాన్నికలిగినదేవి . చల్లని కరుణాకలిగిన అమ్మ . అందువల్ల కార్తీకమాసంలో అర్ధనారీశ్వర స్వరూపాన్ని ఆరాధించడం వలన కూడా గొప్ప ప్రయోజనం చేకూరుతుంది .    

 అందువల్ల సర్వదేవతారాధకూ అనుకూలమైన విశిష్టమైన మాసం కార్తీకం . ఈ మాసంలోని ప్రతిరోజూ కూడా అత్యంత పవిత్రమైన సమయమే . కాబట్టి ఈ సమయంలో ఆ పరమేశ్వరుణ్ణి అర్చించి,  అనంతమైన అనుగ్రహాన్ని పొందుదాం ! శుభం . 

#kartheekamasam #karthikamasam #karthika #sivaradhana #parvathiparameswara #vishnu #nagulachavithi #kumaraswami #ayyappa

Tags: karthikamasam, Kartheeka, masam, shiva, siva, vishnu, kumaraswami, ayyappa, nagulachaviti, parvathi, parameswara


 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi