Online Puja Services

కార్తీకమాసంలో నాగదేవతల ఆరాధన

3.15.143.18

కార్తీకమాసంలో నాగదేవతల ఆరాధన అత్యంత ప్రధానమైనది . 
- లక్ష్మి రమణ 

కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిధికి చాలా ప్రాముఖ్యత ఉంది . దీనినే నాగుల చవితి అని వ్యవహరిస్తుంటాం . శ్రావణమాసంలో వచ్చే చవితి పంచమి లతో పాటుగా పవిత్రమైన కార్తీకమాసంలో వచ్చే చవితి కూడా చాలా ప్రాముఖ్యమైనది . ఇవి నాగారాధనకి విశేషమైన రోజులు. కార్తీకమాసం కృత్తికా నక్షత్రంలో వస్తుంది. సుబ్రహ్మణ్యుని ఆరాధన విశిష్టమైనది . ఆయన సర్పస్వరూపంలో పూజలు అందుకుంటుంటారు. ఇక నక్షత్రాలలో ఆశ్లేషా నక్షత్రానికి అధిపతి ఆదిశేషుడే . గ్రహాలలో రాహు, కేతువులు సర్పస్వరూపాలేకదా ! నాగారాధనకి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం . 

నాగులు  అంటే మన కంటికి కనిపించే సాధారణమైన సర్పములు కాదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న నాగులు దేవకోటికి చెందినటువంటి వారు. దివ్య సర్పాలు . దేవతాస్వరూపములైన ఈ నాగులు మానవులకన్నా ఉన్నతమైన జీవులు.  మానవ జాతికి విజ్ఞానాన్ని అందించిన విశిష్ట జీవులు . అందువల్ల నాగులకీ నరులకీ దగ్గరి అనుబంధం ఉంది అనేది ఆధ్యాత్మికవేత్తల మాట. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం . 

నాగులకి సంబంధిన గొప్ప విశేషాలు మనకి మన పురాణ వాంగ్మయములో   , వేదములలో , ఆగమశాస్త్రాలలో, యోగశాస్త్రములో , ఇతిహాసములలో కనిపిస్తున్నాయి . మహాభారతంలో జనమేజయుడు సర్పయాగం చేశాడు. అప్పుడు ఆయన ఆహ్వానించిన తక్షకుడు దేవ జాతికి చెందినవాడు .  అనంతుడు, వాసుకి , తక్షకుడు, కర్కోటకుడు , శంఖ , కుళిక, పద్మ, మహాపద్మ ఇలా అనేకమంది దివ్యనాగులు మనకి మన వాంగ్మయము లో కనిపిస్తున్నారు. శ్రీ వల్లీ,దేవేసేనాసమేత సుబ్రహ్మణ్యుడు కూడా సర్పస్వరూపముగా ఆరాధనలు అందుకొంటూ ఉంటారు. ఇక మనం ఆరాధించే శివకేశవులిద్దరూ కూడా దేవనాగాభరణాలు ధరించినవారు.  విష్ణుమూర్తిగా స్వామి తన పాన్పుగా ఆదిశేషుణ్ణి మలచుకుంటే, వెంకటేశ్వరునిగా శ్రీవారు నాగ భుజకీర్తులు ధరించి ఉంటారు. ఈ దివ్యమైన నాగుల ఆరాధనే మనకి శాస్త్రము చెబుతున్నటువంటి నాగారాధన. ఇటువంటి దివ్యనాగులు జ్యోతిస్వరూపములో, కాంతి పుంజములుగా దివిలో సంచరిస్తుంటారని శాస్త్ర వచనం . 

అదేవిధంగా భూలోకములో కూడా దేవనాగులు ఉన్నాయి.  అరణ్యాలలో , పర్వతప్రాంతాలలో నిరంతరం యోగములో , తపస్సులో మునిగి ఉండే అనేక మంది యోగులు తన అనుభవాలను మనకు పుస్తకాలుగా అందజేశారు . వాటిల్లోని వారి ప్రత్యక్ష అనుభవాల ద్వారా మనం ఇచ్చాధారులైన నాగ జాతిని విశేషాలు తెలుసుకుంటున్నాం.దేవజాతికి చెందిన నాగులు దర్శనమివ్వడం చాలా అరుదు . అటువంటి నాగులు పరిసారాల్లో ఉంటే ఆ ప్రదేశమంతా ఒక దివ్యమైన పరిమళంతో నిండిపోతుందట . అటువంటి నాగులు దర్శనమివ్వడం కూడా పూర్వజన్మ సుకృతమే. 

దివిలోనూ , భువిలోనూ ఉన్న అటువంటి దివ్యనాగజాతి , దేవనాగముల అనుగ్రహాన్ని పొందేందుకు మనం పుట్టల్లో పాలుపోస్తూ ఉంటాం .  పుట్టల్లో పాలుపోస్తే ఆ పాలు అందులోని సర్పాలు స్వీకరిస్తాయని ఇక్కడ అర్థం కాదు. దృశ్యమాత్రం చేత సంతుష్టిని పొంది అనుగ్రహాన్ని ఇచ్చేవారు దేవతలు . మనం సమర్పించిన నైవేద్యాన్ని వారు ప్రత్యక్షంగా చేయిచాచి తినవలసిన అవసరం లేదు . ఆయాదేవతలు మనం చేసిన ఆరాధన వల్ల  సంతుష్ఠులై అనుగ్రహంతో చూడడం వలన వారికి మనం అర్పించిన పదార్ధం  నైవేద్యంగా మారుతుంది . వారి అనుగ్రహాన్ని మనకి అందిస్తుంది . అదే విధంగా పుట్టల్లో పోసిన పాలు కూడా. పుట్టలు పాములకు నెలవు. కనుక వాటిని పూజించడం అనేది. పుట్టలో పాలు పోసే ముందర మనం చేసే పూజా కార్యక్రమంలో పసుపు, కుంకుమలు ఇచ్చి, సర్వోపచారాలతో నాగదేవతలని పూజిస్తాం .ఆ పూజని దేవతారూపంలోని నాగులు చూసి ఆనందించి , సంతృప్తిని చెంది అనుగ్రహిస్తారని భావన . 

కనుక కేవలం నాగుల చవితి రోజున మాత్రమే కాకుండా మిగిలిన కార్తీకమాసమంతటా కూడా ఆరాధించ తగినవారు. విశేషించి కార్తికేయుని ఆరాధన ఈ మాసంలో అత్యంత ఫలదాయకం . ఆ కార్తికేయుని శుభాశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ శలవు . 

#karthikamasam #nagadevatha #kartheeka

Tags: Kartheeka, Karthikamasam, nagadevatha, aradhana

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi