పంచమూర్తులు ఎవరో తెలుసా?
పంచమూర్తులు ఎవరో తెలుసా?
లక్ష్మీ రమణ
మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు ముప్పై కోట్ల మంది దేవతలు ఉన్నారు. వారు సృష్టి స్థితి లయములకి అవసరమైన అనేకానేక బాధ్యతల్లో తలమునకలుగా ఉంటారు . కోటానుకోట్ల జీవులు నిత్యం పుడుతూ , పోషింపబడుతూ, చనిపోతూ, తిరిగి జన్మిస్తూ … ఇలా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటె, దానినంతా సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆ మాత్రం కార్యవర్గం కావాలిగా ! తానూ ఒక్కడే అయ్యుండీ, అనేకుడిగా రూపుదాల్చిన విరాట్ స్వరూపమే కదా పరబ్రహ్మము . వీటిల్లో ముఖ్యమైన సృష్టి స్థితి లయములకి కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి అందరికీ తెలిసిందే ! అయితే మరి ఈ పంచమూర్తులు ఎవరు?
కోరిన కోర్కెలు తీర్చే వరప్రదాయకులు ఈ పంచమూర్తులు . చాలా మంది త్రిమూర్తులు అయినా బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు మరో ఇద్దరు దేవతలని కలిపి పంచమూర్తులుగా చెబుతుంటారు. కానీ, పంచమూర్తులంటే వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, పరమేశ్వరుడు , పార్వతీదేవి , చండికేశ్వరుడు . వీళ్ళని ఐదుగురిని కలిపి పంచమూర్తులుగా పేర్కొంటారు .
శ్రీకాళహస్తిలో ఏటా శివరాత్రి సందర్భంలో ఈ పంచమూర్తులనూ ఊరేగిస్తారు . నందిపైన అయ్యవారు , కామధేనువు పైన జ్ఞానప్రసూనాంబగా అమ్మ మిగిలిన పంచమూర్తులూ వెంట తరలిరాగా కన్నుల పండుగగా పురవీధులలో ఊరేగవచ్చే ఆ వేడుక కన్నుల పండుగగా ఉంటుంది .
అదేవిధంగా కర్ణాటకలోని నంజనగూడులో కొలువైన రోగులపాలిటి అపారసంజీవనిగా పేరొందిన స్వామీ శ్రీ కంఠేశ్వరుడు కూడా ఏడాదికి రెండుమార్లు జాతర జరుపుకుంటారు . ఆయన కూడా తన పరివారమైన ఈ పంచమూర్తులతోనూ ఊరేగవస్తారు .
కాబట్టి పంచమూర్తులు అంటే త్రిమూర్తుల స్వరూపాలుకాదు . శివపరివారమైన విఘ్నాధిపతి విఘ్నేశ్వరుడు , జ్ఞానప్రదాత సుబ్రహ్మణ్యుడు , కార్యసాధకుడు , అనుగ్రహప్రదాత అయిన చండికేశ్వరుడు పరివారంగా పార్వతీ, పరమేశ్వరులని కలిపి పంచమూర్తులుగా పేర్కొంటారు. ఈ పంచ మూర్తులకు ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని వేద పండితులు సూచిస్తున్నారు.
సర్వే సుజనా సుఖినో భవంతు.