పంచశక్తులలో ఐదవ శక్తి -సావిత్రీ దేవతా ప్రభావం!
పంచశక్తులలో ఐదవ శక్తి -సావిత్రీ దేవతా ప్రభావం!
-లక్ష్మీ రమణ
సావిత్రి అనే పేరు తెలుగువారికి సుపరిచితం . ఈ దేవత గాయత్రీ దేవి స్వరూపం. వేదమాత, పంచశక్తులలో చివరిది. సావిత్రిని పూజించిన వారిలో మొదటి వాడు బ్రహ్మ. ఆ తరువాత వేదగణాలు, పండిత వర్గం సావిత్రీ దేవతను ఉపాసించారు. విశ్వంలో జ్ఞానానికి సంబంధించిన అజేయమైన శక్తి ఏదైనా ఉన్నదంటే , ఆమె సావిత్రీ దేవి . విద్యా, విజ్ఞానం , శక్తి , సుఖము , సౌభాగ్యము , శాంతి ఆ దేవతని ఆరాధించడం వలన కలుగుతాయి . పంచమహా శక్తులలో ఐదవదేవి అయిన ఆ అమ్మవారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
విష్ణు సహస్రనామము ప్రకారము "సవితా" అంటే "సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు"అని అర్ధము. సవితా మహర్షి సాక్షాత్తు ఆ విష్ణువు అవతారమే. శ్రీమద్భాగవతం ప్రకారం సవితా అనే పదానికి అర్థం ఏంటంటే, సకల జగత్తుని సృష్టించి రక్షిస్తున్నాడు , అటువంటి ఆ శక్తి కలవాడు అని .
విష్ణుః సర్వస్య జగతః ప్రసవాత్ సవితేర్యతే ।
ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యతే ॥
సర్వ జగత్తును ప్రసవించినవాడు. కాబట్టి విష్ణువు "సవితా".అని పిలువబడ్డారు . ఇది విష్ణు ధర్మోత్తర పురాణంలోని ప్రథమఖండం చెప్పే మాట .
ధామకార్యం హి క్రియతే యేనాస్య జగతః సదా ।
ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యసే ॥ 15 ॥
ఈ జగత్తుకి కావాల్సిన స్థితిని కల్పించేవాడు, పోషించేవాడు , వెలుగుని ఇచ్చేవాడు కనుక ఆయనని "సవితా"యని పిలిచారు .
సవితా మహర్షి సామవేదం చెప్పిన వారు . అటువంటి స్వయంగా విష్ణువైన మహర్షి కూతురు వేదమాత గాయత్రి. సవితా మహర్షి కుమార్తే కావడం వలన ఆవిడని సవితా, సావిత్రి అని పిలిచారు .
గాయత్రీ మంత్రము యొక్క అర్ధము ఇలా చెప్పవచ్చు, "ఓం, ఓ సవితా దేవీ! ఈ భూమ్యాకాశములు వాటివాటి స్థానములలో నెలకొనియుండడానికి నీవే ములాధారమయి ఉన్నావు, నీవే ఈ భూమ్యాకాశములలో సర్వత్రా వ్యాపించియున్న ప్రాణ శక్తివి అయి ఉన్నావు. అందరికి జీవనాధారము నీవే. నీవు మాపై కరుణ చూపి మాకు సద్బుద్ధిని ప్రసాదించి మమ్ములను ఎల్లప్పుడు ఉత్తేజవంతమయిన స్థితిలో ఉండేలాగున ఆశీర్వదించుము."
భూః, భువః సువహ అనగా భూమి, ఆకాశము మరియి పాతాళము అని అర్థము. ఈ మూడు భువనములకు సవితా దేవి ప్రాణశక్తిని ప్రసాదిస్తుంది అని ఈ గాయత్రి మంత్రము చెబుతుంది. త్రయంబకేశ్వరి స్థల దేవత కాగా సవితా దేవి విశ్వాంతరాళములకు దేవత. అలా ఇద్దరూ త్రిభువనములకు ప్రాణదాతలే అవుతున్నారు అని గ్రహించవలెను.
ఈదేవత అనుగ్రహం ఎంతటి శక్తి వంతమైనదో మనకి సావిత్రీ సత్యవంతుల కథ చెబుతుంది . పూర్వం భరతఖండాన్ని అశ్వపతి మహారాజు పాలించేవాడు. అతని భార్య మాలతి అనుకూలవతి. ఆ దంపతులు సంతతి లేక చాలా కాలం పరితపించారు. వశిష్ఠమహర్షి ఉపదేశానుసారం గాయత్రీ మంత్రాన్ని పది లక్షలు నియమ బద్దంగా జపించి, సావిత్రీ వ్రతం ఆచరించారు.
"తత్త్వకాంచన వర్ణాభాం జ్వలంతీం బ్రహ్మతేజాసా|
గ్రీష్మమధ్యాహ్న మార్తాండ సవిత ప్రభామ్||
వేదాధిష్ఠాతృ దేవీంచ వేదశాస్త్ర స్వరూపిణీం|
వేద బీజ స్వరూపాంచ సావిత్రీం మాతరం భజే||"
అని సావిత్రీ దేవతను ధ్యానించి పూజించగా, సావిత్రీ దేవి ఆ దంపతులకు ఒక పుత్రికను అనుగ్రహించంది. ఆ బిడ్డకువారు 'సావిత్రి' అని పేరు పెట్టుకున్నారు. సూర్యమండలాంతర్గతమైన తేజస్సుకే 'సవిత' అని పేరు. ఆమెయే సావిత్రి. మధ్యాహ్నవేళ జ్యోతిస్వరూపిణిగా ఉపాసకుల హృదయాలలో దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి దివ్యతేజో విశేషం వల్ల తమకు కలిగిన బిడ్డకు ఆ దేవత పేరే పెట్టుకొని ఆ దంపతులు సంతోషించారు.
దినదిన ప్రవర్తమాన మవుతూ ఎదిగిన తన బిడ్డకు , తండ్రి అయిన వివాహం చేయాలని నిశ్చయించి, వరాన్వేషణ ప్రారంభించాడు. కాని సావిత్రి ద్యుమత్సేనుని కుమారుడైన సత్యవంతుణ్ణి భర్తగా భావించి, అతన్నే వివాహం చేసికోదలచినట్లు తండ్రికి చెప్పింది. సత్యవంతుడు రాజ్యభ్రష్టుడని, అల్పాయుష్కుడని విని అశ్వపతి కుమార్తెకు నచ్చచెప్ప చూశాడు. కానీ వరుని విషయంలో ఆమె ప్రకటించిన అభిప్రాయము ఆమె నిర్ణయమే అని గుర్తించి, దైవముపై భారమువేసి సావిత్రిని సత్యవంతునికే ఇచ్చి వివాహం జరిపించాడు.
సావిత్రీ, సత్యవంతులు సంవత్సరకాలం ప్రశాంతంగా దాంపత్య జీవనం గడిపారు. తన భర్త అల్పాయుష్కుడని విని సావిత్రి అనుక్షణం అతన్ని నీడలా అనుసరిస్తూ, పరిచర్యలు చేస్తూ ఉంచేది. ఒకనాడు సత్యవంతుడు అడవికి పోగా, సావిత్రి అతన్ని అనుసరిస్తూ వెళ్ళింది. ఆ అరణ్యంలో కట్టెలు కొడుతూ సత్యవంతుడు చెట్టు నుండి జారిపడి మరణించాడు.
సత్యవంతుని ప్రాణశక్తిని బంధించుకొని పోవడానికి వచ్చిన యమధర్మరాజును సావిత్రి వెంటాడ సాగింది. యముడు ఆమెకు ఎన్నో విధాల నచ్చచెప్పాడు. మానవశరీరంతో తన వెంట రావడం సాధ్యం కాదని, ఆమె భర్తకు కాలం తీరింది కనుకనే తాను పరలోకానికి తీసుకొని పోవుచున్నానని, కర్మఫలానుభవం అనివార్యమని, ఎంత ప్రయత్నించినా భర్తను బ్రతికించు కోవడం అసాధ్యమని- అమెను వెనక్కు మళ్ళించాలని పరిపరి విధాలుగా చెప్పాడు.
యముడు ఏమి చెప్పినా, ఎన్ని చెప్పినా వినక, సావిత్రి అతన్ని అనుసరించ సాగింది. కర్మము, కర్మఫలము, దేహము దేహి, జ్ఞానము, బుద్ధి, ప్రాణము, ఇంద్రియాలు, జీవేశ్వరుల లక్షణాలు మొదలైన అంశాలను గూర్చి ప్రశ్నించి, యమధర్మరాజు చెప్పే సమాధానాలు వింటూ, మరి కొంత దూరం అనుసరించింది.
"ఓ ధర్మదేవతా ! నా భర్త ప్రాణాలను తీసుకొని, నన్ను ఒంటరిగా తిరిగి పొమ్మనడం నీకు న్యాయం కాదు." అని యమధర్మరాజుని నిలదీసింది సావిత్రి. యమధర్మరాజు అమె తల్లి దండ్రులకు పుత్రప్రాప్తిని, అమె అత్త మామలకు నేత్రదృష్టిని వరంగా ప్రసాదించాడు. అయినా, ఇంకా సావిత్రి తనను అనుసరిస్తూ వస్తూ ఉండటం చూచి , యమధర్మరాజు ఆమె పాతవ్రత్య మహిమకు తలఒగ్గి సత్యవంతుణ్ణి బ్రతికించాడు.
"ఓ సావిత్రీ ! నీవు సావిత్రీ దేవతా ప్రభావం చేత నీ భర్తను బ్రతికించుకోగలిగావు. సావిత్రీ వ్రతం స్త్రీలకు సౌమాంగల్య సౌభాగ్య ప్రదం. ఆ దేవతా వరప్రసాదం వల్ల పుట్టిన నువ్వు భక్తి శ్రద్ధలతో, వినయ సౌశీల్యాలతో, ఆధ్యాత్మిక ఆసక్తితో నన్ను మెప్పించావు. నీ భర్తతో కలసి సుఖశాంతులు అనుభవిస్తూ, నారీలోకానికి ఆదర్శమూర్తివై 'సావిత్రి' గా ఆరాధింపబడితావు. అని ఆశీర్వదించి యముడు అంతర్ధాన మయ్యాడు.
ఈ విధంగా పరాశక్తి నుండి ఆవిర్భవించిన దుర్గ, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి అనే పంచశక్తుల వృత్తాంతాలను వ్యాసమహర్షి జనమేజయునకు వివరించాడు.