Online Puja Services

పంచమహా శక్తులలో రెండవ దేవి రాథ.

3.142.212.153

పంచమహా శక్తులలో రెండవ దేవి రాథ. ఈవిడ బృందావన గోపిక కాదు !
-కామకోటి వారి సౌజన్యంతో 

రాధాదేవి పంచమహా శక్తులలో రెండవ దేవి . రాధాదేవి అనగానే మనకి మొదటగా కృష్ణునితో బృందావనంలో ఆడిపాడిన గోపికామాత రాధమ్మ గుర్తుకొస్తారు . కానీ ఈ రాధాదేవి ఆవిడకాదు . ఈవిడ పరాశక్తి అంశ . వైకుంఠాన్ని కూడా అధిగమించి ఆ పైన  తన స్థానాన్ని ఏర్పరుచుకున్న దేవతామూర్తి . పరమ ప్రకృతీ స్వరూపమే ఈ రాధమ్మ . ఆవిడ గురించి జనమేజయ మహారాజుకి వ్యాసమహర్షి వివరించిన కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం . 

పంచశక్తులలో రెండవ శక్తికి 'రాధాదేవి' అని పేరు. ఈ రాధ 'గోకులం'లో ఉన్న గోపిక కాదు. 'గోలోకం'లో నివసించే శక్తిస్వరూపిణి. శ్రీ కృష్ణుని శరీరంలో అర్ధభాగాన్ని స్వీకరించి,అర్ధనారీశ్వరుల వలె ఒకే రూపంగా భాసించింది. ఈ రాధాదేవి పరాశక్తి అంశగా అవతరించింది. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలను దాటి, ఆ పైన గల వైకుంఠాన్ని కూడా అధిగమించి, గోలోకాన్ని తన స్వస్ధానంగా చేసుకున్న శక్తి స్వరూపిణి.

"వినారాధ్య రాధా పదాంభోజ యుగ్మం|
న కృష్ణస్య భక్తిస్సంజాయతే కిల||"

అనే సూక్తిని అనుసరించి, శ్రీ కృష్ణుని యందు నిశ్చల భక్తి కుదరాలంటే, ముందుగా రాధాదేవిని ఆరాధించి, ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అంటే, పరమాత్మ పైన భక్తి కుదరాలంటే, ముందుగా మనం ప్రకృతి స్వరూపమైన రాధమ్మ యొక్క అనుమతిని , అనుగ్రహాన్ని సంపాదించాలి . 

మనం చూస్తున్న ఈ సృష్టి ఇలా వెలువడడానికి పూర్వమే, ఈ సృష్టికి ఆధార భూతమైన ఒకానొక దివ్యశక్తి ఉన్నది. ఆ శక్తికి "పరా ప్రకృతి" అని పేరు. ఆ శక్తి ఈ సృష్టిగా వ్యక్తం కావాలని సంకల్పించుకొని తనంతట తానే రెండుగా విభాగమైంది. 

దక్షిణ భాగం పురుషుడుగా, వామ భాగం ప్రకృతిగా వ్యవహరింపబడతాయి. అగ్ని వేడిమి వలె, చంద్రుడు-వెన్నెల వెలె ప్రకృతి పురుషులకు అభేదం. అందువల్ల యోగులు తత్వవిషయంలో స్త్రీ పురుష భేధాన్ని అంగీకరించరు. మాయతో కలిసిన శక్తి, బ్రహ్మ విష్ణువు మహేశ్వరులుగా పురుష రూపంలోనూ, వాణీ రమా పార్వతులుగా స్త్రీ రూపంలోనూ విరాజిల్లుతోంది. అలాంటి శక్తులన్నింటిలో రాధాశక్తి అత్యంత సౌందర్య స్వరూపిణీగా, పరమానందదాయినిగా, రాసక్రీడలో శ్రీకృష్ణునకు అధిదేవతగా, 'రాసేశ్వరి'గా ఆరాధింపబడుతోంది. 

ఈ శక్తియే వరాహకల్పంలో ఒక గోపికకు పుత్రికగా జన్మించింది. శ్రీకృష్ణుని 'అర్ధాంగి' అయి, తన ప్రభావం చేతనే శ్రీకృష్ణుని చేత సర్వలోక వ్యవహారాలనూ నిర్వహింపచేస్తుంది. తేజో రూపిణిగా అండ పిండ బ్రహ్మాండాలలో వ్యాపించి, రసస్వరూపమైన ఆనందాన్ని కలిగించేది ఈ రాధాశక్తియే.

ఇక , ఈ గోకులంలో నివసించే కృష్ణుడు, దేవకీ వసుదేవుల కుమారుడుగా జన్మించి, కంస శిశుపాలాదులను సంహరించిన అవతారమూర్తి కాదు. గోలోక కృష్ణుడు చతుర్భుజుడు, ఈతడు పరబ్రహ్మ తత్వమే. ఈతని దివ్యదేహం నుండి చతర్బుజులైన సేవకులు సహస్రాధికంగా ఆవిర్భవించి, కృష్ణున్ని సేవిస్తూ ఉంటారు. గోలోక కృష్ణుని రోమకూపాల నుండి అసంఖ్యాకంగా గోపకులు వయోరూప లావణ్యాలతో ఆవిర్భవించగా , రాధాదేవి దివ్యశరీరం నుండి సహస్రాధికంగా గోపకన్యలు ఉద్భవించారు. అలా వెలువడిన గో గోప సముగదాయమంతా  సేవించి, తరించిన రాధాదేవి, రాధాకృష్ణుల అనంత వైభవం యేమని వర్ణించగలం . 

పాతాళం నుండి బ్రహ్మలోకం వరకు ఉన్న లోకాలకు 'బ్రహ్మాండము' అని పేరు.ఆ పైన వైకుంఠం, అంతకంటె పైన ఈ రాధామాతకి  నిలయమైన గోలోకం ఉన్నాయి.

" ఓం కృష్ణాయనమః" అనే షడక్షరీ మంత్ర ప్రభావాన్ని గుర్తంచ గలిగితే రాధాతత్వం అవగాహనకు వస్తుంది. రాధా శక్తితో కూడిన శ్రీకృష్ణుని విరాట్స్వరూపమే పరబ్రహ్మ తత్త్వము.

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi