బురదని పన్నీటిలాగా జల్లుకునే బురదమాంబ ఉత్సవం .
బురదని పన్నీటిలాగా జల్లుకునే బురదమాంబ ఉత్సవం .
లక్ష్మీ రమణ
బురదని పన్నీటిలాగా చిలకరించుకుంటారు. వేపమండలే వారికి పన్నీటి బుడ్లు. అదంతా అనుపు జాతరలోని విశేషం. ఇది అమ్మవారి ఆన అంటారు ఈ ప్రాంతవాసులు. బురదకాలువలోని నీటిని చిలకరించుకొని సంబరాలు చేసుకుంటారు . ఆ బురదలో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రదేశం మరెక్కడో కాదు, మన దేశంలోనే, తెలుగు నేలపైనే ఉంది.
దిమిలిలో బురదమాంబ సంబరం ప్రతియేటా కార్తీకమాసంలో జరుగుతూ ఉంటుంది . తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా ఎక్కడాలేని రీతిలో, ఇంకా చెప్పాలంటే, దేశంలోనే మరెక్కడా లేని రీతిలో విచిత్రంగా ఉంటుంది ఈ జాతర. యలమంచిలి నియోజకవర్గం, రాంబిల్లి మండలంలో ఉన్న దిమిలి గ్రామం లో ఈ జాతర జరుగుతుంది. ఈ గ్రామదేవతే, దల్లమాంబ. ఈ దేవతకి ప్రతియేడాదీ అనుపు మహోత్సవం జరుగుతుంది .
ఈ ఉత్సవాన్ని నిర్వహించడం వెనుక ఈ దేవత అనువులో అంటే, బురదలో లభించడమే నేపధ్యంగా ఇక్కడి స్థానికులు చెబుతుంటారు . ముందు రోజు రాత్రి నుండీ కోలాహలంగా ఈ జాతరకు సన్నాహకాలు చేస్తారు . ఈ జాతరలో పురుషులంతా వేపకొమ్మలు చేత పట్టుకొని మురుగుకాలువల్లోని బురదలో వేపకొమ్మలు ముంచి ఒకరిపై ఒకరు జల్లుకుంటూ కేరింతలు కొడుతూ ఉంటారు . ఇదే ఈ ఉత్సవాల ప్రత్యేకత.
ఇలా బురద పూసుకున్నా, ఎవరికీ ఎటువంటి చర్మ వ్యాధులు సోకకుండా ఉండటం అమ్మవారి మహత్యంగా గ్రామస్తులు విశ్వసిస్తుంటారు . అనంతరం ఆ కొమ్మలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి పూజలు చేస్తారు. ఘనంగా అమ్మవారి జాతరను నిర్వహిస్తారు. అయితే, మహిళలకు మాత్రం బురద జల్లుకోవడం నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక ఇక్కడి అమ్మవారి విగ్రహం బురదలో లభించింది కాబట్టి ఆమెను బురదమాంబగా పిలుస్తారు .
ఈ ఏడాది ఈ ఉత్సవాలు 30-11-21 మంగళవారం నాడు జరిగాయి. ఈ ఉత్సవాన్ని జరుపుకోవడంవల్ల, వ్యాధులు సోకకుండా ఆ దేవి తమ గ్రామాన్ని, గ్రామస్థులనీ చల్లగా చూస్తుందని ఇక్కడి స్థానిక విశ్వాసం .