వారాహీ ఆరాధన
రాత్రిపూట నగర సంచారం చేసే వారాహీ ఆరాధన అనంత ఫలాలని అనుగ్రహిస్తుంది .
-లక్ష్మీ రమణ
సర్వకార్య సిద్ధి, శత్రువులపైన విజయాన్ని, సంపదలు , సస్యాలూ కోరుకునేవారికి వారాహీ ఆరాధన సర్వ శ్రేష్టం . వారాహీ దేవి లలితాదేవి సర్వసైన్యాధ్యక్షిణి . స్వయంగా లలితాంబిక యొక్క వీపుభాగం నుండీ ఉద్భవించిన శక్తి . సప్తమాతృకల్లో, ఒక దేవత. వరాహస్వామి యిక్క శక్తి స్వరూపం ఈ దేవి. వారాహీ దేవి అంటే , ఆమె రూపాన్ని తలుచుకుని దాన్నొక జంతుస్వరూపంగా ఊహించుకొని, దాని స్వభావాన్ని బట్టి నవ్వుకొనేవారు ఆమె శక్తిని గురించి, తత్వాన్ని గురించి తప్పకుండా తెలుసుకోవాలి .
రక్తబీజుడనే రాక్షసుడి సంహార సమయంలో సప్తమాతృకలుగా తనని తానూ విభజించుకున్న దుర్గమ్మ నుండీ ఉద్భవించిన ఒక శక్తే , వారాహీదేవి. ఆమె నాగలిని, రోకలిని ధరించి ఉంటుంది . .మరో రెండు చేతుల్లో శంఖము , పాశము ఉంటాయి . ఈవిడ లలితా దేవి సైన్యానికి అధ్యక్షత వహిస్తారు . ఇక్కడ చతురుభుజాలనే వర్ణించినప్పటికీ ఆవిడ ఎనిమిది భుజాలని కలిగిన దేవతగా పురాణాలు వివరిస్తున్నాయి. నల్లని కారుమేఘం వంటి శరీర ఛాయతో , ఆ వరాహస్వామిని పోలిన రూపంతో ఉంటారు ఈ దేవత. రక్త బీజునితో పాటు అంధకాసురుడు , శుంభ, నిశుంభులవంటి దైత్యులని తుదముట్టించడంలో దుర్గమ్మ సైన్యాధిపతిగా ఈమె ప్రధాన భూమికని వహిస్తారు .
యోగపరంగా వారాహీశక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్ఠాన , మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది అని చెబుతారు.
తాంత్రికులకి సులభప్రసన్న ఈదేవి . అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.
యోధురాలు కాబట్టి సాధారణంగా ఉగ్రస్వరూపిణి ఈ దేవి . ఉగ్రకళతో ఉట్టిపడే ఈ దేవీ స్వరూపాన్ని నేరుగా దర్శించుకోవడం కాస్త కస్టమైన పనే . అందుకే వారణాసికి గ్రామదేవతైన వారాహీ అమ్మవారిని నేరుగా దర్శించుకునే సౌకర్యం ఉండదు . కాళిదాస మహాకవి , అమ్మవారు నగర సంచారానికి వెళ్ళినప్పుడే కదా గర్భగుడిలో దూరి, నాలుక మీద బీజాక్షరాలని ఆ అమ్మ చేతే రాయించుకొని , ఆమె అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఈ దేవతారాధన కూడా ఇంచుమించు అలాంటిదే !
వారణాసిలోని దశాశ్వమేథ ఘాట్ కు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం. తెల్లవారుజాము 4.30 నుంచి 8 గంటల వరకు మాత్రమే ఇక్కడ ఆలయం తెరిచి ఉంటుంది. రాత్రంతా ఆ దేవి వారణాసిని చూసి రావడానికి నగరసంచారానికి వెలుతుందంట! గ్రామ రక్షణ కార్యక్రమంలో తలమునకలుగా వుంటారన్నమాట . అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసి వేసి ఉంటారు. ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళితే నేల పై రెండు రంధ్రాలు కనిపిస్తాయి. వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి. ఒక రంధ్రంలోనుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాద ముద్రలు కనిపిస్తాయి. వారాహి అమ్మవారు ఉగ్రరూపిని కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా దర్శించే ఏర్పాటు చేసినట్లుగా చెప్తారు.
ఈ దేవి ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా ఉంటుంది. ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు కూడా అదే వీరత్వంతో అండగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయమె ఉండదనీ, అపార జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ చెప్తారు. పంటలు బాగా పందాలనుకునే రైతులకి కూడా ఈ దేవిని ఆరాధించడం వలన చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి .