Online Puja Services

కలశం పైన కొబ్బరికాయ ఏంచేయాలి ?

18.219.32.237

కలశం పైన కొబ్బరికాయ ఏంచేయాలి ?
లక్ష్మీ రమణ 

సాధారణంగా కలశాన్ని నోములు, వ్రతాలు చేసుకొనే సమయంలో పెడుతూ ఉంటాం. ఆ కలశాన్ని షోడశోపచార పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాం . ఆ తర్వాత ఆ కలశంలోకి ఆవాహన చేసిన దైవానికి ఉద్వాసన చెప్పాక , కలశం పైనున్న కొబ్బరికాయని ఏంచేయాలనేది సందేహం. దైవంగా భావించి పూజించిన కాయని కొట్టుకుని తినొచ్చా ? పచ్చడి లాంటి పదార్థాలు చేసుకోవచ్చా ? అని సందేహాలుంటాయి . వాటికి సమాధానాన్ని వెతుక్కునే చిరుప్రయత్నమే ఇది . 

కలశంలోని  కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి  ప్రతీక. కాయ పైనుండే పొర - చర్మం. పీచు - మాంసం. దృఢంగా ఉండే చిప్ప- ఎముకలు. అందులో ఉండే కొబ్బరి -మనిషిలోని ధాతువు. కాయలోని నీళ్లు - ప్రాణాధారం. పైన ఉండే మూడు కన్నులే - ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. జుట్టు- అఖండమైన జ్ఞానానికీ, అహంకారానికీ ప్రతీక. స్వయంగా ఆ పరమేశ్వరుడే తనకి ప్రతి రూపంగా కొబ్బరికాయని సృష్టించారు .  ఇటువంటి ప్రత్యేకలని కలిగిఉండడం వల్లనే కొబ్బరికాయ పరమాత్మ స్వరూపమై పూజలందుకోవడానికి అర్హతని సంపాదించుకోగలిగింది . 

కలశాన్ని స్థాపించేప్పుడు , వారి తాహతును బట్టి రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు, గంధం, పూలు వేస్తారు. కలశంపై మావిడి ఆకులు చుట్టూ ఉండేలా పెట్టి, వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు. అప్పుడు దీనిని “పూర్ణకుంభము” అని పిలుస్తారు . అది దివ్యమైన ప్రాణశక్తితో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది. ఇలా కలశాన్ని స్థాపన చేసే నేపధ్యానికి సంబంధించి ఒక గాథని మన పురాణాలు చెబుతాయి . 

సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణువు పాల సముద్రములో తన శేషశయ్య పై పవ్వళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. అప్పుడు ఆయన తొలుత కలశస్థాపన చేశారు . ఆవిధంగా కలశంలొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రథమ జాతమైన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది అన్నింటికీ జీవన దాత.  లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్థాలకి ,చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త.

ఇక కలశంలో ఉంచిన ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ'ను సూచిస్తుంది. అందువల్లనే 'కలశం' శుభసూచకంగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.

అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించబడిన తరువాత అందులోని నీరు "అభిషేకము''తో సహా అన్ని వైదికక్రియలకి వినియోగింప బడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశజలముల అభిషేకాలతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు. పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో  భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది. 

ఇంట్లో ఇటువంటి కలశానికి  వినియోగించిన కొబ్బరికాయని పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వచ్చు. దీన్ని పూర్ణఫల దానం అని కూడా అంటారు. ఒకవేళ అలా అవకాశం లేకపోతె, పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసిన ఎటువంటి దోషాలు ఉండవు.

దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు. 

అదన్నమాట ఈ సంప్రదాయంలోని విశేషం. అంతేకానీ, కొబ్బరి పచ్చడి  చేసుకుంటే బాగుంటుందని కొట్టుకుని పచ్చడి చేయకండి .  ఇక సందేహాలు పక్కనపెట్టి చక్కగా ఆ విధంగా చేసి, మీ పూజలు, వ్రతాల సంపూర్ణ ఫలాన్ని ఆనందంగా పొందండి . శుభం . 

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore