పూజాగదిలో ఎవరెవరుంటే మంచిది ?
పూజాగదిలో ఎవరెవరుంటే మంచిది ?
లక్ష్మీ రమణ
పూజగదిలో , లేదా పూజామందిరంలో ఉంచుకోవాల్సిన దేవతా మూర్తుల గురించి కొన్ని సూచనలు చేస్తున్నారు పండితులు . పూజాగదిలో ఉంచుకోవాల్సిన విగ్రహాల పరిమాణాన్ని గురించికూడా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. వాటివివరాలు ఈ విధంగా ఉన్నాయి .
పూజాగదిలో ఉండే దైవం ఆయా దేవీదేవతల ప్రసన్న స్వరూపమైతే మంచిది . పూజలో భాగంగా మనం నిత్యం ఆయా దేవీ రూపాయలని ఆవాహన చేసి, షోడశోపచారాలతో పూజలు చేస్తాం కదా ! అంటే దానర్థం స్వయంగా ఆ దేవీ, దేవతలు అక్కడికి వచ్చి, మన పూజలందుకొని, ఆశీర్వాదాన్ని అందిస్తున్నారని కదా ! అందుకే, మీ ఇష్టదైవం ఎవరైనా , ప్రసన్నరూపంలో ఉన్న మూర్తులని ఆరాధించడం వలన , కుటుంబంలో శాంతి, సౌఖ్యం, సంపద నిత్యమై నిలుస్తాయని ఆర్యవచనం .
ఇందులో భాగంగానే, నాట్యభంగిమలో ఉన్న నటరాజమూర్తిని పూజామందిరంలో ఉంచుకోకూడదు. నటరాజ తాండవం అంటే, అది సృష్టి , స్థితి, లయాలకి సంబంధించిన విశ్వైకనాట్యం. అందులో ఆయన చేసే విశ్వరచనని తట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు .
ఇక పంచముఖ హనుమంతుడు కూడా ఇదే జాబితాలో ఉన్నారు. ఆయనే మహా బలవంతులు అనుకుంటే, ఆయనకీ తోడు నారసింహుడు , గరుక్మాంతుడు . ఈ రెండు పేర్లు చాలు , ఆ విధ్వసం , ఉగ్రం ఎలా ఉంటాయో వివరించడానికి. పైగా యుద్హానికి సిద్ధమైనట్టు , తనకున్న పది చేతుల్లోనూ భయంకరమైన ఆయుధాల్ని ధరించిన ఆ స్వామి ఉగ్రాన్ని తట్టుకోవడం కూడా మామూలు మాట కాదు .
సూర్య భగవానుని విగ్రాహాన్ని ఎప్పుడూ పూజలో ఉంచుకోకూడదు . ఆయనకీ ప్రత్యక్ష నారాయణుడు అనేకదా పేరు ! స్వయంగా ఆయనే చక్కగా మనకి దర్శనమిస్తుంటే, ఇక ఆయన ప్రతిమ మనకెందుకు ? మరోమాట ఏమంటే, ఆయన ప్రచండమైన అగ్నికీలలని వెలువరిస్తూ, నిత్యం పరుగులుతీసే పనిమీద ఉంటారు. క్షణం కూడా ఆగని, ఆగలేని పని ఆయనది. ఆయన భార్యయైన సంధ్యామాత స్వయంగా ఆయ్నన్ని భరించలేక తన నీడైన ఛాయాదేవిని తన రూపంగా సూర్యునిదగ్గర వదిలి వెళ్లిందని గాథ తెలిసిందేకదా ! అటువంటి చండ, ప్రచండ తోజోరాశిని భరించడం సామాన్యులవల్ల కాదు కదా !
ఇక దుస్సాహసంహారంకోసమే అవతరించిన శ్రీహరి ఉగ్రస్వరూపం నారసింహుడు . ఆ స్వామి ఉగ్రంగా ఉన్న మూర్తినికూడా పూజలో ఉంచుకోకూడదు.
మూడు అంగుళాలకి మించిన ఏ విగ్రహాన్ని కూడా పూజలో ఉంచుకోకూడదని పెద్దలు చెప్పడాన్ని ఇక్కడమనం గమనించాలి. ఇంతకూ మించిన ఎత్తున్నా విగ్రహాలని పూజలో ఉంచుకునేట్టయితే, ప్రతిరోజూ మహానివేదన చేయాలి . అలాగే వారినికోసారి అభిషేకసేవ చేసుకోవాలి.
శుభం.