బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం ఇక్కడే ఉంది
బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షం ఇక్కడే ఉంది .
-లక్ష్మీ రమణ
టిబెట్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక సహా అనేక దేశాలకు విస్తరించిన బౌద్ధం.. పుట్టింది భారత్‌లోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. బుద్ధుడు జన్మించినప్పటి నుంచి నిర్యాణం చెందే వరకు నడయాడిన ప్రదేశాలన్నీ బౌద్ధంలో పవిత్ర స్థలాలే. అందులో సిద్ధార్థుడికి జ్ఞానోదయం కల్గించి గౌతమ బుద్ధుడిగా మార్చిన ప్రదేశం బుద్ధ గయ. బౌద్ధులకు ఇది పరమ పవిత్ర స్థలాల్లో ఒకటి. ఇక్కడ శ్రార్ద విధులను నిర్వర్తించి పిండ ప్రదానం చేస్తే పితృ ఋణాన్ని తీర్చుకుని ఇహపర సాధనలో మోక్షం లభించే ప్రదమైన పవిత్ర స్థలంగా భావిస్తారు.
బౌద్ధమతం అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ ఊరే. ఇక్కడే బుద్ధునికి జ్ఞానోదయమయింది.. ఆ మహాబోధి వృక్షం ఇక్కడే ఉంది . ఆ పవిత్ర ప్రదేశమే బుద్ధగయ. బౌద్ధులకే కాదు హిందువులకు పవిత్రమైన స్థలం గయ. బీహార్‌లోని గయ ఒక ముఖ్యపట్టణం. ఈ ప్రాంతాన్ని జ్ఞానభాండాగరమని కూడా అంటారు. క్రీ.శ 1810లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒక భాగం ఆచార్యులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు, వ్యాపారులు ఉండేవారు. ఇప్పుడు బుద్ధగయ గడిచిన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది.
బోధి వృక్షం:
బుద్ధగయలో పడమరవైపు, పవిత్ర బోధి వృక్షం ఉంది. ఇక్కడకొచ్చిన సందర్శకులు ముందుగా చూడాలనుకునేది బోధి వృక్షాన్నే. దీని కింద కూర్చుని ధ్యానించే సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. అయితే అప్పటి బోధివృక్షం ఇప్పుడు లేదు. దాని తాలూకు మొలకే పెరిగి పెద్దదయి ఇప్పుడు సందర్శకులకు కనువిందు చేస్తుంది. తల్లిచెట్టును మరపిస్తోంది. బోధివృక్షానికి చెందిన ఓ మొలకను అప్పట్లో అశోకచక్రవర్తి శ్రీలంకకు పంపాడు. బౌద్ధమతం విశ్వవ్యాప్తమవడానికి ఇక్కడే బీజం పడింది. బౌద్ధమత ప్రచారానికై అశోకుని కుమారుడు మహేంద్ర శ్రీలంక వెళ్లినప్పుడు, బోధివృక్షం తాలూకు ఒక అంటును కూడా తనతో తీసుకెళ్లాడట. దీన్ని శ్రీలంకలోని అనూరాధాపురలో నాటారు. ఈ మొలకే ఇప్పుడు మహావృక్షమైంది. బుద్ధగయ లోని బోధివృక్షం కాల గమనంలో అంతరించిపోతే, అనూరాధాపురలో నాటిన అదే చెట్టు నుండి మరో అంటును తీసుకొచ్చి బుద్ధగయలో నాటారు. ప్రస్తుతం బుద్ధగయలోని బోధివృక్షం అదే. అసలు వృక్షం నుండి వచ్చింది కాబట్టి దీన్ని కూడా భక్తి శ్రద్ధలతో, బుద్ధుని జ్ఞానోదయాన్ని నీడనిచ్చిన కల్పవృక్షంగా భావిస్తూ , నమస్కరిస్తుంటారు సందర్శకులు.
వజ్రాసనం:
వజ్రాసనం బోధివృక్షం కిందే 'వజ్రాసనం' ఉంది. ఎర్రరాతితో నిర్మించిన ఈ ఆసనంపై కూర్చుని సిద్ధార్థుడు ధ్యానసమాధిలో మునిగిపోయాడట. వజ్రాసనాన్ని చూస్తుంటే మనస్సులో ధ్యాననిష్టుడయిన గౌతముడు మెదులుతాడు. మసస్సు తన్మయత్వం చెందుతుంది. చాలా మంది ఇక్కడ కుర్చొని అలౌకికానందాన్ని పొందుతుంటారు. ముఖ్యంగా ధ్యానం చేయడానికే చాలా మంది ఇక్కడకు వస్తుంటారు అంటే అతి శయోక్తి కాదేమో.
నిరంజానా నది:
నిరంజానా నది బుద్ధ గయకు కొద్ది దూరంలో ఉంది నిరంజానా నది. జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత బుద్ధుడు సరాసరి నిరంజనా నది దగ్గరకు వచ్చి ఇందులో స్నానం చేశాడట. చుట్టూ చిన్న చిన్న కొండలతో, నిర్మలంగా ఉన్న నీటితో, ఎటువంటి శబ్ధం లేకుండా గంభీరంగా ప్రవహిస్తుంది ఈ నది. ఇక్కడికొచ్చిన వాళ్లు నిరంజనా నదిని చూడకుండారారు. కొంతమంది భక్తులు నిరంజనలో స్నానం చేసి సంతోషిస్తారు కూడా
చరిత్ర :
బుద్ధ గయలో ఉన్న ప్రధాన దర్శనీయ స్థలం మహాబోధి ఆలయం. ఈ ఆలయాన్ని అశోకచక్రవర్తి క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దిలో నిర్మించినట్లుగా చరిత్రకారుల కథనం. అశోకుడు నిర్మించిన ఆ ఆలయం కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ, అదే స్థలంలో పునర్నిర్మాణం జరిపించిందే ఇప్పుడున్న ఆలయం. దీన్ని రెండుసార్లు పునర్నిర్మించారు. 11వ శతాబ్దిలో ఒకసారి, 1882లో రెండోసారి నిర్మించడం జరిగింది. ఎన్ని సార్లు పునర్నిర్మాణం జరిగినా అసలు ఆలయం పద్ధతులలోనే తిరిగి నెలకొల్పారట.యాభై మీటర్ల ఎత్తున్న పెద్ద గోపురంతో ఉండే ఈ ఆలయం యాత్రీకులను బాగా ఆకర్షిస్తుంది. తూర్పు ద్వారం ద్వారా భక్తులు ఆలయ ప్రవేశం చేస్తుంటారు. బౌద్ధశిల్పకళకు ప్రతీకగా తోరణద్వారాలు ఈ ఆలయంలో ఉంటాయి. ఆలయం లోపల బంగారు మలామా చేయబడిన బుద్ధదేవుని విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది.
మహాశివుడు:
మహాబోధి ఆలయం ఒక బౌద్ధ ఆలయమని అందరికీ తెలుసు. అయితే గర్భాలయంలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఎదురుగా మహాశివుడు లింగాకారంలో కనిపిస్తాడు. హిందూ, బౌద్ధ, సిక్కు, జైన మతాలతో పాటు అనేక ఇతర మతాలకు చెందిన యాత్రికులు ఈ విశిష్ట చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు వస్తుంటారు.
హుయాన్ త్సాంగ్ దర్శించిన ఆలయం :
క్రీస్తు పూర్వం 635వ సంవత్సరంలో చైనా యాత్రీకుడు హుయాన్ త్సాంగ్ ఈ ఆలయాన్ని సందర్శించినట్లు ఆయన రాసుకున్న గ్రంథాలవల్ల తెలుస్తోంది. అప్పట్లోనే మహాబోధి ఆలయం బౌద్ధుల్ని విశేషంగా ఆకర్షించింది. భారతదేశం నుంచే కాక చైనా, జపాన్, మలేషియా వంటి విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చేవారని హుయాన్ త్సాంగ్ రచనవల్ల తెలుస్తోంది. ఈనాటికీ ఈ బౌద్ధ పుణ్యక్షేత్రం విదేశీ స్వదేశీ భక్తులందర్నీ తన దగ్గరకు రప్పించుకుంటుంది.
అనేక చైత్యాలు:
బుద్ధగయలో మహాబోధి ఆలయం చుట్టూ అనేక చైత్యాలు, స్థూపాలు వున్నాయి. టిబెట్, జపాన్‌వారు నడుపుతున్న అనేక మఠాలు, ఆశ్రమాలు వున్నాయి. ఇక్కడున్న చైత్యాలలో అనిమిషలోచన చైత్యం అతి ముఖ్యమైంది. బుద్ధునకు జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత కొద్దిసేపు అనిమిషలోచనుడై ఈ ప్రదేశంలోనే నిలిచిపోయాడని చెప్తారు. తనకు జ్ఞానం లభింపజేసినందుకు కృతజ్ఞతా సూచికగా కొద్దిసేపు కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడట బుద్ధుడు. అప్పట్నుంచి అది అనిమిషలోచన చైత్యంగా ప్రసిద్ధికెక్కింది.
దుంగేశ్వరి గుహాలయాలు :
వీటిని మహాకాల గుహలు అనికూడా పిలుస్తారు. పర్యాటకులు నిర్మలత్వానికి, ప్రశాంతతకు అన్వేషణలో దు౦గేశ్వరి ఆలయానికి వస్తారు. ఈ గుహ ఆలయాలు గౌతమ బుద్ధుడు ఎట్టకేలకు జ్ఞానాన్ని పొందిన బుద్ధగయలో దానిని అమలు చేయడానికి వెళ్లేముందు, ఇక్కడే తపస్సు చేసాడు. ఇది హిందూ, బౌద్ధ విగ్రహాల మూడు ప్రధాన గుహలను కలిగి ఉంది. ఈ గుహాలయాలను అటు బౌద్ధులతో పాటు హిందువులు కూడా భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు.
ప్రపంచ వారసత్వ సంపదలో చోటు దక్కించుకుంది ఈ వేల ఏళ్ల నాటి మహాబోధి ఆలయం . విశేషమైన ఆధ్యాత్మిక తరంగాలు ఇక్కడ ధ్యానం చేసేవారికి అనుభవమవుతాయి. ఈ ప్రదేశంలో ధ్యానం చేసేందుకే, వివిధ దేశాల నుండి బౌద్ధ అనునూయులు, భక్తులు ఇక్కడికి తరలివస్తారంటే, అతిశయోక్తి కాదు .
ఎలా చేరుకోవాలి :
బుద్ధ గయ కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం గయ విమానాశ్రయం. ఇండియన్ ఏర్‌లైన్స్ మరియు సహారా ఏర్‌లైన్స్ విమానాలు కలకత్తా, రాంచీ, లక్నో, ముంబై, ఢిల్లీ తో పాటుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విమానాలు నడుపుతుంటారు.
రైలు మార్గం గయ రైల్వే స్టేషన్ బుద్ధ గయకి దగ్గరలో ఉన్నది. గయ స్టేషన్ కు పాట్నా, కలకత్తా, రాంచీ తదితర ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.
రోడ్డు మార్గం బుద్ధ గయకి రోడ్డు వసతి బాగానే ఉంది. ఇక్కడి నుంచి గయ 17 కి. మీ. , నలంద 101 కి. మీ. , రజ్గిర్ 78 కి. మీ. ,పాట్నా 135 కి .మీ. వారణాసి 252 కి. మీ. కలకత్తా 495 కి. మీ. దూరంలో ఉన్నాయి.