స్త్రీ గొప్పా ? పురుషుడు గొప్పా ?

స్త్రీ గొప్పా ? పురుషుడు గొప్పా ?
లక్ష్మీ రమణ
స్త్రీ గొప్పా ? పురుషుడు గొప్పా ? ఇదే ప్రశ్న ఇంకొకరకంగా అడిగితే , ప్రకృతి గొప్పా ? పురుషుడు గొప్పా ? ఎవరిది అగ్ర స్థానం ? ఇది సాధారణంగా ప్రతి ఆలూమగలు మధ్య జరిగే యుద్ధమే ! ఇంటింటి రామాయణమే ! కానీ , ఈ విషయాన్ని గురించి మన సంస్కృతీ ఏం చెప్పింది ?
ఆ నారాయణుడికి కూడా ఈ ఇంటింటి రామాయణం తప్పిందికాదు. అమ్మ అలిగితే , ఆ తండ్రిపడ్డ తిప్పలు అన్ని ఇన్నీ కావు . భృగుమహర్షి కోపంతో తన స్థానాన్ని ఒక్క తన్ను తంతే, తిరిగి తన్నకుండా , ఆ తన్నులోకూడా భక్తిని ఆస్వాదించి , ఆయనకీ పాదపూజ చేడని లక్ష్మమ్మకి కోపం . ఆనెపంతో కాలిలో ఉన్న కంటిని శ్రీహరి చిదిమేసినా, ఆ విషయాన్ని గుర్తించలేదా ఇల్లాలు. శ్రీహరి జగన్నాటకం నడిపినా , ఆ ముని కాలు తనకి తగిలిందన్న అలుక వీడలేదు. నారాయణుణ్ణి వదలి , వైకుంఠం వదలి , భూలోకానికి, ఇప్పటి కొల్హాపురానికి వచ్చేసింది మహాలక్ష్మి. ఆ పరమప్రకృతి లేని చోట ఉండలేకపోయాడా పరమాత్మ . వెంటనే తానూ భూలోకానికి తరిలాడు . లక్ష్మి లేని నారాయణుడు మతిలేనివాడైపోయాడు . వాల్మీకములు పెరిగినా యెరుగలేని దుస్థితికి చేరుకున్నాడు . ఆ తర్వాత ఆయన వెంకటేశుడై వెలుగొందుతున్న కథ ఇక్కడ మనకి అప్రస్తుతమే !
ఇక లలితా సహస్రనామాన్ని చూద్దాం . ఒక్క నామంలో ఎన్నోగాథలనూ , రహస్యాలనూ , నిగూఢంగా సృష్టి రచనను , ఆత్మ ప్రబోధాన్ని తెలియజేసే జ్ఞానగని అమ్మవారి లలితాసహస్రాణి . అందులోని 22 వ నామాన్ని చూడండి .
సుమేరు మధ్య శృంగస్థా, శ్రీమన్నగరనాయికా |
చింతామణి గృహాంతస్థా, పంచబ్రహ్మాసన స్థితా || 22 || అని ఉంటుంది .
బ్రహ్మాది దేవతలందరూ కలిసి శివపార్వతుల కల్యాణం జరిపించారు. ఆ ఆదిదంపతుల పరస్పర అనురాగ ఆప్యాయతలు, ఒకరికొకరు స్వాధీనములో ఉండడాన్ని చూసి దేవ గణములు ఆనంద పరవశులయ్యారు.
సర్వమంగళ దేవతా స్వరూపిణి అయిన అమ్మకు, మూడు కొండ శిఖరములు కలిగిన మానససరోవరం మధ్య, మణిద్వీపము నందు, శిఖరం కొన అనగా బిందు స్థానంలో, దేవశిల్పి విశ్వకర్మ- బ్రహ్మ ఆజ్ఞానుసారం ఒక మహా నగరము నిర్మించారు . అదియే శ్రీమన్ నగరం . అంటే , చైతన్య నగరం.
ఈ నగరం మధ్య భాగములో పలు అంతస్తులతో కేవలం మణిమయములతో నిర్మించబడిన గృహమునందు బ్రహ్మ ప్రసాదితమైన పంచబ్రహ్మ సింహాసనం ప్రతిష్ఠించారు . దానిని అమ్మ అధిష్టించినది . ఈ చింతామణి గృహంలోని మణులన్నికూడా మంత్ర స్వరూపాలే .అని ఈ మంత్రానికి అర్థం . సరే, ఇక్కడ ఆదిదంపతుల అమలిన అనురాగం తీగలుపారి ఒకదానికొకటి ఆధారమై పెనవేసుకున్నట్టు కనిపిస్తూనే ఉన్నది కదా !
దీన్నే మరో అర్థంలో పరిశీలిద్దాం . మేరు అంటే మేరుదండం. మానవులలో మూలాధార చక్రము నుండి శిరోభాగములోని సహస్రారం వరకూ విస్తరించిన వెన్నుపూస , దాన్ని అంటిపెట్టుకొని ఉండే మూడు నాడులు ఇడా, పింగళ , సుషుమ్న. వీటివల్ల చైతన్యమయ్యే సప్త చక్రాలలో ఉన్నతమైనది సహస్రదళాలతో భాసిల్లే సహస్రార చక్రం . ఇక్కడికి శక్తి స్వరూపిణి అయిన కుండలిని మాత చేరుకొని అక్కడి పరమేశ్వరుణ్ణి చుట్టుకోవడమే కైవల్యం . కుండలిని చైతన్య స్వరూపిణే కదా ! అందుకే ఈ స్థానం అమ్మ సింహాసనస్థాన మై, సకల ఆజ్ఞా పూర్వక క్రియా శక్తులకు నిలయమై ఉన్నది అని లలితా సహస్రం చెప్పింది.
ఇప్పుడు చెప్పండి ఎవరు గొప్ప ? శక్తి గొప్పా ? శివుడు గొప్పా ? శక్తి లేని శివుడు , చలనం లేని బండేగా? ఆ చోదకం లేని శక్తి , ఉపయోగంలేని రూపాయల కుండేగా !! అందుకే మరి , భార్యా భర్తలు కాడెద్దులవంటివారు . సంసార రథానికి ఇరు చక్రాలు . శక్తీ - శివుల్లాగా , లక్ష్మీ - నారాయణుల్లాగా, ప్రకృతి - పరమాత్మల్లాగా సమాసమైన ప్రాధాన్యత గలవారు . కాదంటారా ?