ఆశ్రమ ధర్మాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయం
ఆశ్రమ ధర్మాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయం
-లక్ష్మీరమణ
హిందూ సంస్కృతిని అనుసరించి మానవుడు నాలుగు ఆశ్రమ ధర్మాలలో ఏదో ఒకదానిని స్వీకరించి జీవన్ముక్తిని పొందవచ్చు. అవి: 1. బ్రహ్మచర్యము,2. గృహస్థము ,3. వానప్రస్థము ,4. సన్యాసము. ఈ ఆశ్రమములను చతుర్వర్ణాలలో మానసిక సంస్కారమును బట్టి అందరూ ఆచరించవచ్చు.
బ్రహ్మ చర్యాశ్రమం:
బ్రహ్మచారికి వేదాధ్యయనము, గురు శుశ్రూష, ఇంద్రియ నిగ్రహము, పెద్దలయందు గౌరవము ప్రధాన ధర్మములు.
‘కర్మణా మనసా వాచా సర్వావస్థాసు సర్వదా
సర్వత్ర మైథున త్యాగో బ్రహ్మచర్యం ప్రచక్ష్యతే॥’
అంటారు యాజ్ఞ వల్క్యుడు. 'బ్రహ్మ చర్యాశ్రమం' ప్రతి ఒక్కరికీ ఒక పరీక్షే. ఈ కాలంలో 'మనసా వాచా కర్మణా' ఎప్పుడూ స్త్రీ ఆలోచనలకూ , అపేక్షలకు దూరంగా ఉండాలి. ఒక రకంగా ఈ దశ మానవుని భవిష్యత్తుకు బలమైన పునాది వంటిది. బ్రహ్మచారులు గురువుల మన్ననలను పొందేటట్లుగా నడచుకోవాలి. జీవన ప్రణాళికకు అవసరమయ్యే అనుకూలమైన విజ్ఞానాన్ని ఇప్పుడే సముపార్జించుకోవాలి. ఈ జ్ఞానమే ముందరి జీవితానికి మంచిబాట వేస్తుంది.
గృహస్థాశ్రమం:
గృహస్థునకు ఏకపత్నీవ్రతము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, ధర్మ సంతానము, ఆచార నిర్వహణము, ఆనాథులయందు ఆదరణ, బీదలకు సహకారము ప్రధానములని పురాణోక్తి .
ఈ ఆశ్రమ ధర్మాన్ని నియమబధ్ధంగా పాటించే సజ్జనులు ఇహ-పరలోకాల సుఖాలను కూడా పొందుతారని శాస్ర్తాలు చెబుతున్నాయి. 'తన సతీమణితో ధర్మబద్ధంగా జీవిస్తూ, కుటుంబ జీవితాన్ని గడిపే గృహస్థునికి తిరుగుండదు. అలాంటివారు ఎప్పటికీ తరిగిపోని ధాన్యసంపదను కలిగివుండే పక్షి, ఎలుకలవలె సుఖజీవనం సాగిస్తారు. వీరికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం సిధ్ధిస్తుంది. కష్టాలు ఎదురైనపుడు రోగగ్రస్థునికి ఔషధం లాగా సమస్యల నుండి గట్టెక్కడానికి ఆ ఇల్లాలు సహకరిస్తుంది (మహాభారతం, అరణ్యపర్వం: 2.74)'. 'భర్తతో అన్యోన్యంగా కాపురం చేసే స్త్రీకి యజ్ఞదానతపో ఫలాలన్నింటి ఫలితమూ లభిస్తుంది' అని కూడా 'మహాభారతం' (అరణ్యపర్వం: 5.07) చెబుతోంది .
ప్రతీ కుటుంబీకుడు తన సంతానాన్నే గాకుండా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనూ తప్పనిసరిగా ఆదరించాలి. విధిగా వారి బాగోగులను చూస్తుండాలని మన సనాతన ధర్మం నిర్దేశించింది. మాతా పితరులకు చేసే సేవవల్ల పిల్లలకు సుఖసంపదలు కలుగుతాయి. కానీ, వారికి కీడు కలిగిస్తే తత్సంబంధ దుఃఖం అనుభవించక తప్పదు (ఆనుశాసనిక పర్వం: 4-279) అంటుంది పంచమ వేదం . ఒక్కమాటలో చెప్పాలంటే, 'ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుందేమోగానీ, తల్లీ తండ్రీ, గురువులపట్ల చేసే పాపాలకు మాత్రం పరిహారం ఉండదు (ఆనుశాసనిక పర్వం: 4-260)'.
తమ సంతానంపై ఎనలేని వ్యామోహాన్ని కలిగి ఉండటమనేది తల్లిదండ్రులకు సహజం. ఐనా, వారిని మంచి క్రమశిక్షణతో పెంచాలి. పిల్లలను పొరపాటునైనా కన్నవాళ్లు పొగడకూడదు. అందరికంటే పెద్దవారికి 'కార్యజ్ఞాన శూరత్వం' ఉండాలి. అప్పుడే తోబుట్టువులు, కుటుంబసభ్యులందరూ బాగుపడతారు. 'తమకు ఆపదలొస్తే అండగా ఉండేవాళ్లే నిజమైన బంధువులు. ఎప్పుడూ కీడు చేస్తూ, తమ వంశానికి హాని చేయాలని చూసేవాళ్లను చుట్టాలుగా భావించరాదు (ఆదిపర్వం: 6-181)'.
వానప్రస్థాశ్రమం :
వానప్రస్థుడు ధర్మ వ్యవహారబద్ధుడై వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని, కర్మలయందు స్వార్ధమును వీడి సంతానమునకు వ్యవహార మప్పగించి ధర్మపత్నితో కందమూలాదుల నాహారించి తపమాచరించడం ధర్మము.
పూసిన ప్రతిపూవూ వాడిపోయి రాలిపోవలసిందే కదా ! కాలగతిలో ప్రతిజీవి చక్రంలాగా చావుపుట్టుకలనడుమ తిరుగుతూనే ఉంటాడు . 'వృద్ధాప్యం' (వానప్రస్థాశ్రమం) అంటే, అది ఆ జన్మకి 'అవసాన దశ'. ప్రాచీన కాలంలో కుటుంబ బాధ్యతలను తీర్చుకున్న పిమ్మట, సంసార బంధాలను వదిలిపెట్టి 'సన్యాసాశ్రమం' స్వీకరించి అడవుల్లోకి వెళ్లిపోయేవారు. అక్కడ ఏ పర్ణశాలలోనో నివసిస్తూ, ఇంద్రియ నిగ్రహంతో కాలం గడిపేవారు. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు కాయగూరలతోనే కడుపు నింపుకొనేవారు. ప్రతి మనిషీ ఈ జీవిత చరమాంకాన్ని దైవచింతనకే అంకితం చేయాలని సనాతన ధర్మం నిర్దేశించింది.
ఈ రోజుల్లో అడవులకు వెళ్లకపోయినా, ఇంట్లో ఉంటూ అయినా మిగిలిన సలక్షణాలను విధిగా పాటించాలి. 'భౌతిక సుఖాలు, కోర్కెలను ఆశించే వ్యాపారాలను వదిలి పెట్టి ఆధ్యాత్మిక చింతనతో జీవించడమే సన్యాసాశ్రమ ధర్మం' అని 'భగవద్గీత' (18-2) కూడా ఉద్ఘాటించింది.
సన్యాసాశ్రమం:
వైర్యాగ్యము కలిగి ధర్మపత్నిని సంతానమున కప్పగించి కామక్రోధాదులను జయించి నిర్లిప్తుడై శేష జీవితమును లోకొద్ధరణకై ధర్మ ప్రబోధనైక లక్ష్యముతో ఆత్మ సాక్షాత్కారంతో సన్యసించుట సన్యాసాశ్రమము.
జీవుడు చివరిమజిలీలో , తనకి నిర్దేశించిన కర్మలను పూర్తి చేసి మోక్షాన్ని పొందేందుకు ఈ ఆశ్రమ ధర్మాలు నిర్దేశించబడ్డాయి . వీలైనంత వరకూ , ఇప్పటి సమాజధర్మాన్ని అనుసరిస్తూ ఈ ఆశ్రమధర్మాలన్నింటినీ పాటించడమే మన ప్రస్తుత కర్తవ్యమ్ .