Online Puja Services

పురాణాలలో లింగ వివక్షకి చెందని కధలు ఇవే !

18.223.237.218

పురాణాలలో లింగ వివక్షకి చెందని  కధలు ఇవే !
-లక్ష్మీ రమణ 

ఆడా మగా ఒకటే, ఇరువురూ ఒకే జీవనరథానికి పూంచిన జోడు గుర్రాలవంటివారు. నేను పురుషుణ్ణి కాబట్టి కాస్త ఎక్కువ సమానం అనుకునేవారున్నట్టే , నామాట నెగ్గాలి నేను అమ్మోరుతల్లిని అనుకునే ఆడవాళ్ళూ మనకి తారసపడుతూనే ఉంటారు . మీరు అమ్మాయయితే, తెలిసేది నాపాట్లేమిటో అని భార్యగారు , నా కష్టం నీకేం అర్థమవుతుందని భర్తగారూ అంటూ , అనుకుంటూ ఉండడం ప్రతి ఇంటి గొడవే ! అదలా ఉంచితే, పురాణాల్లో స్త్రీ పురుషుడిగా ,పుషుడు స్త్రీగా మారిన సంఘటనలు చిత్రంగా అనిపిస్తాయి . అదే సమయంలో ఇరువురూ సమానమేనని తెలియజెప్పేలా ఉంటాయి . ఆ కథలు ఈరోజు అవలోకిద్దామా ? 
 
కర్మానుసారం జీవులు జన్మిస్తుంటాయి . కర్మ పరిపక్వము కాగానే మరణించి, మరుజన్మని పొందుతుంటాయి . అది సృష్టి ధర్మం. అందులో ఏ రూపం , ఏలింగం అనేది ఆ కర్మానుసారంగానే జరుగుతుంది. ఎలా పుట్టినా మృత్యు సమయంలో ‘ఆత్మ’ జీర్ణ వస్త్రాన్ని విడిచిపెట్టినట్లు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. అందుకే ఆత్మకి లింగభేదం లేదు. అది  స్త్రీ లేదా పురుష లింగం కాదు. ఇప్పుడు మనం హిందూ పురాణాలలో లింగ వివక్షకి చెందని  కధలు చూద్దాము. 

అర్ధనారీశ్వరుడు:
 "అర్ధనారీశ్వర" శబ్దానికి సగం స్త్రీ సగం పురుష తత్వం కలిగిన భగవంతుడని అర్ధం. మహా శివుడు ఆయన దేవేరి పార్వతి యొక్క ఏక రూపం ఈ అర్ధనారీశ్వరం. ఈ రూపం పురుష స్త్రీ తత్వాల ఏకీకరణకి ప్రతీక. ఒకళ్ళు లేకుండా ఇంకొకళ్ళు లేరని ,ఒకళ్ళు ఇంకొకళ్ళ కంటే ఎక్కువ కాదు అనీ, తనలో ఈ రెండు లక్షణాలనీ ఉంచుకున్నవాడే పరిపూర్ణ జీవితం గడపవచ్చనీ ఈ రూపం మనకి తెలియచేస్తుంది.

మోహిని:
 శ్రీ మహా విష్ణువు అవతారం గా మోహినీ మనకి హిందూ పురాణాలలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఈ రూపాన్ని గురించి మూడు ముఖ్య కధలు చెప్తారు. మొదటిది సాగర మధనం తరువాత అమృతానికి సంబంధించిన తగవు తీర్చడానికి వచ్చిన రూపం. శ్రీ మహా విష్ణువు అందమైన మోహినీ రూపం ధరించి తెలివిగా అమృతాన్ని దేవతలకి మాత్రం పంచుతాడు. 

రెండోది పరమేశ్వరుణ్ణి భస్మాసురుడు అనే రాక్షసుడి బారి నుండీ కాపాడిన మోహినీ అవతారం.ఈ మనోహరమైన మోహినీ అవతారం భస్మాసురుడు తననను తాను అంతం చేసుకునేటట్లు చేసింది. మనోహరమైన మోహినిని పరమేశ్వరుడు మోహించడం వల్ల అయ్యప్ప జననమయ్యింది.అయ్యప్ప దక్షిణ భారతం లో ప్రసిద్ధి చెందిన భగవత్ స్వరూపం.

ఇంక మూడోది మహా భారతంలో అర్జునుడి కొడుకైన అరవనుణ్ణి యుద్ధం లో పాండవుల విజయం కోసం బలి ఇవ్వవలసి వస్తుంది. కానీ అరవణుడికి చనిపోయే ముందు వైవాహిక సుఖాలని అనుభవించాలని కోరిక ఉంటుంది. కానీ తెల్లారితే చనిపోతాడని తెలిసిన వ్యక్తిని పెళ్ళాడేందుకు ఏ స్త్రీ ముందుకు వస్తుంది ? దాంతో,  శ్రీ కృష్ణుడే మోహిని గా మారి అరవనుణ్ణి పెళ్ళాడి అతని కోర్కెలు తీరుస్తాడు . అతను చనిపోయాక భర్తని కోల్పోయిన సౌభాగ్యవతిలా దఃఖిస్తాడు. భగవంతుడుకి ఏ లింగమూ లేదని దీంతో స్పష్టమవుతోంది కదా !

శిఖండి:
ద్రుపద మహారాజుకి కుమార్తె గా పుట్టిన శిఖండిని మగ పిల్లవాడిలాగ పెంచుతారు.కొన్ని కధల ప్రకారం శిఖండికి అమ్మాయినిచ్చి పెళ్ళి చేసారుట కూడా. శిఖండి తన స్త్రీ తత్వాన్ని తాను వైవాహిక జీవితం గడపడానికీ, భీష్ముడిని చంపటానికీ ఒక యక్షునికిచ్చినట్లు కూడా కొన్ని కధలు ప్రచారం లో ఉన్నాయి. ఇలాంటి కధల ద్వారా శిఖండి ఉభయ లింగం అని తెలుస్తుంది.

బృహన్నల:
తనని తిరస్కరించాడన్న కోపం తో ఊర్వశి అర్జునుడిని ఒక సంవత్సరం స్త్రీగా మారతాడని శపిస్తుంది. కానీ ఈ శాపం అజ్ఞాతవాసం ఆఖరి సంవత్సరంలో విరాట మహారాజు కొలువులో బృహన్నల అనే స్త్రీలా ఉండటానికి, ఒక వరంలా పనికొచ్చింది. కానీ కొంతమంది ఆ శాపం వల్ల అర్జునుడు స్త్రీగా కాకుండా నపుంసకుడిగా మారాడని చెబుతారు .

సుద్యుమ్న/ఇల:
పరమశివుడి తోట లోకి అనుమతి లేకుండా పొరపాటున ప్రవేశించడం వల్ల తన జీవితం లో సగ భాగం స్త్రీగా మారతాడని మగవాడిగా పుట్టిన సుద్యుమ్నుడు శాపాన్ని పొందాడు . అతను ప్రతీ నెలా తన తత్వాన్ని(లింగాన్ని) మార్చుకుంటుండేవాడు. అతని స్త్రీ స్వరూపాన్ని "ఇల" గా వ్యవహరిస్తారు. బుధుడు ఈమెతో ప్రేమలో పడటం వల్ల వీళ్ళిద్దరికీ కురు వంశ పితామహుడిగా పేరు గాంచిన పురూరవుడు జన్మిచాడు. తన మగ స్వరూపం ద్వారా సుద్యుమ్నుడికి ముగ్గురు కుమారులు కలిగారు.

నారదుడు:
తాను శ్రీ మహా విష్ణువు కు మహా భక్తుడిననీ తనని భగవంతుని మాయ కూడా ఏమీ చెయ్యలేదనీ నారదుడు గర్వించేవాడు.ఇతని గర్వమణచడానికి నారదుడు స్నానం చేస్తుండగా శ్రీ మహా విష్ణువు నారదుణ్ణి స్త్రీ గా మార్చేసాడు.స్త్రీ గా మారిన నారదుడు తన అసలు స్వరూపాన్ని మరచి ఒక రాజుని వివాహమాడాడు. రాజు గారి వల్ల అనేక మంది సంతానం కూడా కలిగారు.కానీ మహారాజూ అతని పిల్లలందరూ యుద్ధం లో మరణించారు. ఈ శోకం నుండి ఉపశమనం పొందడానికి నీళ్ళల్లో మునిగి శరీరం విడిచిపెడదామనుకుంటుండగా నారదుడికి పూర్వ స్మృతి కలుగుతుంది. అప్పుడు మాయ ని తప్పించుకోవడం ఎవ్వరి వల్లా కాదని నారదుడు గ్రహిస్తాడు.

గోపేశ్వరునిగా శివుడు:
బృందావనం లో శ్రీ కృష్ణుడు గోపికలతో రాస లీలలో మునిగి ఉన్నప్పుడు పార్వతీ పరమేశ్వరులకి కూడా అందులో భాగమవ్వాలని కోరిక కలుగుతుంది. స్త్రీ అవడం వల్ల పార్వతి మాత్రమే అనుమతించబడి మహా శివునికి ప్రవేశం నిరాకరించబడుతుంది. దగ్గర లోని మానస సరోవరం లో స్నాన మాచరించడం వల్ల మహా శివుడు కూడా రాస లీలలో పాల్గొనవచ్చని బృందావన దేవత తెలియచేస్తుంది. అలా చేసిన శివుడు స్త్రీ గా మారతాడు. స్త్రీగా మారిన మహా శివుణ్ణి గోపేశ్వర్ అని శ్రీ కృష్ణుడు సంభోదించి బృందావనం లోకి అనుమతిస్తాడు. బృందావనంలోని గోపేశ్వరాలయంలో శివుణ్ణి  గోపేశ్వరుడిగా పూజిస్తారు. ఇక్కడ శివుడు స్త్రీగా చీరలో అలంకరించబడి ఉంటాడు.

చూశారా,

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi