Online Puja Services

యాజ్ఞ వల్క్యుడు - గార్గి సంవాదము

3.146.152.147

యాజ్ఞ వల్క్యుడు - గార్గి సంవాదము 
సేకరణ:  లక్ష్మి రమణ 
 
హిందూ మతమంటే మనుస్మృతి గుర్తుకు వస్తుంది. నిజానికి మనుస్మృతి కృతయుగానికి స్మృతి. కాలానుగుణంగా అనేక స్మృతులు వచ్చాయి. త్రేతాయుగానికి గౌతమ స్మృతి, ద్వాపరానికి శంఖలిఖిత స్మృతి, కలి యుగానికి పరాశర, యాజ్ఞవల్క్య స్మృతులు చెప్పబడ్డాయి. యాజ్ఞవల్క్య స్మృతి ప్రధమంగా స్త్రీలకు ఆస్తిహక్కు ఇచ్చిన స్మృతి. యాజ్ఞవల్క్య మహర్షి జీవిత సంఘటనలు మానవులకి విహితావిహితములని తెలియజేస్తాయి . స్త్రీలకి అత్యంత ఉన్నంతంగా గౌరవిస్తాయి . అటువంటి మహిళామణుల్లో గార్గి ఒకరు . 

గార్గికి భారతీయ తత్త్వ శాస్త్రములోగల కీర్తి ఆమె బృహదారణ్యకములో (బృహదారణ్యకోపనిషత్తు ) యాజ్ఞవల్క్యునితో పాల్గొన్న చర్చవలన వచ్చినది. యాజ్ఞవల్క్యుడు గొప్పయోగి. ఆయనను యోగీంద్రుడు అని వ్యవహరించేవారు. యోగయాజ్ఞవల్క్యము అనేగ్రంధానికి ఆయన కర్త. దీనిలోకూడా గార్గి యాజ్ఞవల్యుల సంవాదం ఉంటుంది. ఈమెను గార్గి వాచక్నవి అంటారు. వచక్నుడనే ఆయన కుమార్తె. ఆమె యాజ్ఞ వల్క్యుని బ్రహ్మజ్ఞానాన్ని పరీక్షించడానికి ప్రయత్నముచేసింది. యాజ్ఞవల్క్యుడు సభలో అందరి కంటె అధికుడనని నిరూపించుకుంటాడు.  ఈ సంభాషణ వాదము ఎలా ఉండాలో నిరూపిస్తుంది. 

యాజ్ఞ వల్క్యుడు - గార్గి

ఆత్మ లేదా బ్రహ్మ జ్ఞానం కొరకు చేసే ప్రయత్నాలలో వేదకాలం లోనే వైవిధ్యం ఏర్పడినది. ఆకాలంలో పండితులు, ఋషులు మునులలో కూడా మాత్సర్యం ఉండేది. బృహదారణ్యకోపనిషత్తే దీనికి ప్రమాణం. 

మిథిలా నగరాన్ని జనకమహారాజు పాలించే కాలమది. ఆయన సభ ఆనాటివేద విద్యకు కేంద్రము.  ఋషులు, మునుల తత్త్వబోధలను  విని జనకుడు పండితుడు, రాజర్షి అయ్యాడు.  అటువంటి రాజు పాలనలో ఉంటే లోక కల్యాణమే. కనుక ఋషులు ఆయనను సందర్శించడం లోకానుగ్రహమే.

యాజ్ఞవల్క్యుడు ధైర్యంగా రాజు అక్కడ వాగ్దానం చేసిన సంపదను తాను వశపరచుకోవడమే ఈ ఉపనిషత్తుకు ప్రాతిపదిక. ఈయనికి ధనాశయా? అహంకారమా? నిజంగా బ్రహ్మవేత్తయా? తానే అధికుడనని గర్వమా? ఇది సభలోని వారందరికీ వచ్చిన సందేహాలు. యాజ్ఞవల్క్యుడు తన ప్రసంగం ఇలా ప్రారంభించాడు. "సభలోని బ్రహ్మవేత్తలందరికి నా నమస్కారం." తాను బ్రహ్మజ్ఞానిని అని పరిచయం చేసుకోలేదు. "మీలో ఏ  ఒక్కరుకాని, అందరూ కాని, ఒకటికాని, అనేకముగాని నన్ను ప్రశ్నలు వేయవచ్చును." ఈ ప్రకటనతో సభలో ఒక ముఖ్యమైన చర్చ ప్రారంభమయినది. 

ఒకరి తరువాత ఒకరు ఆయనను ప్రశ్నించడం మొదలు పెట్టారు.  అశ్వలుడు, భుజ్యుడు, ఉషస్తుడు, కహోలుడు అనే మునులు యాజ్ఞవల్క్యుని  బ్రహ్మము గురించి ప్రశ్నలు అడిగినతరువాత అవకాశం గార్గికి వచ్చింది. అందరు అడిగే ప్రశ్నలు బ్రహ్మ వస్తువు, ఆత్మవస్తువులను గురించే. కాని అందరూ తమ తమ ప్రశ్నలు అనేక విధాలుగా అడిగారు. యాజ్ఞవల్క్యుడు ఆ ప్రశ్నలనుబట్టి, వారి స్థాయిని, అడిగినవారి ఉద్దేశ్యాన్ని గ్రహించి వారికి తగిన రీతిలో సమాధానాలు చెప్పాడు.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. అక్కడ ఉన్నవారెవరూ యాజ్ఞవల్క్యుని గురించి తెలిసిన వారు కాదు. విజ్ఞాన శాస్త్రము యొక్క విజ్ఞానము అన్నీతెలుసుకున్నాననే భ్రాంతిని కలుగచేసి అసలు బ్రహ్మవస్తువునిగాని, బ్రహ్మజ్ఞానిని కాని గుర్తించకుండా చేయగలవు. బ్రహ్మజ్ఞాని తన జ్ఞానాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేయడు. బాలుని వలె, లేదా ఉన్మత్తునివలె కనుపిస్తాడు. ఆ లోతులేని వారి పాండిత్యము తెలిసిన కొంచెము ప్రదర్శించుకునే ప్రయత్నంలో యాజ్ఞవల్క్యుని ధిక్కరించే, ప్రశ్నలు వేయడముకూడా కనబడుతుంది. 

ఇక్కడ మనం యాజ్ఞ వల్క్యుడు, గార్గిల మధ్య జరిగిన సంవాదం తెలుసుకుందాం. వాదము ఇద్దరిమధ్యనే జరుగుతుంది కాని అది సభలో అందరికి వారి వారి స్థాయిలను ఎవరికివారు గమనించుకునేటట్లు చేస్తుంది. 

మొదట గార్గి అడిగిన ప్రశ్నలు ఇతరులు అడిగిన విధముగానే ఉన్నాయి. ఆయనను పరీక్షించడానికి అడిగిందా? ఆయన మహాత్మ్యాన్ని నిరూపించడానికి అడిగినదా? ఇది తెలియకుండా అడిగింది.  

గార్గి వరుసగా సృష్టిలోని పంచ భూతముల ఆధారములను గురించి ప్రశ్నించింది. ఆమె మొదటి ప్రశ్న "కస్మిన్ను ఖల్వాప ఓతశ్చ ప్రోతాశ్చేతి?" ఈ కనుపించే  సృష్టి అంతా జలముచే ఓతప్రోతముగా ( చేనేతవస్త్రములో పడుగుపేకల వలె) వ్యాపింపబడి ఉన్నది. జలమునకు ఈవ్యాపించే లక్షణము ఎక్కడనుంది వచ్చినది? 

దానికి మహర్షి "ఓ గార్గీ, వాయువు వలన" (వాయో గార్గేతి) అని సమాధానం చెబుతారు.

 ఆమె ప్రశ్న "వాయువుకు ఆశక్తి ఎక్కడి నుండి వచ్చినది?" 
"అంతరిక్షం వలన" ఆయన సమాధానం. 
"అంతరిక్షానికి ఆశక్తి ఎక్కడి నుండి వచ్చినది?" ఆమె తిరిగి ప్రశ్నించింది.
"గంధర్వలోకము నుండి" ఆయన సమాధానం. గార్గి శర పరంపరవలె ప్రశ్నలు సంధిస్తున్నది.
 "గంధర్వలోకమునకు?" ప్రశ్న. 
"ఆదిత్యలోకమునుండి?" సమాధానము. 
"ఆదిత్యలోకమునకు?" ప్రశ్న.  
 "చంద్రలోకమునుండి" అని సమాధానము. 

వరుసగా చంద్రలోకమునకు  నక్షత్రలోకము, దేవలోకము, ఇంద్రలోకము, ప్రజాపతిలోకము, బ్రహ్మలోకము - ఈ విధముగా ఉన్న ఒకదానికంటె ఉన్నతముగా ఉన్న మరొకలోకమునుండి శక్తి వచ్చుచున్నదని  యాజ్ఞవల్క్యుడు చెబుతాడు. 

బ్రహ్మలోకము సృష్టిరచనా సామర్ధ్యమునకు కేంద్రము.  గార్గి ఇదే విధముగా "బ్రహ్మకు ఈ సృష్టి రచనా శక్తి ఎక్కడనుండి వచ్చినది? పంచభూతములను ఎలా సృష్టించాడు? స్థితి లక్షణాన్ని పంచభూతములకు ఎలా ఈయగలిగాడు?" అని ప్రశ్నించినది. 

దానికి యాజ్ఞవల్క్యుని సమాధానం అనేక వ్యాఖ్యానాలకు దారితీసినది. "ఇది బ్రహ్మవిద్య గార్గీ! అనవసరముగా పిచ్చిప్రశ్నలు వేయకు. ఇక అధికంగా ప్రశ్నిస్తే తలతెగి పడిపోతుంది సుమా!" అన్నాడు యాజ్ఞవల్క్యుడు. 

ఆయన కోపిష్ఠియా? గర్విష్ఠియా? సమాధానము తెలియక తన కోపాన్ని ప్రదర్శించాడా? ఇలాంటి సందేహాలు ఆనాడు సభలోవారికి, ఈనాడు మనందరికీ కలిగే అవకాశం ఉన్నది.    
గార్గి -- " బ్రహ్మ లోకములు దేనిలో అల్లుకొని ఓతప్రోతమైపోయి ఉంటాయి ? "
యాజ్ఞవల్క్యుడు -  " దానికి ముందర అడగ వద్దు. గార్గి , ఆ బ్రహ్మలోకములలో బ్రహ్మాండములను నిర్మించు భూతములు ఉన్నాయి. భూతములు ఉన్నంతవరకూ జ్ఞానము బాహ్యము. జ్ఞానము భూతములను దాటిననూ అంతటా నిండిపోదు. అప్పుడు  విషయమును తెలుసుకొనుట ఆగమము వలన. అనుమానము వలన కాదు. కాబట్టి ఆగమమును వదలి , అనుమాన ప్రధానముగా వెళితే , విషమును అన్నమని తిన్నట్టగును. వదిలివేయండి. అని చెప్పారు 

సరే, " యాజ్ఞవల్క్యుని వాక్కు "తల తెగి పడిపోతుంది" అన్న వాక్యానికి అర్థమేంటి ? 

దీనిని మరి కొంత వివరంగా చూదాము. "పంచదార తీయగానుండును." అంటే "తీపి అనగానేమి?" అని ప్రశ్నిస్తే, దానిని గ్రహించుటకు పంచదార అడిగిన వారి నోటిలో వేయుట ఒకటే మార్గము. తీయదనము వాచా వర్ణించలేనిది. యాజ్ఞ వల్క్యుడు గార్గి ప్రశ్న పరంపరకు వాచా చెప్పగలిగినంతవరకు చెప్పాడు. తరవాత స్థాయి పరిజ్ఞానము మనోబుద్ధులతోకాక తపస్సువలన తెలుసుకొని అనుభూతము కావలసినది. బ్రహ్మ వస్తువు అనిర్దేశ్యము. సర్వభూతములందు ఆత్మను, ఆత్మయందు సర్వ భూతములను చూడాలి. అప్పుడే పరబ్రహ్మవస్తువును చూస్తాడు. ప్రవచనాలు వింటేనో, ప్రశ్నోత్తరాల ద్వారానో, వాదముతోనో లభించేది కాదు. మనము అనేక గుణాలతో, అనేక నామాలతో భగవంతుని వర్ణిస్తాము. అంటే ఆయన మన ఊహలకు అనుగుణముగా ఉంటాడనికాదు. ఆయన సంపూర్ణస్వరూపము ఇది అనిచెప్పగలవారు లేరు. శిరస్సు పతనమౌతుంది అంటే శాపముకాదు. మనోబుద్ధులతో  తెలుసుకొవాలనే ప్రయత్నము విఫలమౌతుంది అని అర్థము.   గురూపదేశము, అనుగ్రహము, ఆధ్యాత్మిక సాధన వలన మాత్రమే తెలియగల జ్ఞానమది.

గార్గి అది విని, విధేయురాలవలె చేతులు జోడించి , తన చోటుకి వచ్చింది.
 
ఇది బృదారణ్యకోపనిషత్తు లోని గార్గీ - యాజ్ఞవల్క్య మహర్షుల సంవాదం . విజ్ఞానవీచిక వంటి ఈ సంవాదం వేదాంతులకి ఎన్నో విషయాలని తెలియజేసింది . మహిమాన్వితమైనది .  

శుభం .

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi