Online Puja Services

దీపావళి పండుగకి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

52.15.217.86

దీపావళి పండుగకి తారాజువ్వలు కొనడంతోపాటు, ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి . 
-లక్ష్మీ రమణ . 

రోజుకన్నా ప్రత్యేకత సంతరించుకున్న రోజులు  పండుగరోజులు . అందునా దీపావళి మరింత ప్రత్యేకం. ఆధ్యాత్మిక వెలుగులు ఒకపక్కా , పండుగ సంబరాలు , దీపాల వెలుగులూ , టపాకాయల సందళ్ళ మరోపక్కా చేరి సరికొత్త వెలుగులు నింపే పండుగ దీపావళి .  ఒక్క వాక్యంలో చెబితే, కొత్త బట్టలు, విందు భోజనాలతో పాటు అంబరాన్నంటే సంబరమే దీపావళి ప్రత్యేకత. ఈ దీపాల పండుగకు నింగికెగసే తారాజువ్వలు, ముంగిట నక్షత్రాలు విరజిమ్మే చిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకర పూలను విరబుసే కాకరపూవత్తులు,ఇలా ఎన్నో..  వెలుగుల ప్రత్యేకతలు. మరి ఈ సంబరం శాశ్వతం గా మదిలో మిగలాలంటే , కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆనందపు ఈ పండుగ విషాదాన్ని కొని తెస్తుంది. ప్రమోదం ప్రమాదాన్ని మిగులుస్తుంది.

ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్ళు పక్కన పెట్టుకోండి. వీలయితే, రగ్గులు దగ్గరుంచుకోండి . అగ్గితో ఆడేప్పుడు, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఊహించలేంకదా ! ఇలాంటి సందర్భాలలో  కీడెంచి మేలెంచమన్న మాట గుర్తుంచుకోవం మంచిది. 

నిప్పు రవ్వలు ఒంటిపైన దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్‌ దుస్తులనే  ధరించడం మంచిది.

ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదా రగ్గులను కప్పి మంటలను నిరోధించవచ్చు. దుప్పట్లు కప్పడం వల్ల నిప్పుకు ఆక్సిజన్‌ అందక పైకి వ్యాపించదు.

ఒక వేళ మీ ఇంటి పక్కన ఉన్న ఏ పూరి పాకపైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్‌ సర్వీసెస్‌కు ఫోను చేసేందుకు సిద్ధంగా ఉండండి

 నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్‌ కాకుండా నిరోధించేందుకు బర్నాల్‌, దూది, అయోడిన్‌, టించర్‌, డెట్టాల్‌ తదితరాలతో కూడిన ఫస్ట్ ఎయిడ్‌ కిట్‌ సిద్ధం చేసుకోవాలి .

ఒక వేళ ప్రమాదం బారిన పడితే, ప్రాధమిక వైద్యం చేసిన తరువాత కొంత ఉపశమనం పొందినప్పటికీ, తప్పక వైద్యుని వద్దకు వెళ్ళి పూర్తి చికిత్స చేయించుకోవడం ముఖ్యం.

పిల్లలు దీపావళి సామగ్రిని కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం.

బాంబులను ఎవరు కాల్చినా పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూది పెట్టడం మరచిపోవద్దు. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది.

విడి బాంబులు లేదా సీరియల్‌గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది.

పిల్లల చేతికి రాకెట్‌, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు.  వీటిని పూరిళ్లకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని కాల్చడం మంచిది. అదే విధంగా వీటిని కొంచెం రాత్రి అయిన తరువాత, జన సమ్మర్ధం తగ్గాక కాల్చుకోవటం మేలు.

భూ చక్రాలను కాల్చే టప్పుడు పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై దించవద్దు.

దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరు వత్తులను ఉంచవద్దు.

వెలిగి పేలకుండానే ఆరిపోయిన చిచ్చుబుడ్లు లేదా బాంబుల వద్దకు వెళ్ళి పరిశీలించడం, మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం.

చల్లదనం కోసం ఇంటి ముందు లేదా మేడపైన తాటాకులు, గడ్డితో వేసుకున్న రిసార్ట్‌ల వంటి వాటిపై నీళ్లు చల్లి ఉంచుకోవాలి


ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మీ దీపావళి టపాసులను కాల్చడం పూర్తి చేసుకోండి.

ఎక్కువగా టపాసులను కాల్చడం వల్ల వాయుకాలుష్యాన్ని మరింత పెంచిన వారవుతాం .

శబ్ద, వాయు కాలుష్యం అధికమైనప్పుడు  అది పర్యావరణం చేటుకు దారి తీస్తుందన్న విషయం మరచి పోవద్దు.

పెద్ద పెద్ద టపాసులు కాల్చే ముందు వాటి ప్యాక్‌లపై ముద్రించి ఉండే సూచనలను పాటించడం ద్వారా మనల్ని మనం  కాపాడుకున్న వారమవుతాం .

కాసింత జాగ్రత్త మరి కొంచెం సమయం కేటాయిస్తే ఆనందపు దీపావళి నవనవోన్మేషంగా కాంతి పుంజాల్ని నింపు తుంది. తీపి గుర్తుగా మిగులుతుంది.

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya