దీపారాధన విధివిధానాలేమిటి ?
దీపారాధన విధివిధానాలేమిటి ?
-లక్ష్మీ రమణ .
దీపం జ్యోతిః పరబ్రహ్మం,
దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం,
సంధ్యా దీపం నమోస్తుతే.
దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం, దీపం అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుంది, దీపారాధాన అన్నిటిని సాధించిపెడుతుంది. అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం అర్ధం.
దీపం అంటేనే దివ్య జ్యోతి , జ్ఞాన జ్యోతి అని అర్థం . ఒక్కో దీపానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది. శ్లోకంలో "సర్వ తమోపహం" అంటే అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుందని. మోహపాశాలలో చిక్కుకొని అంధకారంలో బతికే జీవులకి ఆత్మజ్యోతి వంటి జ్ఞాన దర్శనం అవసరమేకదా !! అందుకే పెద్దలు ఇలా అంటుంటారు దీపారాధన జరిగే ప్రదేశంలో మహాక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇళ్ళు కళావిహీనమై, అలక్ష్మీస్థానం అవుతాయి అని . సాధారణంగా దీపారాధన లేకుండా హిందువులు దేవతారాధన చేయరు.
సైన్స్ కూడా దీపాన్ని గురించి అద్భుతమైన విశేషాలు చెప్పింది . ఆవునేతితో వెలిగించిన దీపాపు కాంతి రోజు కనీసం 1 గంట సమయమైనా చిన్నవయసు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు. నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం 1 గంట పాటు కళ్ళ మీద పడితే కంట్లో శుక్లాలు (cataract) రావు. ఆవునేయి, నువ్వులనూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ళ దృష్టి (eye sight) ని మెరుగుపరుస్తాయి. అందువల్ల మనం చేసే ప్రతి శుభకార్యంలో దీపం తప్పక ఉంటుంది. మనం పూజ సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి, మనకు మేలు చేస్తాయి. ఇలా కూడా దీపం అంధకారాన్ని అంతం చేసిందికదా !
దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీప పీఠ భాగము బ్రహ్మతో సమానం. స్తంభం విష్ణు రూపం, ప్రమిద పరమేశ్వరుడని, దీపతైలం నాదం, వత్తి అగ్ని దేవుడిగాను భావన ఉంది. వెలుగు శక్తి స్వరూపం.
కుంది :
దీపారాధన చేసేటప్పుడు ముందుగా కుందిని ఒక పళ్శెంలో కానీ తమలపాకు మీద కానీ పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు. ఆతర్వాత కుందిలో నూనె పోసి, తర్వాత వత్తులు వేయాలి. వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉయోగించాలి. అంతేకానీ శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్ధతి కాదు.
తైలం :
దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీమహాలక్ష్మికి, నువ్వుల నూనె శ్రీమహావిష్ణువు, శ్రీసుబ్రహ్మణ్య స్వామి, కొబ్బరి నూనె శ్రీమహాగణపతికి ముఖ్యమని చెబుతుంటారు. అలాగే ఆవు నెయ్యి, విప్పనూనె, వేపనూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తికి చాలా ముఖ్యం. సాధారంగా ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, ఆముదం కానీ ఏదో ఒక తైలం శ్రేష్ఠం. ఎట్టి పరిస్థితుల్లో వేరు శనగనూనె వాడరాదు.
వత్తులు :
నూనె వేశాక రెండు వత్తులు లేదా సందర్భానుసారంగా , ప్రత్యేకతలని అనుసరించి వత్తులని వేసి దీపాన్ని వెలిగించాలి . ఒక వత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు. దీపారాధన కుందిలో 5 వత్తులు వేసి గృహిణి స్వయంగా చేసే దీపారాధన ఇంటికే వెలుగు నిస్తుంది . మొదటి వత్తి భర్త, సంతానం సంక్షేమం కోసమని, రెండో వత్తి అత్త మామల క్షేమానికి, మూడోది అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ క్షేమానికి, నాల్గవది గౌరవం, ధర్మవృద్ధిలకూ, అయిదోది వంశాభివృద్ధికి అని ఈ ఇరువత్తులు వెలిగించడంలోని ఆంతర్యాన్ని వివరిస్తుంటారు .
దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి భాదలు తొలగించు కునుటకు మంచిది
ఎలా వెలిగించాలి :
దీపంలో దేవతలున్నారు, వేదాలు ఉన్నాయి, శాంతి ఉంది, కాంతి వుంది. ఇంతటి విశిష్ట దీపాన్ని నేరుగా అగ్నిపుల్లతో వెలిగించకూడదు. మరొక దీపం లేదా హారతి గరిటె లో నూనెలో తడిపిన ఒకవత్తి వేసి దానితోటి ద్వారా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుంచి దీపారాధన చేయాలి.
దీపం ఏ దిక్కుకి తిరిగి ఉండాలి:
తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి.
దీప పూజ :
దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల లేదా ఐదు చోట్ల కుంకుమ పెట్టి, అక్షింతలు గానీ పూలుగానీ సమర్పించి నమస్కారం చేసుకోవాలి . మనలోని అంధకారం కూడా ఈ దీపప్రజ్వలన వలన అంతరించిన చీకటిలాగా అంతరించి , దివ్యమైన, సత్యమైన జ్ఞానమనే ప్రకాశం ఉదయయించాలనే భావనతో దీపానికి నమస్కారం చేసుకోవాలి .
దీపారాధన విధానాలు - విశిష్ఠ ఫలితాలు .
అమ్మవారి ముందు బియ్యం పోసి దాని మీద వెండి కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేథస్సు పెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.
లక్ష్మీ పూజ చేసి , 11 కానీ 16 కానీ శుక్రవారాలు కానీ ఇంట్లో ఉప్పు దీపం వెలిగించి ఈశాన్యం మూల పెట్టడం వల్ల శాశ్వతంగా ధనము యొక్క ఇబ్బందులు తొలగిపోతాయి.
తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావని విశ్వాసం.
నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభము. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
వేప నూనె రెండు చుక్కలు ఆవునెయ్యి కలిపి పరమ శివుని ముందు వెలిగిస్తే విజయం ప్రాప్తిస్తుంది. కొబ్బరి నూనెతో దీపారాధన అర్ధనారీశ్వరునికి చేయడం వల్ల అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరినూనె ఉపయోగిస్తే మంచిది.
నూవ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలు దూరం చేసి సకలశుభాలూ ఇవ్వగలదు. నువ్వుల నూనె విష్ణ్వాంశమూర్తులకు అత్యంత ప్రీతికరం.
దీపారాధన మనం రోజూ ఇంట్లో చేసుకొనేదే ! కానీ విధివిధానాలని అనుసరించి చేయడం వలన మరింత శ్రేయోదాయకంగా, ఫలప్రదంగా ఉంటుంది .