జుట్టు విరబోసుకొని కూర్చోవద్దని ఎందుకు అంటారు ?
జుట్టు విరబోసుకొని కూర్చోవద్దని ఎందుకు అంటారు ?
జుట్టు లూసుగా వదిలేయడంఇప్పటి ఫ్యాషన్ . కానీ ఇంట్లో పెద్దలు అప్పటికీ చెబుతూనే ఉంటారు . జుట్టు విరబోసుకొని తిరగద్దమ్మా అని. ఎందుకలా అని అడిగినప్పుడు కొన్ని సార్లు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు . కానీ ఇక్కడ మన ఇతిహాస కావ్యం లోని ఒక సంఘటనని చూడండి .
దితి కశ్యప మహర్షి భార్య. రాక్షసులకు తల్లి . ఒకానొక సందర్భంలో ఆమె ఇంద్రుడిని చంపగలిగే కుమారుడు కావాలని భర్తని వేడుకొంది. నూరేండ్లు నీ గర్భాన్ని కూపాడుకో ! నీకు అంతటి బలశాలి జన్మిస్తాడని వరమిచ్చాడు కశ్యపుడు .
గర్భందాల్చింది దితి. నూరేండ్లు నిండి , బిడ్డ జన్మించేందుకు ఇంకా కొద్దీ కాలమే మిగిలుంది . ఇంద్రుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు . ఒక రోజు, మిట్ట మధ్యాహ్నం వేళ, తన జుట్టుని విరబోసుకొని కూర్చుంది. బాగా అలసిపోవడం చేత ఆమె శిరస్సు కొంచెం ముందుకి వంగింది, అప్పుడామె జుట్టు పాదాలకి తగిలింది. అలా తగలడం చేత ఆమె సౌచం పోయింది. ఇలాంటి సమయం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు వెంటనే ఆమె గర్భంలోకి ప్రవేశించి గర్భస్థ పిండాన్ని 7 ముక్కలు చేశాడు. అలా ముక్కలు చేస్తుండగా ఆ పిండం నరకద్దు నరకద్దు అని అరిచింది, ఆ ఏడుపు దితికి వినబడి, దితి కూడా నరకద్దు అని అనింది.
అప్పుడు ఇంద్రుడు బయటకి వచ్చి, నీ మీద గౌరవంతో నేను ఆ పిండాన్ని సంహరించలేదు అని అన్నాడు. నాయందు సౌచం పోయింది కనుక నువ్వు నా పిండాన్ని నరకడంలో తప్పులేదు, కాని నా పిండాలకి దేవతా స్వరూపం ఇచ్చి వాటిని వాయు స్కంధాలకి అధిదేవతలగా ఉండే వరం ఇవ్వమని దితి కోరింది. ఇంద్రుడు సరే అని బ్రహ్మలోకంలోని, ఇంద్రలోకంలోని, అంతరిక్షంలోని వాయు స్కంధాలతో పాటు నాలుగు దిక్కులకి వాయు స్కంధాలుగా ఉండే వరం ఇస్తున్నాను అని అన్నాడు. ఆ ఏడుగురిని మరుత్తులు అని పిలుస్తారు.వారే
ఆహవ వాయువు: మేఘ మండలానికి, భూమండలానికి మధ్య ప్రసరించునది.
ప్రవహ వాయువు: సూర్య మండలానికి, మేఘ మండలానికి మధ్య ప్రసరించునది.
అనువహ వాయువు: చంద్ర మండలానికి, సూర్య మండలానికి మధ్య ప్రసరించునది.
సంవహ వాయువు: నక్షత్ర మండలానికి, చంద్ర మండలానికి మధ్య ప్రసరించునది.
వివహ వాయువు: గ్రహ్ర మండలానికి, నక్షత్ర మండలానికి మధ్య ప్రసరించునది.
పరావహ వాయువు: సప్తర్షి మండలానికి, గ్రహ మండలానికి మధ్య ప్రసరించునది.
పరివహ వాయువు: ధ్రువ మండలానికి, సప్తర్షి మండలానికి మధ్య ప్రసరించునది.
చూశారా కేవలం జుట్టు విరబోసుకోవడం , ఆ జుట్టు పాదాలకి తగలడం వల్ల (ఇంద్రియాలని వశం చేసికోగలిగిన) ఇంద్రుణ్ణి సంహరించగలిగిన కొడుకుని కనాల్సిన ఆవిడ , సప్త వాయువులకి (మరుత్తులు ) జన్మనిచ్చింది . అంతటి కీడుని గలుగ జేయస్తుంది కాబట్టే , పెద్దలు జుట్టు విరబోసుకోకండి అని చెబుతారు . ఇప్పటికైనా వారిమాటే మన్నిద్దామా మరి !!