Online Puja Services

33 కోట్లమంది దేవతలు- వారి కార్యాలయాలు

3.141.29.90

33 కోట్లమంది దేవతలు- వారి కార్యాలయాలు

ఒక చిన్న కార్యాలయం ఉంది. దాన్ని నడిపించడానికి ఒక యజమాని, అతనికింద కార్యనిర్వాహకుడు, అతనికింద గుమాస్తా, ఇతర సిబ్బంది , నౌకర్లు ఇలా ఎంతోమంది సహాయకులు ఉంటారు. మరి ఈ విశ్వాన్నే సృష్టించి, నడిపిస్తున్న జగన్నాయకునికి ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు. ఒక్కో జీవిది ఒక్కో కథ. మనుషులమనమే ఇంటింటికో కథని కలిగి ఉంటాము . మన జీవితాలు ఏవీ ఒకదాన్ని పోలినట్టు మరొకటి ఉండవు .  అటువంటి ఎన్ని కోట్ల జీవరాశిని , ప్రకృతిని, భౌతికమైన దానిని , అభౌతికమైనదానిని ఆ విశ్వేశ్వరుడు నడిపించాలో కదా !  

ఆ విశ్వంలోని అణువూ అణువునా నిలిచియున్నాడు. సందేహమే లేదు . నాడు ప్రహ్లాదుడి కోరికమీద స్థంభం నుండీ ఉద్భవించి , తానూ సృష్టిలోని ప్రతిఅణువులో ఉన్నానని నిరూపించేశాడు కూడా !! అయినా పనులు సత్వరంగా, జరిగేందుకు కార్యవర్గం అవసరమేగా !! వారే , 33 కోట్లమంది దేవతలు. ముప్పైమూడు కోట్ల దేవతలు అంటే సంస్కృతం లో కోటి అంటే విభాగం అని అర్ధం. మొత్తం ముప్పైమూడు రకాలయిన దేవతలు అని అర్ధం వస్తుంది.

నిజానికి వీరు 33 కోట్లమంది కాదని 33 రకాల దేవతా సమూహాలని యాజ్ఞవల్క్య మహర్షి , శాకల్యునికి చెప్పిన వివరణ ఇక్కడ  మీ కోసం . 

విదగ్ధుడు:యాజ్ఞవల్క్యా! దేవతలెందరు? అష్ట వసుసవులెవరు? ఏకాదశ రుద్రులెవరు? ఆదిత్యులెవరు? 

యాజ్ఞవల్క్యుడు మొదలుపెట్టేడు.

“ఓ శాకల్యుడా! వైశ్వదేవ శస్త్రము యొక్క దేవతా సంఖ్యను తెలిపే నివిత్తు అనే మంత్రముతో ఎంత సంఖ్య గల దేవతలు ఏర్పడుతున్నారో అంతమంది దేవతలున్నారు. ఆ మంత్రము ద్వారా 303 దేవతలు, 3003 దేవతలు కలిసి మొత్తం 3306 మంది దేవతలు.కాని 33 మంది దేవతల యొక్క విభూతులే (స్వరూపాలే) ఆ మొత్తం దేవతలందరూ కూడా. వారే ఆరుగురు దేవతలుగాను, ముగ్గురు దేవతలుగాను, ఇద్దరు దేవతలుగాను, ఒకటిన్నర దేవత గాను చివరగా ఒక్క దేవతగాను అయ్యారు.” అంటూ వారి వివరణని ఈ విధంగా చెప్పసాగారు . 
వారే , అష్ట వసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, ఇంద్రుడు మరియు బ్రహ్మ (ప్రజాపతి) కలిపి మొత్తం ముప్పైమూడు మంది దేవతలు.

అష్ట వసువులు:

అగ్ని, పృథివి, వాయువు, అంతరిక్షము, ఆదిత్యుడు, ద్యులోకము, చంద్రుడు, నక్షత్రాలు అనే ఈ ఎనిమిదిలోనూ సర్వమూ ఉంచబడింది. అందుచే వారికి వసువులని పేరు. (భూమిపై గల సమస్త పదార్ధములకు రంగు రుచి వాసన గుణము ఆకారము (అస్థిత్వము) కల్పిస్తూ ప్రకాశించేవాళ్ళు వసువులు. భూమి యందలి ఏ రూపమైనా ఈ వసువులు లేకుండా ఏర్పడదు.)

ఏకాదశ రుద్రులు :

ఏకాదశ రుద్రులంటే పురుషునిలో ఉండే పంచప్రాణములు, మనస్సు, జీవాత్మ కలిపి ఒకటి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మొత్తం పదకొండు రుద్రులు. ఆత్మయే పదకొండవ రుద్రుడు. ఈ ఆత్మ మర్త్య శరీరాన్ని వదలనని, విడిచి వెళ్ళనని చెప్పడం మానవునికి దుఃఖ హేతువు. ఆ రకంగా ఏడ్పించడం వల్లనే “రోదయంతి రుద్రః” – రుద్రులు అని పేరు వచ్చింది.

(ఆకాశంలో ఏర్పడే స్పందనలన్నీ రుద్రులు సృష్టించేవే. పంచభూతాత్మకమైన ప్రకృతిలో ఉండే మార్పులన్నీ వీరు సృష్టించే స్పందనలే కాబట్టి ప్రాణుల జీవనం వీరిదయపై ఆధారపడి ఉంది. మనలోని పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, మనస్సును శాసించేది ఈ రుద్రులే.)

ద్వాదశ ఆదిత్యులు :

సంవత్సరము యొక్క పన్నెండు మాసాలు పన్నెండు ఆదిత్య దేవతలు. ఒక్కొక్క మాసంలో సూర్యకిరణాలు ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటాయి. ఆ పన్నెండు ఆదిత్యులు వేరు వేరు గా ఉంటారు. ఆయా మాసములందు పరివర్తన చెందుతూ ప్రాణుల ఆయుస్సును కర్మఫలమును హరించు చుండడం చేత “ఆదదానః” అని ఆదిత్యులు పిలవ బడుతున్నారు.

ఇంద్రప్రజాపతులు :

స్తనయిత్నువు అనే వాడే (మబ్బులు లేదా ఉరుములు) ఇంద్రుడు; యజ్ఞమే ప్రజాపతి. స్తనయిత్నువు అంటే వజ్రాయుధమే. యజ్ఞమంటే యజ్ఞపశువే.


ఈ ముప్పైమూడుమందీ తిరిగి ఏకమై , ఒకే ఒక చైతన్యమై , పరమాత్మ స్వరూపంగా ఎలా మారుతోందని విషయాన్ని తిరిగి విదగ్ధునికి వివరిస్తూ,  యాజ్ఞవల్క్య మహర్షి  ఇలా చెప్పసాగారు . 

ఆరుగురు దేవతలు: 

“విదగ్ధా! అగ్ని, భూమి, వాయువు, అంతరిక్షము, సూర్యుడు, ద్యులోకము అనే ఆరు ఆరుగురు దేవతలు. ఇంతకు ముందు చెప్పిన ముప్పయి ముగ్గురు దేవతలు ఈ ఆరుగురే అవుతున్నారు.
 

ముగ్గురు దేవతలు:

భూమి, సూర్యుడు, ద్యులోకము అనే ఈ మూడు లోకాలు-ముగ్గురు దేవతలు. సర్వ దేవతలు (ఆరుగురు దేవతలు) ఈ ముగ్గురిలో అంతర్భావాన్ని కలిగి ఉన్నారు.

ఇద్దరు దేవతలు:

అన్నము, ప్రాణము అనేవి రెండూ పూర్వోక్తమైన ఇద్దరు దేవతలు.

సగము అధికముగా గల దేవత:

వాయువే ఒకటిన్నర దేవత. వాయువే అధ్యర్ధము అన్నారు. ఒకటి వాయువు ఒక దేవత. వాయువు చేతనే సమస్తము అభివృద్ధి చెందుతోంది, అంతే కాకుండా చరాచర ప్రాణికోటికి ఆధారము వాయువే కాబట్టి ఇంకొక అర్ధ భాగం గా పేర్కోని వాయువును ఒకటిన్నర దేవతగా వర్ణించేరు.

ఒకే ఒక్క దేవత :

ప్రాణమే ఒక్క దేవత.  సర్వ దేవతలు ఒక్క ప్రాణం లోనే ఉన్నారు. అందువల్ల ప్రాణమే సర్వ దేవాత్మక మైన బ్రహ్మము గా అభివర్ణించేరు. “జ్యేష్ట శ్రేష్ట ప్రజాపతి” అని నామాన్ని పొందిన ప్రాణమే సర్వ దేవతా స్వరూపము.

ముప్పయి మూడు దేవతల యొక్క రూపమే ఈ ప్రాణ దేవత. అందుచేత ఆ ప్రాణమే బృహత్స్వరూపమైన ఆ పరబ్రహ్మమని చెప్పబడుతోంది.

- లక్ష్మి రమణ 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore