Online Puja Services

మంత్రము , యంత్రము , తంత్రము అంటే ఏమిటి ?

3.139.72.152

మంత్రము , యంత్రము , తంత్రము అంటే ఏమిటి ?

మన పూర్వీకులు సనాతన ధర్మంలో వీటి వైశిష్ట్యాన్ని వివరించారు .   మంత్రము- జ్ఞాన శక్తికి సంకేతం .యంత్రము - ఇచ్ఛాశక్తి చిహ్నము . తంత్రము - క్రియా శక్తికి మూలం. మూడు విధానాలు దైవానుగ్రహాన్ని సంప్రాప్తిపజేసేవే ! కానీ విధానాల్లోనే తేడా ఉంటుంది . మరింత వివరంగా తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం . 

మంత్రము
మంత్రము అనేది అక్షరాలతో కూర్చబడినది. మంత్రము శబ్ద తరంగాల సమూహశక్తి. అక్షరాలతో నిండిన నిత్యమైన శక్తి. అది సాధకుల చేత సాధన చేయబడుతోంది కాబట్టి మంత్రము అయ్యింది . 

త్ర అనేది త్రైధాతువు నుండి వచ్చింది. దీని అర్థం విముక్తి కలిగించుట. త్రాణ అనగా ఇహలోక లేక సంసార బంధాల నుండి విముక్తి. సూక్ష్మంగా రక్షణ అనవచ్చు. దేనిని పఠించుట లేక ఉచ్ఛరించటం వల్ల రక్షణ కలుగుతుందో అది మంత్రము. 

మనకు సప్తకోటి మహా మంత్రా లున్నాయి. అందులో వివిధ దేవతలకు, ఉపదేవతలకు సంబంధించినవెన్నో ఉన్నాయి. వాటన్నింటిని అర్థం చేసుకోవడానికి ఈ జన్మచాలదు.

 మంత్రాన్ని మననం చేయటం వల్ల మనసులోవున్న మాలిన్యా లు తొలగుతాయి. మంత్రము ఒకేవిధమైన శబ్ద శక్తి స్వరూపము. శబ్దము శూన్యము యొక్క స్వభావము. శబ్దము ఆకాశము గుణము. దీనినే శబ్ద బ్రహ్మ అనికూడా అంటారు. శబ్ద రూపం లో వ్యక్తమయ్యే పరబ్రహ్మము. అందువల్ల శబ్దానికి ఉన్న శక్తిని గ్రహించినప్పుడే మంత్రానికి ఉన్న శక్తి అర్థమౌతుంది. అక్షర శబ్దము, శాశ్వతత్వాలను వేదాలు ఆమోదిస్తున్నాయి.మంత్రాలు ఏకాక్షరం మొదలుకొని ఒక దేవి లేక దేవత సహస్రనామాల వరకు ఉండ
వచ్చు.

రామ అనే మాటని పలకలేని కిరాతకుడికి నారదుడు మరా అనే మంత్రాన్ని ఉపదేశించాడు . అంటే శబ్దాన్ని ఉపదేశించాడు . అది శక్తిపాతమై , రామనామమై , ఆ కిరాతకుణ్ణి వాల్మీకిని చేసింది . అది  మంత్రానికున్న శక్తి . 

యంత్రము
యంత్రము అనే పదము యమ్‌, త్రై అను రెండు ధాతువులనుండి ఉద్భవించినది . దీనికి  అర్థము రక్షించుట అని అర్థము . శక్తిని నిక్షిప్తంచేసుకొని , రక్షించునది యంత్రము అన్నమాట .  యంత్రాన్ని ఆరాధించటం కూడా సాంప్రదాయ సిద్ధంగా పురాతనంగా ఆచారంలో ఉంది. యంత్రాలన్ని రేఖామాత్రంగా ఉంటాయి. వాటిలో బీజాక్షర సహితలు, రహితలని రెండు రకాలు. యంత్రాలలో అక్షరాలకన్నా రేఖలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. సర్వ యంత్రాల్లో సామాన్య ధర్మమొకటి ఉంటుంది. అదేమిటంటే త్రిభుజాకారం. అన్నింటికంటే ఎక్కువ త్రిభుజాలున్నది. శ్రీ చక్రం. అందుకే సర్వమంత్రాలకు యంత్ర రాజమైంది. 

‘యమ్‌’ అనేది వాయుతత్వానికి మూలం. వాయు తత్వముచే ఏర్పడే శక్తి చలన శక్తి, లేక భవిష్యత్తులో పెరుగు శక్తి కావచ్చు. ఇది విశ్వశక్తి లేక ప్రాణం. దేవతా విగ్రహం భౌతికమైన లేక బాహ్యమైన లక్షణాలను సూచించగా యంత్రం దేవత సారాన్ని ప్రతిబింబించే ప్రతీకగా చెప్పబడుచున్నది. సాధారణంగా యంత్రం ద్వారా దేవి దేవతను పూజించుట, విగ్రహం లేక ప్రతిమను పూజించటంకన్నా మిన్నగా పరిగణింపబడుతున్నది. విగ్రహం కన్నా యంత్రానికి ఇచ్చి ప్రాధాన్యత, దేవాలయాలలో విగ్రహారాలను ప్రతిష్టించే టప్పుడు స్పష్టంగా కనబడుతుంది. విగ్రహాన్ని ప్రతిష్టించటానికి ముందు యంత్రాన్ని ఏర్ప రచి, దానిపై విగ్రహం ప్రతిష్టిస్తారు.

ఆదిశంకరాచార్యులవారు యంత్ర ప్రతిష్టాపనచేసి వరంగల్లులోని భద్రకాళి అమ్మవారిని శాంతపరిచారని , అలాగే ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మని కూడా శాంతస్వరూపిణిగా మార్చారని చెబుతాయారు . 

తంత్రము
జ్ఞానాన్ని వివరించి, విశదీకరించేది తంత్రము. మంత్ర, యంత్రాలకు సంబంధించిన జ్ఞానము. తంత్రం అంటే పూజించుట లేక అర్జించు విధానము. ‘తం’ అనగా రక్షించుట తంత్ర మంటే జ్ఞానాన్ని పెంపొందించే శాస్త్రం. తంత్ర స్పర్శ లేని ప్రజాదరణ పొందిన దేవాలయ ప్రతిష్ట లోకంలో ఉండదు. తంత్ర స్పర్శ లేనిది వైదికకర్మ రాణింపు చెందదనేది  విజ్ఞుల మాట .

పురాణపరంగా జనమేజయుడు సర్పయాగం ద్వారా సర్ప కులాన్నే నాశనం చేయడం, ద్రుపదుడు యజ్ఞం ద్వారా ద్రౌపదిని, దృష్టద్యుముడిని పొందడం, ఉప పాండవ వధకు పూర్వం అశ్వధ్దామ భూతనాధుని సేవించడం, విశ్వామిత్రుని త్రిశంఖు స్వర్గ నిర్మాణం, వేమనగారి హేమ తారక విద్య, ఇంకా అనేక పురాణ సంఘటనలు వైదిక ముసుగులో ఉన్న తాంత్రిక విద్యలే. భాగవత దశమ స్కంధంలో తాంత్రిక విద్యను గూర్చి ప్రస్తావిస్తూ ఉపాయంచేత వైదిక కర్మలను సఫలీకృతం చేయడమని చెప్పబడింది. త్రిగుణాల (సత్త్వ- రజస్‌, తమస్‌) ఆధారంగా తంత్రాలు విభజితమయ్యాయి. ఉదాహరణకు తంత్రంలో బలి ప్రధానమైంది. యజ్ఞయాగాదులలో జంతు బలి కూష్మాండము (గుమ్మడికాయ) కొబ్బరి కాయ, నిమ్మకాయ బలిగా ఇవ్వటం వంటివి తంత్ర విధానాలే .
వేదాలు భగవంతుని ప్రవచనాలైతే తంత్ర శాస్త్రం కూడా భగవద్విలాసమే కదా! అవతార పురుషుడైన శ్రీ కృష్ణుని ఆ యుగంలో చాలామంది తాంత్రికుడని అన్నారు.

అద్భుతమైన ఈ విధులు మన పూర్వీకులు ఎంతో పరిశోధన చేసి అందించిన గనులు . నేటి సైన్స్ కి అందని అద్భుతాలు అపప్టి మన పూర్వీకుల సైన్స్ కి , సెన్స్ కి తెలుసని ఎన్నోసార్లు నిరూపితమయ్యింది .  కాబట్టి వీలున్నవారు , విధిగా ఆచరించి ముక్తిదాయకమైన వాటి ప్రయోజనాలను  అందుకోగలరని ఆశిస్తూ , శలవు .

- లక్ష్మి రమణ 

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda