Online Puja Services

బుద్ధ జ్ఞానోదయం - జగతికి పూర్ణోదయం

3.142.243.141

బుద్ధ జ్ఞానోదయం - జగతికి పూర్ణోదయం 

బుద్ధ సాధన సాధకులకు ఒక మార్గనిర్దేశకమే. బౌద్ధావలంబకులకే కాకుండా సాధకులందరూ కూడా తెలుసుకోవలసిన మార్గం ఈ బుద్ధ మార్గం. ఆత్మాన్వేషణ చేసే సాధకునికి ధైర్య సాహసాలతోపాటు ఓర్పు, అకుంఠిత దీక్ష , పట్టుదల అవసరమని చెబుతుంది గౌతమ బుద్ధుని సాధన . 

జగత్తులోని విషయములపట్ల విరక్తిని పొందిన బుద్ధుడు సన్యసించారు .  సత్యాన్వేషణ మొదలుపెట్టారు . సుమారు ఎనిమిది సంవత్సరాల కఠోర సాధన అనంతరం శారీరకంగా చాలా నీరసించి పోయారు. నాలుగు సంవత్సరాలపాటు ఆయన 'సమాన’ అనే సాధనలో ఉన్నారు. 'సమాన’ సాధన అంటే ఆహారాన్ని అపేక్షించకుండా నడుస్తూనే ఉండాలి - కేవలం ఉపవాసం, నడవటం. ఈ సాధన ఆయన శరీరాన్ని దాదాపు చావుకి దగ్గరయేంతగా శుష్కింపచేసింది. ఆయన అలానడుస్తూ, 'నిరంజన’ అనే నది వద్దకు వెళ్ళారు. ఈ రోజు భారతదేశంలోని చాలా నదుల్లా, అది ఎండిపోయి, కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈ నది మోకాలి లోతు నీరుతో, ఒక పెద్దపాయలా, వేగంగా ప్రవాహిస్తోంది. ఆ నదిని దాటడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఆయన శరీరం ఎంత నీరసించి పోయిందంటే నది మధ్యలోకి వెళ్ళాక ఆయన మరొక్క అడుగు కూడా వేయ లేకపోయారు. కానీ సాధకుడైనవాడు సత్యాన్వేషణలో పట్టుదల వదిలేస్తే ఎలా? ప్రయాణం ఇక అక్కడితో అంతమైపోతుంది మరి . అందుకే అలాంటిస్థితిలోనూ ఆయన పట్టుదల వీడలేదు .అక్కడున్న ఒక పెద్ద ఎండుకొమ్మని పట్టుకుని అలా నిలబడిపోయారు.

“నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుండి కదలను! నేను ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే చనిపోవాలి!’’ అని దృఢంగా సంకల్పించుకున్నారు . 

ఆయన అలా గంటల తరబడి నిలబడ్డారని చెబుతారు. అసలు ఆయన గంటల కొద్దీ నిలబడ్డారో లేదా నీరసించిన స్థితిలో కొన్ని క్షణాలే ఆయనకు గంటలుగా అనిపించాయో మనకి తెలియదు. కాని ఆ క్షణంలో ఆయన ‘తాను దేని కోసమైతే పరితపిస్తున్నారో అది తనలోనే ఉంది!’ అనే విషయం గ్రహించారు. "ఈ శ్రమంతా ఎందుకు? కావలసినది సంపూర్ణమైన అంగీకారం, అంతే. నేను శోధిస్తున్నది ఇక్కడే (నా లోపలే) ఉంది. నేను ప్రపంచమంతా ఎందుకు వెతుకుతున్నాను?’’ అనుకున్నారు.

 అలా అనిపించాక ఆయనకు మరో అడుగు వేయటానికి ఇంకాస్త శక్తి వచ్చింది. ఆ నదిని దాటి, ఇప్పడు ప్రఖ్యాతి గాంచిన బోధివృక్షం క్రింద కూర్చున్నారు. అక్కడ కూర్చుని ఎంతో ధ్రుడ నిశ్చయంతో “నాకు పరమోన్నత స్థితి ప్రాప్తమయ్యే వరకూ నేను ఇక్కడి నుండి కదలను! నేను ఆత్మ సాక్షత్కారమైన జ్ఞానిగా లేచి నిలబడాలి లేదా ఇలానే చనిపోవాలి!’’ అని నిశ్చయించుకున్నారు. ఆ మరుక్షణమే ఆయన ఆ స్థితికి చేరగలిగారు.

జ్ఞానోదయం పొందాలంటే మనం జీవితంలో కోరుకునేది అదొక్కటే కావాలి. అప్పుడు అది క్షణంలో జరిగిపోతుంది. మన సాధన, ప్రయత్నం అంతా మనకి అటువంటి ప్రాధాన్యత ఎర్పడడం కొరకే. మనుషులందరికీ ఎన్నో ప్రాధాన్యతలుంటాయి. అందువల్ల వారి మనస్సు, భావోద్వేగాలు, శక్తి అంతటా విస్తరించి ఉంటాయి. వాటన్నటినీ ఒక చోటకి తెచ్చి సాధన చేయటానికి ఎంతో సమయంపడుతుంది. ప్రజలు చాలా వాటిలో మమేకమైపోతున్నారు. అందుకే ఎంతో సమయంపడుతోంది. కాబట్టి, మొదట మీరు చేయవలసింది ఏమిటంటే మిమ్మల్ని మీరు ఒక్క చోటుకి సమీకరించుకోవడం. అంటే మిమ్మల్ని మీరు ఒకే ఒక్క దిశ వైపు మాత్రమే మళ్ళించుకోవడం. ఒక మనిషి తనను తాను సంపూర్ణంగా ఒక్క చోటుకి సమీకరించుకున్నప్పుడు మాత్రమే, అతనికి మేము ఏదైనా చేయడం సాధ్యమవుతుంది.

బుద్ధుడికి ఆ ఒక్క క్షణంలో అది జరిగింది. పున్నమి చంద్రుడు ఉదయిస్తుండగా ఆయన పూర్తి జ్ఞానిగా అవతరించారు. ఆయన కొన్ని గంటలు అక్కడే కూర్చుని లేచారు.

"సమాన" గా ఆయన సాధనలోని తీవ్రతను చూసి ఎన్నో సంవత్సరాల పాటు ఆయనతో ఉన్న ఐదుగురు తోటి సాధకులు ఆయనను మార్గదర్శకునిగా తీసుకున్నారు. కాని ఆయన లేచి నిలబడి మొదట "మనందరం భోజనం చేద్దాం!" అన్నారు. దీంతో వాళ్ళు నిర్ఘాంతపోయారు. వారంతా ఆయన సాధన దిగజారి పొయిందనుకున్నారు, వారు పూర్తిగా నిరుత్సాహ పడిపోయారు. గౌతముడు వారితో, "మీకు అసలు విషయం తెలియడం లేదు. ఇది ఉపవాసం గురించి కాదు, ఇది ఙ్ఞానోదయం గురించి! నాకు పూర్ణ ఙ్ఞానోదయం అయింది. నన్ను గమనించండి. నా లోని ఈ మార్పును చూడండి. నాతో కేవలం అలా ఉండిపోండి, అంతే!" అన్నారు. కాని వారు గౌతముడిని వదిలి వెళ్ళిపొయారు. వారిపై ఉన్న కారుణ్యం వల్ల, కొన్ని సంవత్సరాల తరువాత బుద్దుడు వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారిని జ్ఞానోదయం వైపు నడిపించారు.

ఙ్ఞానులు చాలా మంది ఉండవచ్చు. కాని, ఈ అద్భుతమైన మనిషి ప్రపంచపు రూపు రేఖలను ఎన్నో విధాలుగా మర్చి, ఇంకా ఈ నాటికి కూడా ప్రభావితం చేస్తూనే ఉన్నారు. దాదాపు 2500 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి , ఇది ఏమంత  తక్కువ సమయం కాదు కదా! అందుకేమరి బుద్ధ జ్ఞానోదయం - జగతికి పూర్ణోదయం అనేది .

- లక్ష్మి రమణ 

Quote of the day

The moment I have realized God sitting in the temple of every human body, the moment I stand in reverence before every human being and see God in him - that moment I am free from bondage, everything that binds vanishes, and I am free.…

__________Swamy Vivekananda