పూరి జగన్నాధుని స్నానోత్సవం
జ్యేష్ఠ పూర్ణిమ.
ఒరిస్సాలోనున్న పూరీ క్షేత్రంలో ఈ రోజు చాల వైభవంగా స్నానోత్సవం జరుగుతుంది. జ్యేష్ఠ పూర్ణిమనాడు ఉదయం జగన్నాథ , బలభద్ర , సుభద్ర , సుదర్శన మరియు మదనమోహన విగ్రహాలను (మూల విరాట్టులను) రత్నవేది (నిత్యం వారు కొలువుదీరి ఉండే మండపం) నుండి స్నాన వేదికకు మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు.
అక్కడ గల సువర్ణబావి నుండి 108 కళశాలతో జలాలను తెచ్చి వాటిలో పసుపు , చందనం , పువ్వులు , సుగంధ ద్రవ్యాలు కలిపి వేదమంత్రాలు , శంఖనాదాలు , కీర్తనల నడుమ అభిషేకం చేస్తారు.ఈ స్నాన వేదిక 76 అడుగుల వెడల్పు ఉంటుంది.వచ్చిన వారికి కనిపించే విధంగా ఎత్తులో పెట్టి ఈ అభిషేకం నిర్వహిస్తారు.
ఆగమ శాస్త్రం ప్రకారం సంవత్సరం పొడవునా జరిగే /జరగనున్న వివిధ ఉత్సవాలలో తెలిసీ తెలియక ఏమైనా లోపాలు జరిగిఉంటే అవి ఈ స్నానోత్సవం వల్ల పరిహారమౌతాయి. ధర్మశాస్త్రం ప్రకారం ఇది చూసిన వారి పాపాలన్నీ కడుగుకుపోతాయి.
ఈ ఉత్సవం జరిగిన సాయంత్రం జగన్నాథునికి , బలభద్రునికి గణేశుని అవతారంతో అలంకరిస్తారు.
దీనితో ఒక భక్తుని గాథ ముడిపడిఉంది.
మహారాష్ట్రకు చెందిన గణపతిభట్టు మహా గణపతి భక్తుడు.తను జగన్నాథుని ద్వారా కూడా గణపతి అనుగ్రహం కోరుకున్నాడు.ఆయన పూరీ చేరేసరికి అప్పుడే భోగసమయం కావడం వల్ల గుడి తలుపులు మూసివేయబడ్డాయి.అప్పుడు ఈయనకి ఒక దృశ్యం కనిపించింది.జగన్నాథ బలభద్రులు మరియు అక్కడ ఉన్న పరివార దేవతలకందరకు శ్రీ సుభద్రా దేవి భోజనం వడ్డన చేస్తోంది.అదే సమయంలో సకల దేవతా రూపుడైన జగన్నాథుడు వినాయకునిగా రూపాంతరం చెంది ఈ భక్తుని తన తొండంతో లోపలకు తీసుకుని తనలో ఐక్యం చేసుకున్నాడు
ఇది జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు జరిగింది.దానిని పురస్కరించుకునే ఈ గణేశ అవతారం.
(సేకరణ)
శ్రీ రాధా లక్ష్మి