విప్ర క్షయం
నెమలీకలు - జైనులు
ఢిల్లీకి చెందిన ఆర్.కె. రంగన్ పరమాచార్య స్వామికి పెద్ద భక్తుడు. దర్శనానికి వచ్చిన ప్రతిసారీ, నెమలీకలతో చేసిన విసనకర్రను తెచ్చి స్వామికి సమర్పించేవాడు. మహాస్వామివారు అప్పుడప్పుడు దోమలను ఈగలను తోలడానికి ఉపయోగించేవారు. రంగన్ ఒకసారి ఒక డజను నెమలీక విసనకర్రలను తీసుకుని వచ్చాడు. స్వామివారు వాటిని తీసుకొని మేనాలో పెట్టుకున్నారు. శిష్యులు ఈ విషయం చూసి ఆశ్చర్యపోయారు. తమకోసం వస్తువులను అలా దాచుకోవడం మహాస్వామివారు ఎప్పుడూ చెయ్యరు.
ఒకరోజు ఉదయం మహాస్వామి వారు మేనాలో కూర్చుని జపం చేసుకుంటుండగా, పెద్ద ఈగల గుంపొకటి అటుగా వచ్చింది. స్వామివారు నెమలీకల విసనకర్రను వాడుతున్నారు వాటిని పారదోలడానికి. అప్పుడు కొంతమంది జైన సాధువులు వచ్చారు. వారి సంప్రదాయం ప్రకారం నోటి చుట్టూ తెల్లని గుడ్డ చుట్టుకొని ఉన్నారు. చాలా విషయాలపై స్వామివారు మాట్లాడుకున్నారు.
సంస్కృత పదకోశమైన అమరకోశం రాసినవారు జైన రాజైన అమరసింహుడు. జైనులకు సంబంధించిన చాలా పుస్తకాలు సంస్కృతంలోనే ఉన్నాయి. వీటన్నిటిని విని ఆ సాధువులు చాలా సంతోషించారు.
“మీరు ఉదయం నిద్ర లేవగానే ‘విప్రక్షయం’ ప్రార్థన చేస్తారా?” అని అడిగాఅరు మహాస్వామివారు.
“లేదు. మా గురువుగారు ఇక దానితో పనిలేదని చెప్పారు” అని వారు బదులిచ్చారు.
అక్కడ ఉన్న శిష్యులకి పరమాచార్య స్వామివారు అడిగిన ప్రశ్న కాని, ఆ సాధువులు చెప్పిన సమాధానం కాని ఏమీ అర్థం కాలేదు.
మహాస్వామివారే దాని గురించి ఇలా చెప్పసాగారు. “వైదిక క్రతువులు, అగ్ని సంస్కారాలు చాలా బాగా జరుగుతున్న కాలంలో, శాస్త్రం చెప్పిన విధంగా వైదిక యజ్ఞాలలో జంతు బలులు జరిగేవి. అహింసా సూత్రం మూల సూత్రంగా గల జైన మతం ఉధృతిలోకి వచ్చాక రోజూ ఉదయం ‘విప్రక్షయం’ లేదా ‘బ్రాహ్మణులు క్షయించుగాక’ అని పఠించేవారు వైదిక మతం సమసిపోవాలని”
బహుశా స్వామివారి ఆంతర్యం గ్రహించారేమో ఆ జైన సాధువులు, “అవును, అవును. ఇప్పుడు దాదాపు బ్రాహ్మణులందరూ అగ్నికార్యం వదిలేశారు. కాబట్టి యాగాలలో జంతుబలులు జరగటం లేదు. కనుక మా గురువులు ‘విప్రక్షయం’ పఠించవలసిన అవసరం లేదని సెలవిచ్చారు” అని చెప్పారు.
మహాస్వామివారు వారందరికి ఒక్కొక్క నెమలీక బహుమానంగా ఇచ్చారు. నెమలిని హింసించకుండా అవి వదిలిపెట్టినప్పుడు కిందపడినవి కావున వారు సంతోషంతో వాటిని స్వీకరించారు. బహుశా ఈ జైన సన్యాసులు వస్తారనే వారికి వీటీని బహుమానంగా ఇవ్వొచ్చనే మహాస్వామివారు ఆ నెమలీకలను మేనాలో దాచుకున్నారేమో. ఏమో! నెమలిపై ఎక్కి విహరించే ఆ స్మామినాథునికే తెలుసు.
--- మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం