Online Puja Services

అన్నదోష నివారణ శ్లోకం

52.15.199.160
ఊర్ధ్వ మూలం.....
 
శ్లో॥ అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రితః । 
ప్రాణాపాన సమాయుక్తః 
పచామ్యన్నం చతుర్విధం..॥
 
తా॥ నేను వైశ్వానరుణ్ణి (జఠరాగ్ని) అయి ప్రాణుల శరీరాలను ఆశ్రయించి ఉంటాను. ప్రాణ అపానాలతో కూడి నాలుగు రకాల అన్నాన్ని ఆరగిస్తాను.
 
వ్యాఖ్య...
 
ఈ శ్లోకం ప్రసిద్ధమైన శ్లోకం. భారతదేశంలో చాలా మంది, అనేక ఆశ్రమ వాసులు "అన్నదోష నివారణకై భోజన కాలాలలో ఈ శ్లోకాన్ని పఠించి భుజించటం ఆచారం" గా వస్తున్నది.
 
పరమాత్మ సర్వవ్యాపి. అంతటా ఉన్నాడు. వెలుపల అంతటా ఎలా వ్యాపించి యున్నాడో అలాగే ప్రాణుల లోపల కూడా అలాగే వ్యాపించి యున్నాడు.
ఎలాంటి రూపంలో ఉన్నాడు...
 
1. వైశ్వానరో భూత్వా...
వైశ్వానర రూపంలో.. జఠరాగ్ని రూపంలో.. ఉన్నాడు. ప్రాణం ఉన్నంత కాలం శరీరం వెచ్చగా ఉండాలి. ఆ వెచ్చదనాన్ని ఇచ్చేది భగవంతుడే. అందుకే మండు వేసవి లోను, చల్లని శీతాకాలంలోను ఒకే విధంగా 98.4 F వేడి ఉంటుంది. ఆ అగ్నియే జఠరాగ్ని - వైశ్వానరాగ్ని... అదే పరమాత్మ.
ఏం చేస్తున్నాడు పరమాత్మ వైశ్వానరాగ్ని రూపంలో...
 
2. పచామ్యన్నం చతుర్విధం...
మనం తినే 4 రకాల అన్నాన్ని పచనం చేస్తున్నాడు పరమాత్మ జఠరాగ్ని రూపంలో ఉండి. మనం హాయిగా తిని పడుకుంటే ఆయన మాత్రం నిద్రపోకుండా తిన్నదాన్ని పక్వం చేస్తున్నాడు. మనం నిద్రించినా ఆయన నిద్రపోడు. మనం నిద్రలేచి మళ్ళీ తినాలనుకుంటే తింటాం. అలా తినాలంటే అంతకు ముందు తిన్నది జీర్ణం కావాలి.  ఆ పనిని ఆయన చేసి మనకు సహాయ పడుతున్నాడు... మనం తినే "అన్నం చతుర్విధం"... అంటే నాలుగు రకాలుగా ఉంటుంది. 
 
అవి...
2.1. భక్ష్యం...
గట్టి పదార్థాలు. పళ్ళతో కొరికి, నమిలి తినేవి. గారెలు, వడలు, లాంటివి.
2.2. భోజ్యం...
మెత్తని పదార్థాలు. ముద్దలుగా చేసుకొని తినేవి. అన్నం, కూరలు, పచ్చళ్ళు, పప్పు మొదలైనవి.
2.3. చోష్యం...
జుర్రుకోనేవి, త్రాగేవి అయిన ద్రవ పదార్థాలు. సాంబారు, రసం, మజ్జిగ, కూల్ డ్రింక్స్, పాయసం మొదలైనవి.
2.4. లేహ్యం...
నాలుకకు రాసుకొనేవి, నంజుకోనేవి, చప్పరించేవి. ఊరగాయలు, కొన్ని రకాల పచ్చళ్ళు, తేనె మొదలైనవి.
ఈ నాలుగు రకాల ఆహారాలను పరమాత్మే జఠరాగ్ని రూపంలో పక్వం చేస్తాడు. ఎలా...
 
3. ప్రాణ అపాన సమాయుక్తః...
ప్రాణ, అపాన శక్తులతో కూడి పక్వం చేస్తాడు. మనం నోట్లో వేసుకున్న ఆహారాన్ని లోపలకు లాగి వేసి, దానిని జఠరాగ్నితో బాగా పచనం చేసి, జీర్ణింపజేసి, అన్ని అవయవాలకు రక్తం ద్వారా సరఫరా చేసి, మిగిలిపోయిన సారం లేని, అవసరం లేని ఆహారపు పిప్పిని బయటకు పంపటానికి సిద్ధం చేసేది ప్రాణం. ఈ పనికి రాని పిప్పిని బయటకు త్రోసి వేసేది అపానం... ఈ రెండు చర్యల ద్వారా మనకు కావలసిన శక్తి వస్తుంది. దానితో పనులు చేసుకోగలుగుతాం. మళ్ళీ శక్తి కోసం తినగలుగుతాం. ఈ నిరంతర ప్రక్రియతో ప్రాణ అపానములనే శక్తులను పరమాత్మ వినియోగిస్తున్నాడు. ఈ సహాయాన్ని పరమాత్మ చేయకపోతే మళ్ళీ మళ్ళీ తినలేం. శక్తిని పొందలేం.. 
 
నిజంగా ఇక్కడ ప్రాణ అపానాలను రెండింటినే చెప్పినా ఇంకా 3 రూపాలలో...
 
వ్యాన,  ఉదాన,  సమాన
..అనే రూపాలలో పరమాత్మ మనకు నిరంతరం సాయం చేస్తూనే ఉన్నాడు. 
 
3.1. వ్యాన...
అంటే జీర్ణమైన ఆహారంలోని సారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు చేర్చేది. ఈ సారాన్ని రక్తంలో కలిపి రక్తం ద్వారా సరఫరా చేస్తుంది.
3.2 సమాన...
అంటే ఏ అవయవాలకు ఎంతెంత అవసరమో అంత అన్నసారాన్ని ఆయా అవయవాలకు సరఫరా చేసేది.
3.3. ఉదాన...
అంటే అన్ని శరీర భాగాలకు వార్తలు పంపటమే గాక శరీరాన్ని విడిచిన తర్వాత జీవుణ్ణి చేర్చవలసిన స్థానానికి చేర్చేది.
"జఠరాగ్ని అనేది బొడ్డు దగ్గర ఉండే కుంపటి. ఆ కుంపటిని ప్రజ్వలింపజేసే కొలిమి తిత్తులే ప్రాణ అపానాలు".
ఈ పనులన్నింటిని పరమాత్మ ఎక్కడ ఉండి నిర్వహిస్తున్నాడు..? 
నిజంగా పరమాత్మ అడ్రస్ లేనివాడు. అన్ని అడ్రస్ లు ఆయనవే. ఎక్కడో ఒకచోట ఉండే వాడికే అడ్రసులు.. అంతటా ఉండేవానికి అడ్రస్ ఎందుకు..?
 "ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు" అన్న ప్రహ్లాదుని పలుకు ఇదే...
 
4. ప్రాణినాందేహం ఆశ్రితః...
ఈ పనులన్నీ చేయటానికి అన్ని ప్రాణుల యొక్క దేహాలను ఆశ్రయించుకొని పరమాత్మ లోపలే ఉన్నాడు. కనుక పరమాత్మను ఎక్కడా వెతక నక్కర లేదు.. బస్సులలో, రైళ్ళలో, విమానాలలో ప్రయాణించాల్సిన పని లేదు. ఈ 5 అడుగుల దేహంలోనే వెతికి తెలుసుకోవచ్చు.. అయితే బయటకు చూడకుండా లోపలకే చూడాలి.. అంతర్ముఖులు కావాలి..
 
ఈ ప్రకారంగా పరమాత్మే సూర్యచంద్రుల రూపంలో ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆయనే జఠరాగ్ని రూపంలో తిన్న అన్నాన్ని అరిగిస్తున్నాడు. ఆయనే దేహంలోని అన్ని భాగాలకు పంపిస్తున్నాడు. ఇంతటి ఉపకారం చేసే పరమాత్మకు మనం చూపే కృతజ్ఞత ఏమిటి..? అదే #నివేదన. ఆయన ఇచ్చిన దాన్ని ఆయనకే సమర్పించి భుజించాలి.. అలా నివేదించకుండా, సమర్పించకుండా, అనుమతి తీసుకోకుండా తింటే దొంగలు అవుతాం.. కనుక జాగ్రత్త తీసుకోవాలి.
ఆహారాన్ని ఇస్తున్నదీ ఆయనే., తయారు కావటానికి అగ్ని రూపంలో సాయం చేస్తున్నదీ ఆయనే, తిన్న అన్నాన్ని అరిగించి అన్ని అవయవాలకు సరఫరా చేస్తున్నదీ ఆయనే. కనుక అన్నం ముద్ద నోట్లోకి పోయే ముందు పరమాత్మ జ్ఞాపకానికి రావాలి.. కృతజ్ఞత తెలుపాలి.. అంతే కాదు. పట్టెడన్నం అతిధికి పెట్టినప్పుడు ఆ అతిధిని భగవంతునిగా భావించాలి. ఒక కుక్కకు పిడికెడు అన్నం పెడితే అక్కడ జఠరాగ్ని రూపంలో ఆరగించి అరిగించే వాడు పరమాత్మనే అనే భావన చేయాలి.
 
దీనివల్ల ఏమిటి ఫలితం...
 
అన్నం ఆరగించే వానిలోను, పచనం చేసే జఠరాగ్ని లోను, వెలుపల ఉండే సూర్య చంద్రుల లోను, క్రింద ఆధారంగా ఉండే భూమి లోను, సస్యాల లోను, ప్రాణికోట్ల లోను, సర్వేసర్వత్రా, అంతటా, అన్నింటా, అన్ని వేళలా బ్రహ్మ బుద్ధి.. ఈశ్వరుడి భావన చేయగా.. చేయగా.. మన పరిమిత వ్యక్తిత్వం (జీవభావం) కరిగిపోయి నీవు, నేనూ, అతడు, ఆమె, అదీ, అన్నీ.. సర్వమూ బ్రహ్మమే.. ఈశ్వరుడే అనే స్థిర భావన...
 
ఓం నమఃశివాయ... హరహర మహాదేవ...
 
- పాత మహేష్
 
 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba