Online Puja Services

పట్టుదల, దీక్ష తో ఏదైనా సాధించవచ్చు

3.145.57.5
చాలా కాలం క్రిందట ఒక గురువు ఆశ్రమంలో విద్య నభ్యసించడానికి ఒక విద్యార్థి వచ్చాడు. ఆశ్రమంలో విద్యార్థులందరూ తమ గురువు చెప్పిన విషయాలను ఆకళింపు చేసుకోవడంలో చురుగ్గా ఉండే వారు. కానీ ఈ కొత్తగా వచ్చిన విద్యార్థి మాత్రం వాళ్ళను అనుసరించ లేక పోతున్నాడు. వాళ్ళతో సమానంగా రాణించలేక అసహాయుడౌతున్నాడు. గురువు గారు ఇదంతా గమనిస్తున్నారు.
 
ఒకరోజు ఆయన ఆ శిష్యుణ్ణి పిలిచి హస్త సాముద్రికాన్ని పరిశీలించదలచి చేయి చాపమన్నాడు. కొద్ది సేపు పరిశీలించిన మీదట శిష్యునితో “శిష్యా! నీ జాతక రీత్యా నీకు విద్యా యోగం లేదు. అంత వెతికినా నీ అరచేతిలో విద్యకు సంబంధించిన దాఖలాలు కనిపించడం లేదు కదా!” అన్నాడు. అప్పటికే నిస్పృహలో ఉన్న ఆ శిష్యుడు ఇంకా క్రుంగిపోయాడు. “నాయనా! నీవిక మీ ఇంటికి వెళ్ళి నీకు తగిన వృత్తిని అవలంభించడం ఉత్తమం” అన్నాడు గురువు.
 
బరువెక్కిన హృదయంతో ఇంటి బాట పట్టాడు శిష్యుడు. దారిలో మది నిండా ఆలోచనలే. కలత చెందిన మనసులో ములుకుల్లా బాధించే ఆలోచనలు తప్ప ఏముంటాయి? ఓ పక్క తల్లిదండ్రులు ఏమంటారోననే బాధ. మరో పక్క స్నేహితులు గేలి చేస్తారనే శంక. ఇరుగు పొరుగువారు తన్ని తక్కువగా చూస్తారేమేననే సందేహం. ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ ముందుకు సాగిపోతున్నాడు. 
 
కొద్ది దూరం వెళ్ళాక దాహంగా అనిపించింది. చుట్టూ చూశాడు. ఒక గ్రామం సమీపంలో చేద బావి కనిపించింది. గ్రామస్తులు అందులోనుంచి ఒక రాతి గిలక సాయంతో నీటిని తోడుకుంటున్నారు. ఆ బావిలోని నీటితో దాహం తీర్చుకుని పక్కనే ఉన్న చెట్టు నీడన సేద తీర్చుకుందామని కూర్చున్నాడు. బావి వైపే చూస్తున్నాడు. తాడుతో ఒరిపిడి చెందడం వలన రాతి గిలక అరిగిపోయి ఉంది. శిష్యుడి మదిలో ఒక ఆలోచన మెదిలింది.
 
చేదగా చేదగా బలహీనమైన తాడు వల్ల ఒక రాయే అరిగిపోయింది. అలాంటిది సాధనతో నేను విద్యనార్జించలేనా? నా విద్య పూర్తి చేసుకోకుండా ఇంటికి తిరిగి వెళ్ళను..అని దృఢ నిశ్చయంతో ఆశ్రమానికి తిరుగుముఖం పట్టాడు. తిరిగి వచ్చిన శిష్యుణ్ణి చూసి గురువుగారు ఆశ్చర్యపోయారు. గురువు గారికి మళ్ళీ తన అరచేయి చూపించి “గురువు గారూ! మీరన్న విద్యా రేఖ ఇక్కడ ఎక్కడ ఉంటుందీ నాకు చూపించండి” అన్నాడు. తన వేలితో గుర్తులు చూపించాడు. ఇప్పుడే బయటకు వస్తానంటూ బయటకు వెళ్లాడా శిష్యుడు. దగ్గర్లో ఉన్న ఒక పదునైన రాయిని తీసుకుని గురువు గుర్తును చూపించిన చోట గీత లాగా కోసుకున్నాడు. తిరిగి గురువు దగ్గరికి వచ్చాడు. 
 
” గురువు గారూ! నాక్కూడా విద్యా రేఖ ఉంది. నేను ఇంటికి వెళ్ళదలుచుకోలేదు. దయచేసి మిగతవాళ్ళతో పాటూ నాకు విద్యను బోధించండి” అని ప్రాధేయపడ్డాడు. గురువుగారికి నోట మాట రాలేదు. శిష్యుడికి విద్య పట్ల గల ఆసక్తి చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. అతని పట్టుదలకు ముగ్దుడయ్యాడు. అతనికి కూడా విద్యనేర్పడం ప్రారంభించాడు.
 
అనతి కాలంలోనే ఆ విద్యార్థి మిగతా వారందరినీ మించిపోయాడు. పెద్దయ్యాక, ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన భాషగా భావిస్తున్న సంస్కృతానికి వ్యాకరణం రచించాడు. చరిత్రలో మిగిలిపోయాడు. ఆయన పేరు పాణిని.
 
పాణిని ప్రస్తుత పాకిస్తాను లోని పంజాబు ప్రాంతం వాడు. ఇతని కాలం పై భిన్నాభిప్రాయాలున్నాయి. కానీ చాలామంది అంగీకరించింది మాత్రం క్రీ.పూ.2,900 వ సంవత్సరం. ఆయన వ్యాకరణ శాస్త్ర వేత్త మాత్రమే కాదు, సమస్త ప్రాచీన వాజ్ఞయం, భూగోళం, ఆచార వ్యవహారాలూ, రాజకీయం, వాణిజ్యం, ఇతర లౌకిక విషయాలు అన్నీ ఆయనకు తెలిసినవి. పాణినీయంలో ఒక్క అక్షరం కూడా వ్యర్ధమైనది లేదు అని పతంజలి తన భాష్యంలో చెప్పాడు.
 
సంస్కృత భాష యొక్క వ్యాకరణాన్ని మొట్టమొదటి సారిగా గ్రంథస్థం చేసిన వ్యక్తి పాణిని. పాణిని రచించిన సంస్కృత వ్యాకరణ గ్రంథం ‘అష్టాధ్యాయి. ఇది ప్రపంచం లోనే ఆద్వితీయ వ్యాకరణంగా గుర్తింపు పొందింది. ఈయనకు పాణిన, దాక్షీ పుత్రా, శానంకి, శాలా తురీయ, ఆహిక, పాణి నేయ పణి పుత్ర అనే పేర్లు కూడా ఉన్నాయి. అష్టాధ్యాయి రాసిన వాడు అష్టనామాలతో విలసిల్లాడు. అష్టాధ్యాయి అనగా అష్టానాం అధ్యాయ్యానాం సమహారము అని అంటారు. ఆ గ్రంథమున ఎనిమిది (8) అధ్యాయములు ఉన్నాయి. దాదాపు నాలుగు వేల (4,000) సూత్రములు ఉన్నాయి.
 
ఈయన ముఖ్యశిష్యులలో కౌత్సుడు ఉన్నాడు. శిష్యులలో పూర్వ పాణీయులని, అపరపాణీయులని రెండు రకాలున్నారు. శిష్యుల శక్తి సామర్ధ్యాలను బట్టి వ్యాకరణాన్ని పాఠ భేదాలను ప్రవేశ పెట్టి బోధించాడు.  పాణినీయంలో మూడు రకాల పతక భేదాలున్నాయి. ధాతు పాఠం, గుణ పాఠం ఉపాది పాఠంలో ఇవి బాగా కనిపిస్తాయి. పాణిని వ్యాకరణానికి కూడా అష్టాధ్యాయి, అష్టకం, శబ్దాను శాసనం, వృత్తి సూత్రం, అష్టికా అని అయిదు పేర్లున్నాయి. వీటిలో అష్టాధ్యాయి పేరే ప్రసిద్ధమైంది.పాణిని అష్టాధ్యాయి 19వ శతాబ్దంలో యూరోప్ భాషా శాస్త్రవేత్తలను విశేషంగా ప్రభావితం చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ భాషల వ్యాకరణ అభివృధ్ధిలో పాణిని భాషా నిర్మాణ సూత్రాలు ఉపయోగించబడ్డాయి.ఆయన ప్రతిభను పాశ్చాత్య యాత్రికులు చాలామంది ప్రశంసించారు.
 
శబ్ద ఉచ్ఛారణ కోసం సూత్రాలతో ఒక శిక్షా గ్రంథాన్నీ రాశాడు. ఇది కాల గర్భంలో కలిసి పొతే స్వామి దయానంద సరస్వతి మొదలైన వారు ప్రాచీన గ్రంథాలను ఆధారంగా చేసుకొని పునరుద్ధరించారు. ఇందులో ఎనిమిది ప్రకరణలున్నాయి. పాణిని జాంబవతీ పరిణయం అనే మహా కావ్యాన్ని కూడా రాశాడు. ద్విరూప కోశం అనే చిన్న పుస్తకం, పూర్వ పాణినీయం పేరుతో 24 సూత్రాల గ్రంథమూ రాశాడు. అష్టాధ్యాయిలో శివ సూత్రాలలో ధ్వనుల పుట్టుక ఉచ్చారణ విధానం సూత్రబద్ధం చేశాడు. ధాతు పాఠంలో క్రియల మూలాల గురించి వివరించాడు.
 
ఒక సింహం ఇతని మీదికి దూకి చంపేసింది అని కథనం. ఏ సంవత్సరం ఏ నెల ఏ పక్షంలో మరణించాడో తెలీదు కానీ మరణించిన తిథి మాత్రం త్రయోదశి. అందుకే అది పాణినీయ అనధ్యాపక దినంగా తర తరాలుగా వస్తోంది. అంటే త్రయోదశి నాడు గురువు శిష్యుడికి పాఠం చెప్పడు.
 
భారత ప్రభుత్వం 2004 వ సంవత్సరంలో పాణిని గౌరవార్ధం ఒక పోస్టల్ స్టాంపుని విడుదల చేసింది. కాశీలో పాణిని జన్మ స్థలం నుండి తెచ్చిన మట్టితో కట్టిన పాణిని దేవాలయం ఉంది.
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore