పునర్వసు, పుష్యమి కార్తెలు ఎలా ఉంటాయి ?
పునర్వసు, పుష్యమి కార్తెలు ఎలా ఉంటాయి ?
సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేశిస్తాడో ఆ నక్షత్రమాధారంగా నక్షత్రం యొక్క పేరుతో కార్తె పేరు పిలువబడుతుంది. అశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో సూర్యభగవానుడు ప్రవేశం ఆధారంగా కార్తెను నిర్ణయించడం జరుగుతుంది.
భారతీయ జ్యోతిష సాంప్రదాయ ప్రకారం ఒక్కో కార్తెలో దానికి సంబంధించి ప్రకృతిలోని మార్పు , దాని వలన జరిగే ప్రత్యేకాంశాలను సవివరంగా వివరించింది. ఈ కార్తెల ఆధారంగా వ్యవసాయ దారులు , జానపదులు ( గ్రామీణ ప్రాంతం వారు) ఎక్కువగా వీటిపై ఆధారపడతారు. చేయువృత్తులు , వ్యవసాయం సాగు ఈ కాలగణనతో కార్తెల అధారంగా వారి పంటల నిర్ణయం చేయడం , వ్యవసాయ సాగు చేసుకుంటారు. పునర్వసు , పుష్యమి కార్తెలలో ఎలాంటి ప్రభావాలుఉంటాయి.
పునర్వసు కార్తె
సూర్యుడు పునర్వసు నక్షత్రంలో ప్రవేశించిన నాటి నుండి పునర్వసు కార్తె ఏర్పడుతుంది. అదేవిదంగా పుష్యమి నక్షతంలో ప్రవేశిస్తాడు కాబట్టి పుష్యమి కార్తె ఏర్పడుతుంది. ఈ రెండు కార్తెలూ ఈ ఏడాది 2021 జూలై నెలలో ఏర్పడుతున్నాయి.
పంచాగం ప్రకారం ఆయా నక్షత్రాలలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి , వార , నక్షత్ర , యోగ , కరణాలు , శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా , వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.
పునర్వసు కార్తె ఫలము
జ్యేష్ఠ బహుళ ద్వాదశి మంగళవారము జులై 5 న సూర్యుడు నిరయన పునర్వసు కార్తె ప్రవేశం చేస్తున్నాడు. ఈ కార్తెలో వాతావరణములో మార్పులు చోటు చేసుకుంటాయి. అచ్చటచ్చట ఖండ వృష్టి , మేఘగర్జనలు , చిరు జల్లులు , తీరప్రాంతములో వాయు చలనము , వర్షాభావ పరిస్థితి కొనసాగవచ్చును.
పుష్యమీ కార్తె
ఆషాఢ శుక్ల ఏకాదశి జూలై 20 వతేదీ అంటే మంగళవారం రోజున రవి నిరయన పుష్యమీ కార్తె ప్రవేశము చేస్తున్నాడు. ఈ కార్తె ప్రభావంతో బాగా వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా పొడి పొడి వాతావరణం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మేఘ గర్జనలు , సల్ప తుషార వృష్టి , తీర ప్రాంతములలో వాయు చలనములు , తుఫాన్ , వాయు గుండం ఏర్పడే అవకాశాలున్నాయి మెండుగా ఉంటాయి.
ఈ కార్తెలలో చేసే వ్యవసాయ పనులు గురించి తెలుసుకుందాం...
రైతులు తొలకరి అదునుగా పొలాలను చదును చేసుకుని వ్యవసాయానికి సిద్ధంగా ఉంటారు. తర్వాత కార్తెల ఆధారంగా ఆయా వ్యవసాయ పనులు చేపడతారు. సాంప్రదాయ బద్ధంగా కార్తెల ఆధారంగా చేయదగిన పనుల వివరాలు ఇలా ఉన్నాయి.
పునర్వసు కార్తె
వరి : సార్వా లేక అబి వరినాట్లు , ముందుగా నాటిన వరిలో అంతరకృషి , సస్యరక్షణ.
సజ్జ : రసాయనిక ఎరువులు వేసి పునాస లేక ఖరీఫ్ పైరు విత్తుట.
వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ.
ఆముదం : రసాయనిక ఎరువులు వేసి విత్తుట.
మిరప : నారుమళ్లలో విత్తులు జల్లుట.
పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో నాట్లకు భూమిని తయారు చేయుట , ఎరువులు వేయుట , గోదావరి ప్రాంతంలో పైరులో కలుపు తీయుట , గొప్పు త్రవ్వుట , (త్రవ్వటం).
పూలు : చేమంతి నారు పోయుట , గులాబి , మల్లె కనకాంబరం చెట్లకు ఎరువులు వేయుట. సస్యరక్షణ.
జొన్న : పునాస లేక ఖరీఫ్ జొన్న విత్తుట. విత్తిన పంటకు ఎరువులు వేయుట. సస్యరక్షణ.
మొక్కజొన్న : అంతరకృషి , సస్యరక్షణ. నెలాఖరులో ఎరువులు వేయుట.
పసుపు : దుగ్గిరాల ప్రాంతంలో పసుపు నాట్లు.
చెరకు : సస్యరక్షణ, ఎరువులు వేయుట.
పండ్లు : మామిడి, నిమ్మ, నారింజ , అరటి , సపోటాలకు ఎరువులు వేయుట , ద్రాక్ష తీగలను పారించుట , మందులు చల్లుట. జామ , సపోటాలకు అంట్లు కట్టుట. దానిమ్మ , రేగు , అనాస నాట్లు వేయుట.
కొర్ర : ఎరువులు వేయుట , దుక్కి తయారు చేయుట.
వేరుశనగ : అంతరకృషి, సస్యరక్షణ.
ఆముదం : కలుపు తీయుట , సస్య రక్షణ.
మిరప : నారుమళ్ళలో సస్యరక్షణ.
కూరగాయలు : చేమ , వంగనాట్లు.
సువాసన మొక్కలు : కామంచి గడ్డి , నిమ్మగడ్డి మొక్కల నాట్లు.
పుష్యమి కార్తె
వరి : సస్యరక్షణ , రసాయనిక ఎరువులు వేయుట.
జొన్న : అంతరకృషి, మొక్కలు పలుచన చేయుట , సస్యరక్షణ.
మొక్కజొన్న : అంతరకృషి, సస్యరక్షణ.
కొర్ర : విత్తనం వేయుట.
మిరప : నాట్లకు భూమి తయారు చేయుట.
పొగాకు : నారుమళ్లు తయారు చేయుట.
పండ్లు : తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో నిమ్మ జాతి మొక్కలు నాటుట. దానిమ్మ , రేగు , అనాస నాట్లు.
వనమహోత్సవం : చెట్లనాట్లకు తయారీ , పొలాల గట్లపై చెట్లనాట్లకు తయారి.
పశువులు : దొమ్మ , పారుడు , గురక , గాలికుంటు మరియు యితర వ్యాధుల నుండి కాపాడుటకు చర్యలు.
- సేకరణ