సరియైన మార్గం
మనం సరియైన మార్గంలో చూపుని స్థిరంగా నిలపగలిగితే ఎవరూ మనల్ని వెనుతిప్పలేరు.
దివ్యత్వానికి వేరుగా మనం ఉనికిని కలిగి మనలేం. ఎటువంటి సందేహాలు, వ్యాపార ధోరణి అవలంబించకుండా మనలను మనం భగవంతుని చేతిలో ఉపకరణాలమని భావించగలిగితే మన జీవితాలకి ఒక విలువ ఏర్పడుతుంది.
దాని వలన మనలో స్వార్థం, సంకుచితత్వం చోటు చేసుకోలేవు. కారణం మనకు వాటికి గల పరిమిత పరిధిని గురించిన అవగాహన ఏర్పడుతుంది.
భగవత్సంకల్పంలో మనకు భాగస్వామ్యం ఉందనే భావనతో ప్రశాంతత మనలో చోటు చేసుకుంటుంది. ఈ యథార్థాన్ని ధ్యానిస్తూ పోతే అది మన హృదయాన్ని నమ్రతతో నింపుతుంది.....
మహాత్ములలో అహంకారం, కలహ స్వభావం వంటివి ఎన్నడూ చోటు చేసుకోవు.
పల్లంగా ఉన్న నేలలో నీరు నిలిచి భూమిని సారవంతం గావిస్తుంది. అదే విధంగా భగవంతుడు వినయంతో కూడి ఉన్న జీవనాన్ని ఫలభరితం గావిస్తాడు.
అహంభావం కలిగి ఉండటం, ఆత్మన్యూనతను కలిగి ఉండటం వంటి స్వభావాలు ఏమాత్రం ప్రయోజనాన్ని కలిగించవు.
ఆత్మ న్యూనత వినయం కాలేదు. అది నిరాశా నిస్పృహలకు దారి తీసి మన నిజ స్వభావాన్ని మరుగున ఉంచేందుకు ప్రయత్నిస్తుంది. మనలోని ఉన్నత విలువలను చెల్లాచెదురు గావిస్తుంది.
కనుక వాటిని దరిచేరనివ్వకుండా జాగ్రత్త వహించాలి.................