Online Puja Services

పరమాత్మకు నైవేద్యం పెడితే తినేస్తాడా?

18.189.143.1

‘శుభోదయం  

 " కృష్ణం వందే జగద్గురుం"

సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మ ద్వారా వ్యక్తమైన  శ్రీ మద్ భగవద్ గీతలు ఇహమునకు, పరమునకు అత్యంత ఉపయుక్తమైనవి, 
గీతాచార్యుని ఉపదేశములు అమృతోపమానములు.  

ఈ జీవామృతాన్ని మనసారా గ్రోలుదాం !  అందరికీ పంచుదాం !!!
=======================

తృతీయోధ్యాయము  : 3వ అధ్యాయము: కర్మ యోగము  

12 వ శ్లోకమునకు అనుబంధము:: 

పూజంతా చేసి, కొబ్బరి కాయ కొట్టి  పరమాత్మకు  నైవేద్యం పెడితే తినేస్తాడా? రెండు చిప్పలు మనింట్లోనే ఉంటాయి, మనమే అనుభవిస్తాము కదా ! ఆయన ప్రత్యేకంగా ఏ పంచ భక్ష్య పరమాన్నాలూ  తెచ్చి పెట్టమనరు ఎన్నడూ:  మనము  తినేది ఆయన ప్రసాదమనీ,   మనము అనుభవించే సుఖాలు ఆయన అనుగ్రహమేననీ,  మనసు లో స్మరించుకుని తినాలి అనుభవించాలి. 

"ప్రమోషన్ వచ్చింది, మంచి పోస్టింగ్ వచ్చింది, పిల్లలు వృద్ధిలోకొచ్చారు. మహాత్మా ఇది నీ ప్రసాదము" అని ఒక్కసారి చేతులు జోడిస్తే ఆయనకొచ్చేదేమీ లేదు, మనకు పోయేదీ లేదు.  మనము తెలుపుకునే కృతజ్ఞత మాత్రమే. ఈ భావన  లేకుంటే ఆ మానవుని  దొంగగా భావించవలసిందే అని నిర్ద్వంద్వముగా చెప్తున్నారు. 

మనము సాధించాము అనుకునే ప్రతి ఒక్క విజయము- ఈ ప్రకృతి లో సృష్టి చేయబడిన ఇంకో మనిషి ద్వారా గానీ, ఏదో ఒక వస్తువు ద్వారా గానీ, పంచ భూతములలోని ఏదో ఒక భూతము ద్వారా లభించినదే కదా. అమ్మ, నాన్న,  నేల, చెట్టు, కాలువ, చెరువు, పర్వతము, మేఘము, సూర్యుడు, చంద్రుడు,ఉద్యోగం, బాస్,   స్నేహితుడు, శత్రువు,--  ఇలా ఎందరో, ఎన్నెన్నో. 

ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే- భూమిలో పంటలు పండించాలి. ఆలోచిస్తే వీటిలో మనం సృష్టించింది ఏమన్నా ఉన్నదా?? - ఈ భూమి,   దున్నే నాగలి (కొయ్య, ఇనుప ఖనిజముతో చేసిందే ), నేలలో  పదును, సారము, విత్తనం లో మొలకెత్తగల గుణం- జీవం , నీరు , గాలి, ఎండ, --- లేదని  మనకు తెలుసు సమాధానం. .  

వీటిని  అనుభవించబోతున్న  క్షణంలో  పరమాత్మ గుర్తుకు వస్తే, మనస్సులో  కృతజ్ఞతా పూర్వక నమస్కారం చెయ్యగలిగితే, అదే దొంగ అనే ముద్ర పడకుండా పాపకూపములో పడకుండా తప్పించుకోగల మహామంత్రము.  

ఈ డబ్బు/ currency అనేది కొద్దీ శతాబ్దాల క్రితం కనుక్కున్నది మాత్రమే. కొన్ని సహస్రాబ్దాలుగా ఎవరి ధర్మమూ ప్రకారము వారు శ్రమ/ కర్మలు చేసి సమాజములో మిగిలిన వారికి వారి ఉత్పత్తిని అందించి, వారి వద్ద మిగిలిపోయిన వస్తువులను తెచ్చుకోవటం, ఇదే పురాతనంగా ఉన్న ఆనవాయితీ, సంప్రదాయము. 

ఇంతకు క్రితం శ్లోకము లో పరమాత్మ చర్చించిన పరస్పర సహకారం ఆ సంప్రదాయమే. (బార్టర్  అని ఎకనామిక్స్ లో చదివితే అది గొప్ప విషయంగా చెప్పుకుంటాము ) 

ఈ డబ్బు కనుక్కున్న రోజునుంచీ దాచుకోవటం, దురాశ,  అసూయ, క్రోధం, ద్వేషం పెరిగిపోయాయి. సుఖం తగ్గిపోయింది, భయం పెరిగిపోయింది.  
విహిత కర్మ లను చక్కగా ఆచరిస్తూ, ఈ ప్రకృతిలోని వనరులను వినియోగించినందుకు, ఆ కర్మల ద్వారా వచ్చిన సంపాదనలో  కొంత భాగమును ఎవరి నుండి తీసుకున్నామో వారికి (యజ్ఞములద్వారా), మరి కొంత  ప్రాణి కోటికి, అవసరమున్న వారికీ వితరణ చేస్తూ, పరమాత్మ యెడల కృతజ్ఞతాభావం తో ఉండాలని ఈ శ్లోక తాత్పర్యము. 

ధనవంతుడు ధనం  ఇవ్వచ్చు,  విద్యావంతుడు విద్యను, పండితుడు తన విజ్ఞానాన్ని, ఇలా ఎవరి శక్తికి తగిన వితరణ వారు చేస్తూ ఉండాలి. 
"సమర్పణ,  నివేదన - ఇది కృతజ్ఞత" -  సత్ఫలితాలనిస్తుంది. 

"ఇలా కాదు, ఇది నాకే, అదీ నాకే, అన్నీ నేనే .. ఈ భావన స్వార్థ బుద్ధి. ఇటువంటి  స్వార్థ బుద్ధులకు, దుష్ఫలితాలు తప్పవు,   శిక్ష కూడా తప్పదు" అని కూడా ఈ శ్లోకము యొక్క నిగూఢార్థము. 

- కిరణ్ కుమార్ నిడుమోలు 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore