Online Puja Services

అందరూ బిడ్డలే

3.145.196.150

అందరూ  బిడ్డలే 
    
      ఒక సారి ఒక సోదరుడు అమ్మ తో " అమ్మా! మేము నిన్ను దైవం అని నమ్ముతున్నాము. మా జీవనానికి జీవితానికి నీవే మూలం అనీ అనుకుంటున్నాము. అయినా మాకు నీ నుండి ఎన్నో దాపరికాలు. ఎన్నో రహస్యాలు. మా ఉద్యోగాలు వ్యాపారాలె మాకు సర్వస్వం.మా బ్రతుకే మాకు ముఖ్యం. కనీసం మా బ్యాంకు అకౌంట్లను మా కుటుంబానికే  గాని నీకు  సరెండర్ చేయలేక పోతున్నాము. వట్టి స్వార్ధజీవనులం." అన్నాడు. అమ్మ  "నాన్నా నువ్వు చాలా పొరబడుతున్నావు. నువ్వు బ్రతుకు తున్నది నా కోసమే. ఉద్యోగం చేస్తున్నది నా కోసమే. నువ్వు ఏంచేసినా నా కోసమే. అది నాకే చెందుతుంది. ఈ విషయం లో నువ్వు దిగులు పడకు. ఈ కనుపించేవన్నీ నా బిడ్డలే . నీ కుటుంబం కుడా నా బిడ్డలే.. నా బిడ్డ కాని ప్రాణి, వస్తువు.... ఏమీ లేదు. నువ్వుా నా బిడ్డవే . నీ కుటుంబ సభ్యులూ నా బిడ్డలే..ఈ సృష్టి లో ఏ ప్రాణికీ కాకుండా నీ  శక్తి, సేవలూ ఎక్కడకి పోతున్నాయి?.

 ఇందులో ఎవరికి చెందినా అది నా బిడ్డలకి చెంది నట్లే.అంటే నాకు చెందినట్లే. కనుక స్వార్ధం అన్న ప్రసక్తే లేదు. అంతా పరమార్థమే  కనుక చేసే ఏ పని అయినా నాకోసమే అని భావించి శ్రద్దగా ప్రేమగా చేయి" అని హితోపదేశం చేసి అతనిలో కొడిగట్టిన జీవితేచ్ఛను ఉజ్వలం చేసింది.

ఔను అమ్మ ప్రతి సందర్భంలో తన జగన్మాతృత్వాన్ని ప్రకటించింది.

నక్సలైట్లు బిడ్డలే 

     అమ్మ దగ్గర జరుగుతున్న నిరంతర అన్నదానాన్ని, వైభవేపేతంగా జరుగుతున్న మహోత్సవాలను, మరీ ముఖ్యంగా అమ్మ స్వర్ణోత్సవం నాడు లక్ష మంది ఒకే పంక్తి న భోజనం చేయటం చూసి నక్సలైట్లు జిల్లెళ్ళమూడి లో అపరిమిత ధనరాసులు మూలుగుతున్నాయని భ్రమపడి వాటిని దోచుకోవాలని సుదీర్ఘకాలం పధక రచనచేసి దినం 30-12_1975 అర్దరాత్రి జిల్లెళ్ళమూడి అందరింటి మీద దాడి చేశారు. కాని వారు ఆశించిన ధనరాసులు లభ్యం కాలేదు. అవి చేతుల్తో పట్టుకుని వెళ్ళే ధనరాసులు అయితేగా,అవి అమ్మ లోకానికి పంచిన మాతృత్వపు వాత్సల్య రాసులని వారు తెలుసుకునే సరికి వాళ్ళ దోపిడీ కాలపరిమితి ముగిసింది. ఎలా వచ్చారో అలాగే వెనుదిరిగారు. సరే యధావిధిగా పోలీసులు పరిశోధన చేసి ఆ నక్సలైట్ల నాయకులను నిర్భందించి గుర్తింపు కోసం జిల్లెళ్ళమూడి తీసుకుని వచ్చారు. అమ్మ ఎదుట నిలిపారు. అమ్మ సమక్షంలో వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ లభిస్సుందోనని ఆ నక్సలైట్ల నాయకులు భీతిచెందారు. కాని అమ్మ వాళ్ళను ఎంతో వాత్సల్యం గా చూసి ముందు వీరికి అన్నం పెట్టించండి. తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నది. ముందు పోలీసులు అందుకు సమ్మతించలేదు. కాని అమ్మ "జిల్లెళ్ళమూడి ఎవరైన ఆకలితో రావచ్చు. కాని ఎవరూ ఆకలితో వెళ్లకూడదు. వారి గుణగణాలతో పనిలేదు. అయినా వీరు మాత్రం ఎవరూ? వీళ్లు నా బిడ్డలే. కొంతమంది అడిగి తీసుకుంటారు. కొంతమంది అఘాయిత్యం చేసి తీసుకుంటారు. వీరు రెండో రకం." ఈ మాటలు విన్న తర్వాత నక్సలైట్లనాయకులతోపాటు పోలీసులు కూడా విస్తు పోయారు. ఆ నాయకులు కూడా తాము అపార్దం చేసుకున్నామని తెలుసుకుని అమ్మ సమక్షంలో ఆవిషయం విన్నవించుకున్నారు.
ఔను అమ్మకు నక్సలైట్లూ బిడ్డలే.

దేవుడూ బిడ్డే 

    అమ్మ ఒక సారి నెల్లూరు లోని శ్రీ రంగనాధస్వామి ఆలయానికి వెళ్ళింది. ఆలయం లోకి వెళుతుండగానే గర్భగుడిలో తల్పశాయి అయిన రంగనాధుడు అమ్మకు కనిపించాడు. ఆమ్మ ఇక, చకచకా గర్భగుడి ప్రవేశించింది. రంగనాధుని సమీపించింది. ఆ హృదయం లో వాత్సల్యం పొంగులువారటం ఆ ముఖంలో కన్నుల లో ద్యోతితమవుతుానే ఉన్నది. అమ్మ ఆ విగ్రహాన్ని ప్రేమగా నిమరటం ప్రారంభించింది. ఆది రాయిగా కఠినంగా తగలలేదేమో ఆ ప్రేమాన్విత స్పర్శ లో అమ్మ పులకించిపోవటం ప్రక్కనున్నవారికి విదితమవుతూనే ఉన్నది. అమ్మ హృదయోద్భూత ఆనంద తరంగాలు అందర్నీ సోకుతూనే ఉన్నాయి. అర్చక స్వామి పోసిన జలాన్ని అమ్మ ప్రేమ తో రంగనాధునిపై చిలకరించింది. భక్తితో తనను అలకరించిన సుమ మాలను తన మెడ నుండి తీసి అనురాగపూర్వకంగా రంగనాధునికి యిచ్చింది. అమ్మ మామూలుగా ఏ బిడ్డ యింటికి వెళ్లినప్పడు ప్రేమ ను ఎట్లా అభివ్యక్తం చేస్తుందో, ఆ దేవాలయం లోను అలాగే చేసింది. అమ్మ దృష్టిలో లో నరుడూ నారాయణుడు ఒక్కటే.బిడ్డలూ దేవుళ్లే .
దేవుడూ బిడ్డే .

వరదకూడా బిడ్డే

      1969 మే 19వతేది ఉదయం. అప్పుడే తెల్లవారుతుంది. వరద వెల్లువ రావడమే మత్తగజం వలే మహోధృతంగాను, కోడెత్రాచు వలె బుసలు కక్కుతూనూ వస్తున్నది. జనత భయవిహ్వలమై పోయింది అందరు ఇళ్ళు ఖాళీ చేస్తున్నారు. 

అమ్మ గదిలో నుండి బయటకు వచ్చింది. మేడ మీద నుండే నాలుగు దిక్కు ల కలయచూసింది. అమ్మ పెదవులపైనా, కనుగొలకుల్లోనూ దరహాసదీపులు భాసించాయి. ఎవరికీ ఏమి అర్దంకాలేదు. రోగిని చావుబ్రతుకుల మధ్య ఆపరేషన్ బల్లపై పడుకోబెట్టి డాక్టర్ పకపకానవ్వుతున్నట్లుగా ఉన్నది ఆ సన్నివేశం. 

వెంటనే చీర, రవిక, పసుపు కుంకుమలూ, కొబ్బరి చిప్పలు గంగాభవానికి యిస్తూ_ఆడపిల్లను ఊరికే పంపటమెందుకూ! అని అమ్మ అందరివంకచూసింది. 

వరదాయనికి వరద కూడా బిడ్డే

పత్రిక కూడా బిడ్డే

 మాతృశ్రీ పత్రిక ప్రారంభోత్సవ సమయంలో నిర్వాహకులు ఎన్నిసార్లు పత్రిక అన్నా   అమ్మ,"పుత్రిక "అని సరిచేసింది.జడం, చైతన్యం అని భేదం లేకుండా సమస్త సృష్టిని తన బిడ్డగానే భావించింది. 

మరొక సందర్భంలో  సోదరులు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి గారు, వీరమాచినేని ప్రసాదరావు గారు అమ్మ సమక్షంలో అమ్మ డైరీ లు ప్రక్కన పెట్టుకొని అమ్మ వాక్యాలు సమీక్షించారు. ఆ సందర్భంగా కొన్ని అమ్మ వాక్యాలను అమ్మ దృష్టి కి తెచ్చి అమ్మా! ఈ  వాక్యాలు నీ ప్రతిష్టకు భంగకరంగా ఉన్నాయి, వీటిని తీసి వేద్దాము అని విన్నవించారట. అమ్మ వెంటనే "నాన్న ఒక తల్లికి నలుగురు సంతానం ఉన్నారనుకో. వారిలో ఒకరు అప్రదిష్టకరంగా ఉన్నాడని, వాడిని తన సంతానం కాదని అనుకుంటుందా? " అని ప్రశ్నించింది. అమ్మ సర్వ మాతృత్వానికి విస్తుపోవటం వారి వంతు అయింది.
జయహొమాత .

గడ్డ కూడా బిడ్డే

అమ్మ బిడ్డలందరి రోగాలు తాను తీసుకున్నందు వలననేమో తరుచూ రోగాల బారిన పడింది. కాలానికి తగ్గట్టుగా అన్నట్లు మధుమేహం తో అమ్మ
బాధ పడేది. అందువలన అమ్మకు తరుచూ శరీరంపై గడ్డలు వచ్చేవి. అలా ఒకసారి పెద్ద గడ్డ వచ్చింది. ఆపరేషన్తో తొలగించాల్సన పరిస్థితి. హాస్పిటల్ కు వెళ్ళలేని పరిస్థితి. కనుక వైద్యులు సాహసించి అమ్మ మద్దతు తో స్టెరిలైజ్ చేసిన బ్లేడు తో ఆ గడ్డ తొలగించారు. అందరు ఊపిరి పీల్చుకున్నారు. కాని అమ్మ దిగులు గా కనిపించింది. "ఆమ్మా ఇంకా బాధగా ఉందా?" అని రామకృష్ణ అన్నయ్య ప్రశ్నించాడు ". ఆమ్మ అదేం లేదురా.
కాని అది దూరం అయింది కదరా " అన్నది. ఏదో వారికెవరికి స్పురించలేదు. ప్రశ్నార్థకంగా అమ్మ వంక చూశారు. అమ్మ "అదేరా ఆ గడ్డ!" అన్నది. ఆ సమాధానికి ఆ సర్వమాతృత్వానికి విస్తుపోయి తేరు కోవటానికి చాలా సేపు పట్టింది. ఔను మరి అమ్మకు గడ్డ కూడ బిడ్డే!

తనను బాధించే శరీరంపై గడ్డను కూడా బిడ్డ అనుకోవటం అమ్మ కే చెల్లింది.

నభూతో న భవిష్యతి
జయహోమాత

- కొండముది శ్యామల 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore