ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ
ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ
అది దేవి నవరాత్రుల సమయం. పరమాచార్య స్వామివారు కలకత్తాలో మకాం చేస్తున్నారు. స్వామివారి విడిదిలో చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఆమె తమిళనాడు నుండి వచ్చి కలకత్తలో స్థిరపడిన మామి. ఒక్కరోజు కూడా అమె వీటిని తప్పలేదు. ఆమె శ్రీ రబీంద్రనాథ్ ఠాగూర్ గారి ఆశ్రమానికి రోజూ వెళుతుండేది. తొమ్మిది రోజుల పాటు పరమాచార్య స్వామివారి కర్యక్రమాలు చూసి మరుసటిరోజు ఠాగూర్ ఆశ్రమానికి వెళ్ళింది.
మామూలుగా కలకత్తా వాసులు దేవి ఉపాసకులు. ఠాగూర్ గారు కూడా శ్రీవిద్యోపాసకులు అయినప్పటికి కొద్దిగా ఆధునిక భావాలు కలవారు. సాహిత్యంపై వారికున్న పట్టు జగమెరిగినది. మామి కొద్దిసేపటి తరువాత ఠాగూర్ గారిని కలిసింది. ఇన్నిరోజులూ కనపడలేదేమిటని ఆవిడని అడిగారు. ఆమె పరమాచార్య స్వామివారు వచ్చారని దేవి నవరాత్రుల సందర్భంగా నవావరణ పూజ, సుమంగళి పూజ, కన్యా పూజ జరిగాయి అని చెప్పింది.
పరమాచార్య స్వామివారు కూడా దేవి ఉపాసకులే అని ఠాగూర్ గారు అర్థం చేసుకున్నారు. వెంటనే మామిని, “స్వామిజి కన్యాపూజ బ్రాహ్మణ కన్యతో చేశారా? లేదా వేరే అమ్మాయితో చేశారా?” అని అడిగారు.
”లేదు! పెరియవ ఎప్పుడూ సాంప్రదాయాన్ని తప్పరు. కేవలం బ్రాహ్మణ కన్యతోనే కన్యాపూజ చేశారు” అని చెప్పింది మామి.
ప్రపంచ ప్రఖ్యాతి వహించిన సాహితీవేత్త, అందరిచేత గౌరవింపబడే ఆధునికవేత్త అయిన ఠాగూర్, శ్రీ లలితా సహస్రనామం నుండి ‘ఆబ్రహ్మకీటజననీ’ అనే నామాన్ని పలికి మామితో ఇలా అన్నారు. “ఆయన గొప్ప దేవి ఉపాసకులు; మరి ఈ నామానికి అర్థం తెలియదా వారికి? చిన్న పురుగు నుండి బ్రహ్మ వరకు ఆ అమ్మవారే తల్లి జగన్మాత. మరి కన్యాపూజకు బ్రాహ్మణ కన్యే ఎందుకు?”
ఠాగూర్ లాంటి వారు పరమాచార్య స్వామివారి గురించి అలా అనడం మామికి కొంచం మనస్థాపం కలిగించింది. ఆమె దీన వదనంతో పరమాచార్య స్వామి వద్దకు వచ్చింది. “నిన్న పూజకు రాలేదేమి?” అని మహాస్వామివారు అడిగారు.
”లేదు నేను ఠాగూర్ గారిని కలవడానికి వెళ్ళాను” అని చెప్పి అక్కడ జరిగిన విషయం చెప్పలా వద్దా అని అలోచిస్తోంది.
మహాస్వామివారు అర్థం చేసుకుని మామితో, “వారు నాగురించి ఏమి చెప్పలేదా?” అని అడిగారు. ఇక ఆపుకోలేక కళ్ళ నీరు పెట్టుకుంటూ మొత్తం జరిగిన విషయం అంతా స్వామికి తెలిపింది.
పరమాచార్య స్వామివారు నవ్వుతూ, “ఇంకా మూడు పదాలు ఉన్నాయి. ఆ శ్లోకం చదివేటప్పుడు అవికూడా కలుపుకోమను” అని చెప్పారు.
ఇప్పుడు మామికి ఉత్సాహం కలిగింది. స్వామివారి సమాధానంలో ఎదో విషయం ఉందని గ్రహించి అది ఏంటని అడిగింది. ముందు వెళ్ళి చెప్పు తరువాత చూద్దాం అన్నారు స్వామివారు.
ఇక చేసేది లేక వెంటనే మామి ఠాగూర్ దగ్గరకు వెళ్ళి స్వామివారు చెప్పిన విషయం చెప్పింది. ఠాగూర్ గారు గుర్తుతెచ్చుకున్నారు “ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ - నిజాజ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా”. పదే పదే మనసులో మననం చేసుకుంటున్నారు. “అహా! అహా! దేవి సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసింది ఇలాగన్నమాట. నాకు తెలియదు ఇప్పటిదాకా! వారు సమాధానమిచ్చారు. స్వామివారు నా ప్రశ్నకు సమాధానమిచ్చారు” అని ఉత్సాహపడుతూ వెంటనే అపరాధ భావనతో “స్వామివారు మహాత్ములు. నేను చెప్పినది వారితో చెప్పావా? అరే! తప్పు జరిగిపోయింది”.
వారు యోగ్యులైన సాహితీవేత్త. తరువాత ఏమి చెయ్యాలో వారికి తెలుసు.
“నేను తప్పకుండా వారిని దర్శించుకోవాలి. దయచేసి ఏర్పాటు చెయ్యండి. కాని అది బహిరంగంగా కాదు. ఎందుకంటే ప్రతి స్వామిజి నన్ను కలవమని ఒత్తిడి చేస్తారు. తప్పక వారిని దర్శించాలి” అని అన్నారు. మామి సంతోషంగా స్వామివద్దకు వచ్చింది. పరమాచార్య స్వామివారు ఒక శేఠ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఠాగూర్ గారు మహాస్వామిని దర్శించుకున్నారు బయట జనానికి తెలియకుండా.
ఠాగూర్ గారు వారి రోజువారీలో రాసుకున్నారు. “ఈ కాలంలో కూడా దర్శింపదగిన మహాత్ములు ఉన్నారు. వారిని దర్శించి నేర్చుకోవలసినది ఎంతో ఉంది” ఆ మహాత్ములెవరో చెప్పాల్సిన పనిలేదు. ఎందరో భక్తులు చెప్పారు. కొంతమంది దర్శించుకున్నారు. సాక్షాత్ దేవి అవతారమైన మహాస్వామివారి నుండి వినడం ఠాగూర్ గారి ఉపాసనా ఫలితం కావచ్చు లేదా పెరియవ కారుణ్యం వల్ల కావచ్చు.
[శ్లోకార్థం: చిన్న పురుగు మొదలుకుని బ్రహ్మండంలోని పిపీలికాది పర్యంతం వరకు అందరికీ అమ్మవారే తల్లి. అలాగే వర్ణము, ఆశ్రమము అనే పద్ధతిని విధివిధానాలను ఏర్పాటు చేసిన తల్లి కూడా ఆమెయే.
కర్మ అంటూ ఎక్కడ ఉంటుందో అక్కడ వర్ణాశ్రమాలు తప్పకుండా ఉంటాయి. మానవుడు బాగుపడడానికి భగవానుడు ఏర్పరచిన వ్యవస్థ వర్ణాశ్రమ వ్యవస్థ. వర్ణవ్యవస్థ సైంటిఫిక్ వ్యవస్థ. ప్రతివర్ణమూ భగవంతుడు తరించడానికి ఇచ్చిన ఒకానొక మార్గము. ఉపాధిగతంగా అసమానత్వమే. చైతన్యగతంగా సమత్వం. ఎక్కువతక్కువలు లేవు]
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం