విన్నపాలు వినవలె

విన్నపాలు వినవలె
పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతిఒక్కరూ దాదాపుగా పదే పదే తమ బాధలను స్వామివారితో చెప్పుకుని, “పెరియవ నాపై దయ చూపించాలి” అని వేడుకునేవారే. స్వామివారి దర్శనానికి వచ్చి కేవలం స్వామిని దర్శించుకుని ఏమి కోరకుడా వెళ్ళిపోయేవారు చాలా చాలా అరుదు.
తెల్లవాఝామున విశ్వరూపదర్శనంతో మొదలుకొని కొన్ని గంటలు పాటు సముద్రపు అలలవలె భక్తులు స్వామివారికి తమ కష్టాలని పదే పదే చెబుతూ, పదే పదే వాటిని విన్నవిస్తూ ఉంటారు. స్వామివారి ముందుకొచ్చిన ప్రతిసారి వాటిని విన్నవిస్తూనే ఉంటారు. పరమాచార్య స్వామివారు వాటిని శ్రద్ధగా విని వారిని ఆశీర్వదిస్తూ అభయం ఇస్తున్నట్టుగా చెయ్యెత్తి వారిని కరుణిస్తుంటారు. స్వామివారిని ఆ భంగిమలో చూడడమే ఆ భక్తులకి రక్షణ హామీ ఇచ్చినట్టు.
ఇటువంటి కరుణని సామాన్య పదాలతో ఎవరు చెప్పగలరు? ఎలా చెప్పగలరు?
కంచి శ్రీమఠానికి ఒకరోజొక ముసలావిడ వచ్చి మహాస్వామి వారితో తన కుటుంబం పడుతున్న కష్టాలను పదే పదే చెప్పుకుంది. ఆమె చెప్పిన దాన్ని స్వామివారికి చెప్పే పని చేస్తున్న శ్రీమఠం పరిచారకుడు సహనం నశించి బిగ్గరగా ఆమెని మందలిస్తున్నట్లుగా అరిచాడు.
”నీకు వేరే ఏమి పనిలేదా? ఎన్ని సార్లు పదే పదే చెప్పిన విషయాన్నే స్వామివారికి చెప్పమంటావు?” అని అదిలించాడు.
వెంటనే స్వామివారు కలగజేసుకుని, “ఏమిటి బాబు! ఏం జరిగింది? ఎవరది? ఎందుకు అలా అరుస్తున్నావు?” అని అడిగారు.
”ఇక్కడ ఒక ముసలామె పెరియవ. చెప్పిన విషయాన్నే పదే పదే చెబుతోంది. చెప్పాను అని చెప్పినా అర్థం చేసుకోవట్లేదు” అని కొంచం అసహనంతో అన్నాడు.
స్వామివారు అతనితో, ”ఏమంటోంది ఆవిడ? నాకేమి వినిపించలేదు. ఇంకోసారి చెప్పమని చెప్పు ఆవిడకి. ఆమె చెప్పిన తరువాత ఆ విషయం నాకు మరొక్కసారి చెప్పు” అని ఆజ్ఞాపించారు.
మహాస్వామివారి నోటివెంట ఈ మాటలను విన్న ఆ వృద్ధురాలి ఆనందానికి అవధులు లేవు.
--- సుజాత విజయరాఘవన్, ‘ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డివైన్’ పరమాచార్య అనుభవాల సంగ్రహం 1
#KanchiParamacharyaVaibhavam - #కంచిపరమాచార్యవైభవం