Online Puja Services

తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలా ?......

3.138.124.28

తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలా ?......

మన హిందూ ధర్మంలో తులసి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత, ప్రత్యేక స్థానం ఉన్నాయి. తులసి చెట్టుని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆధ్యాత్మికంగా తుల‌సి చెట్టు ఇంట్లో ఉంటే అంతా మంచే జ‌రుగుతుంద‌ని పెద్దల నమ్మకం. తులసి కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాదు, ఆరోగ్య పరం గాను అంతే ప్రత్యేకం.. తుల‌సి మొక్క ఔషధాల గని.. అనేక వ్యాధుల నివారణకు తులసి ఉపయోగ పడుతుంది. తులసి ఆకులతో పలు అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే.. కానీ.., ఈ తులసి మొక్క తన సహజ రంగును కోల్పోవడమో, ఆకులు సడన్‌ గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు... ఒక రకంగా తులసి చెట్టు మార్పులు మన భవిష్యత్తుకు సంకేతాలు...

నిత్యం నీళ్లు పోస్తూ చ‌క్క‌గా పెంచుతున్న తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా ఎండిపోవడం జరుగుతుంటుంది. అలా పచ్చగా కళకళ లాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే, ఆ ఇంటి య‌జ‌మానికి మ‌రి కొద్ది రోజుల్లో ఆరోగ్యం ప‌రంగా కీడు జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం బారిన ప‌డే అవ‌కాశం ఉంటుందని అర్థం..

తుల‌సి చెట్టును ఉంచిన కుండీలో దానంత‌ట అదే మ‌రో తుల‌సి మొక్క పుట్టుకు వ‌స్తే ఆ ఇంట్లో వారికి కెరీర్ ప‌రంగా మంచి జ‌రుగుతుంద‌ట‌.. అనుకున్న లక్ష్యాలు సాధిస్తార‌ట‌.. నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థం. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుంది...

తుల‌సి చెట్టు ఆకులు స‌డెన్‌గా వేరే ఏదైనా రంగుకు మారితే, ఆ ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థం. ఇంట్లో ఉన్న‌ వారిపై ఎవరో తాంత్రిక, క్షుద్ర శ‌క్తులు ప్రయోగించారని అర్థం. అలా ఎవరైనా గిట్టని వారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయ‌ట‌...

తుల‌సి చెట్టు ఏదైనా కార‌ణాల వ‌ల్ల ఎండిపోతే వెంట‌నే దానికి నీళ్లు పోసి మళ్లీ ప‌చ్చ‌గా ఎదిగే వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా పెంచాల‌ట‌. అలా చేయ‌క‌పోతే మంచి జరగదని మన పూర్వీకుల నమ్మకం. తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉన్న ఇంట్లో ఎల్ల‌ప్పుడూ సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయ‌ట‌. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావట. దీనిని బట్టి తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు., తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలో మార్పులు గమనిస్తూ ఉండాలి. ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క తప్పక వుండాలి. తులసి ఆరోగ్య దాయిని.., ఔషద గుణం కలిగినది..

తులసీ స్మరణ మాత్రము చేతనే సర్వ పాపములు నశించును. తులసి మాలని స్పర్శించినంత మాత్రము చేతనే సర్వ వ్యాధులు నశించును. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థ స్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. రోజూ నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం, ప్రదక్షిణలు చేయడం వల్ల సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూ మండలాన్ని, అందులోని తీర్థాలను, క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం...

తులసి మొక్కను నాటినా, నీరు పోసినా, తాకినా, పోషించినా మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. తులసి మొక్కతో హరిహరులను పూజిస్తే పునర్జన్మ ఉండదని చెబుతారు. సనాతన సంప్రదాయాల ప్రకారం ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తులసి ఆకులను తుంచరాదు. తులసి ఆకులను తూర్పు, ఉత్తర ముఖంగా నిల్చుని మాత్రమే కోయాలి. ద్వాదశి, అమావాస్య, పున్నమి తిథులలో తులసి ఆకులను తుంచరాదు. రాత్రి వేళల్లోనూ, స్నానం చేయకుండా గానీ, పాదరక్షలతో గానీ తులసి మొక్కను ముట్టుకోరాదు. తులసి ఆకులను ఒంటిగా తుంచరాదు. మూడు ఆకుల దళంతో కలిపే తుంచాలి...

తులసి మొక్క ఆకులు, కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటినీ వైద్య రంగంలో ఉపయోగిస్తారు. తులసి ఆకుల రసాన్ని జ్వరం, వాంతులు, విరేచనాలు, అతిసార, రక్తస్రావం తదితర వ్యాధులను తగ్గించడంలో వాడతారు. తులసి లోని శక్తిమంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు మన రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తాయి.. తులసి ఆకులను తీసుకోవడం ద్వారా లోపలి నుండి కళ్లె బయటపడేలా చేస్తుంది. యాంటీ మైక్రోబియల్ గుణాలు రోగ నిరోధక శక్తిని పటిష్ట పరుస్తాయి. 

అందుకే చాలా దగ్గు మందుల్లో తులసిని వాడుతుంటారు. తులసిని క్రమం తప్పకుండా తీసుకుంటే తలనొప్పి బాధలు మాయమై పోతాయి.. అంతేకాదు, తులసిని రోజూ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు సమర్థంగా పనిచేస్తాయి. తులసిలోని ఇమ్యునో మోడ్యులేటరి గుణాలు రోగ నిరోధక శక్తిని తిరిగి ఉద్దరించడంలో తోడ్పడతాయి. యాంటీ అలర్జిక్, యాంటీ ఇన్ల్ఫెమేటరి గుణాలు, అలర్జీ సంబంధిత అనారోగ్యాలను నయం చేస్తాయి.. శరీర వ్యవస్థను పటిష్ట పరుస్తాయి....

- పాత మహేష్

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore