కనుమ పండుగ ప్రాముఖ్యత
మనమందరం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాము అంటే వ్యవసాయం చేసినప్పుడు భూమాత మనలని అనుగ్రహించి పంటని ఇస్తోంది. ఆ పంట మనకి దక్కటానికి అసలు ఆ భూమి దున్నటంలో ఎంతో మనకి సహకరిస్తున్న జంతువు ఎద్దు. అందులో వేదంలో చెప్పబడినట్లుగా ఎద్దు యొక్క డెక్కల నుంచి జాలువారినటువంటి అమృతపుబిందువులు భూమిలో పడినటువంటి కారణం చేత ఆ భూమి నుంచి పైకి పెరిగినటువంటి సశ్యముల నుంచి వచ్చినటువంటి పంట కంటి సంబంధమైనటువంటి రోగములు రాకుండా మనిషిని కాపాడుతుంది. ఇంతగా మనల్ని రక్షించి బండిలో అనేకమైనటువంటి ఫలసాయములని ఇంటికి తీసుకొని రావటమే కాకుండా తన మెడ మీద నాగలిని పెట్టుకొని భూమిని దున్నటానికి మనల్ని అనుగ్రహిస్తోంది ఎద్దు. అందుకే ఆ ఎద్దు పట్ల ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతని ఆవిష్కరిస్తారు. ఆ ఎద్దు పట్ల కృతజ్ఞతని ఆవిష్కరించే పండుగకే కనుమ పండుగ అని పేరు. భోగినాటికి ఇంటికి పంట అంతా వచ్చింది. సంక్రాంతి పండుగ నాడు కొత్త అల్లుళ్లతో కలిసి సంతోషంగా భోజనం చేశాడు. దీనికంతటికీ కారణం అయిన తనతో పాటు శ్రమించిన ప్రాణి ఒకటి ఉంది ఎద్దు. అది ఇంటి పెరటిలోనే ఉంది. మరి ఆ ఎద్దుని కూడా సత్కరించకపోతే మనిషి జీవితానికి పూర్ణత్వం ఎక్కడ ఉంది. ఇది భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పదనం.కనుమ పండుగి ఎక్కువగా వ్యవసాయదారులు పశుపక్ష్యాదులను పూజించడానికి చేసుకుంటారు. అంతే కాకుండా పితృ దేవతలను కూడా శాంతింప జేయడానికి ముఖ్యం గా శాఖాహారులు మినుముతో గారెలు చేసి, నివేదించి, స్వీకరించాలని చాలా మంది నమ్ముతారు. ఈ రోజు ప్రయాణానికి మంచిది కాదని ఇంట్లోనే అందరు కలిసి మెలిసి, కనుమ పండుగను జరుపుకుంటారు.