వరాహావతారం మహిమ
భక్త సంరాక్షణార్ధం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు, వాటిలో ముఖ్యమైనవి దశావతారాలని మనం కొలుచుకుంటాంకదా. ఇవి భూమి మీద మానవ పరిణామానికి సంకేతాలని కూడా చెబుతారు. దశావతారాలలో మూడవది ఆది వరాహావతారం.
శ్రీ మహావిష్ణువు వరాహావతారాన్ని ఎత్తటానికి సంబంధించిన కధని ఇక్కడ టూకీగా చెప్పుకుందాం. ఒకసారి శ్రీమహావిష్ణువు దర్శనార్ధం సనక సనందాది మహా ఋషులు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ద్వార పాలకులైన జయ విజయులు స్వామివారి దర్శనానికి అది సరైన సమయం కాదని అడ్డగిస్తారు. దానితో ఆ మహా ఋషులకి కోపం వస్తుంది. జయ విజయులని, ఏ స్వామి సాన్నిధ్యంలో వున్నామనే గర్వంతో తమని అడ్డగించారో, ఆ స్వామి సేవకి దూరమయ్యి భూలోకంలో అసురులుగా జన్మిస్తారని శపిస్తారు. వారు శ్రీమహావిష్ణువుని ఆయన సేవకి ఎక్కువ కాలం దూరంగా వుండలేమని ప్రార్ధించగా, విష్ణుమూర్తి భక్తులుగా ఏడు జన్మలు లేక శత్రువులుగా మూడు జన్మలలో తనని తిరిగి చేరవచ్చనే వరం ఇస్తాడు. ఏడు జన్మలు ఆయన సేవకి దూరం కాలేమని, శత్రువులుగా మూడు జన్మలలోనే ఆయన సాన్నిధ్యాన్ని ప్రసాదించమని కోరుతారు.
ఆ విధంగా వారు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా భూలోకంలో జన్మిస్తారు. మిగతా జన్మలు రావణ - కుంభకర్ణులు, దంతవఖ్ర – శిశుపాలురు. హిరణ్యాక్షుడిని చంపటానికి ఆది వరాహావతారంలో, హిరణ్యకశిపునికోసం నరసింహావతారంలో, రావణ, కుంభకర్ణులకోసం శ్రీరాముడిగా, కంస, శిశుపాలురని అంతం చేయటానికి శ్రీ కృష్ణుడిగా అవతరించాడు శ్రీమహావిష్ణు. ప్రస్తుతం మనం చెప్పుకునే కధ ఆది వరాహావతారం గురించి.
హిరణ్యకశిపుడు భూదేవిని చెరబట్టి సముద్రం అడుక్కి తీసుకెళ్ళాడు. ఆవిడని రక్షించటానికి శ్రీమహావిష్ణువు ఆది వరాహ రూపమెత్తి హిరణ్యాక్షుడిని వెతుక్కుంటూ సముద్ర గర్భంలోకి వెళ్ళి, యుధ్ధంచేసి ఆతణ్ణి సంహరించి, భూదేవిని ఉధ్ధరిస్తాడు.
అయితే మహావిష్ణువు మొదటి అవతారాలయిన మత్స్య, కూర్మ, వరాహ రూపాలలో ఆయనకి పూజలు తక్కువగానే వున్నాయి. ఈ అవతారాలలో ఆయన దర్శనమిచ్చే పుణ్య క్షేత్రాలు కూడా తక్కువే. వాటిలో ప్రముఖమైనవి మత్స్యావతారంలో చిత్తూరు జిల్లా నాగలాపురంలో శ్రీ వేద నారాయణ స్వామి (స్వామి కింద భాగం మత్స్య రూపంలో వుంటుంది) కూర్మావతారంలో శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మంలో, వరాహావతారంలో కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు.
తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామికి స్ధలమిచ్చిన ఆది దేవుడిగా వరాహస్వామిని కొలుస్తారు. వెంకటేశ్వరస్వామి కూడా ఆయన దగ్గరకు వచ్చే భక్తులంతా ముందు వరాహస్వామి దర్శనం చేసుకురావాలని, అలా అయితేనే ఆ యాత్ర సఫలమవుతుందని చెప్పారంటారు. మన అవతార మూర్తులను మర్చిపోకుండా మననం చేసుకోవటానికి భగవంతుడు ఏర్పాటు చేసిన మార్గం కదా ఇది.
తిరమల తర్వాత వరాహావతారానికి పూజలు పెద్దపల్లి జిల్లాలోని కమాన్ పురా మండల కేంద్రంలో (పాత కరీంనగర్ జిల్లా) జరుగుతున్నాయి. అనేక ఆలయాలలో వరాహావతారాన్ని ఆలయ స్ధంబాలమీద చెక్కిన విగ్రహాలలోనో, ఉపాలయాలలోనో చూడవచ్చుగానీ, ఆ స్వామికి ముఖ్యాలయంగా కమాన్ పురా తెలుగునాట రెండవ స్ధలంగా ఖ్యాతి చెందింది.
ఇప్పటిదాకా ఈ క్షేత్రం గురించి పూర్తి వివరాలు అందరికీ తెలియదు. విశాలమైన ఆవరణ. మధ్యలో ఎత్తయిన గట్టు. చుట్టూ స్వామికి ఆఛ్చాదన ఇస్తున్నట్లు పెద్ద పెద్ద వృక్షాలు. ఆ గట్టుమీద స్వామి. ఆలయంలో ఒక కార్యకర్త వున్నారు.
మహర్షులు ఎప్పుడూ లోక హితాన్ని కోరుకుంటారు. భారతావనిలో పూర్వం నుంచి అనేకమంది మహా ఋషులు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమయ్యేవాడు. ప్రత్యక్షమయిన భగవంతుడిని వారు తమకోసం ఏమీ కోరకుండా భక్తుల కోరికలు తీరుస్తూ అక్కడే కొలువుతీరమని ప్రారించారు. భగవంతుడు అలా కొలువుతీరిన అనేక క్షేత్రాలు నేడు పుణ్యక్షేత్రాలుగా విలసిల్లి అనేకమంది భక్తుల కోర్కెలు తీరుస్తున్నాయని ఆయా స్ధల పురాణాలద్వారా తెలుస్తున్నది. ఇది కూడా అలాంటి క్షేత్రాలలో ఒకటి.
స్ధల పురాణం:
600 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకునేవారు. ఆయన కలలో స్వామి కనిపించి మహర్షి కోరిక ఏమిటని అడిగారు. ఆయన స్వామిని అక్కడ కొలువుతీరమని కోరారు. స్వామి అక్కడ ఒక బండరాయిమీద మూర్తీభవించారు. మొదట్లో ఈయన విగ్రహం చిన్న ఎలుకలాగా వుండేది. క్రమంగా విగ్రహం పెరుగుతూ వచ్చింది. గత మూడు దశాబ్దాలుగా ఈ స్వామి ఖ్యాతి వ్యాప్తమయి చుట్టుపక్కల ఊళ్ళనుంచేకాక, రాష్ట్రాలనుంచి కూడా అనేకమంది భక్తులు స్వామి దర్శనార్ధం వస్తున్నారు. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరటంతో ఈ వరాహ స్వామిని భక్తులందరూ వరాలస్వామిగా పిలుచుకోసాగారు. సింగరేణి కాలరీస్ వారు దేవాలయాభివృధ్ధికోసం బుల్ డోజర్ తో నేల చదును చేయ ప్రయత్నించగా ఒక బండరాయి దగ్గర సాగలేదు. అక్కడ పరీక్షించగా కాలి ముద్రలు కనిపించాయి. వాటిని స్వామివారి కాలిముద్రలుగా భావించి భక్తులు వాటికీ పూజ చేయసాగారు.
అలాగే కోరిన కోరిక నెరవేరిన ఇంకొక భక్తుడు స్వామికి ఆలయం నిర్మించబోగా ఆయన కలలో కనబడి తనకి ఆలయం వద్దని, అలాగే వుంటానని చెప్పటంతో ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు.
అయితే ఈ క్షేత్రం వెలుగు చూసింది గత మూడు దశాబ్దాలనుంచే. భగవంతుని కరుణ అనేక విధాలుగా వుంటుంది.
స్వామి విగ్రహం ఫోటో చూడండి. దానికి ముందు వున్న బండరాయి అప్పుడు పూర్తిగా స్వామిని కప్పేస్తూ వుండేది. ఆ రెండు రాళ్ళ మధ్య వున్న సందులోంచి స్వామి దర్శనం చేసుకునేవారు. అలాగే అభిషేకం చేసేవారు. స్వామి విగ్రహానికి కేశాలు వున్నాయని స్ధల పురాణంలో వున్నది. దాని గురించి అడిగితే నిజమని, తాము ప్రత్యక్షంగా చూశామని, చేతికి వచ్చేవని తెలిసింది. ఇప్పుడు ఏమీ లేవు.
తర్వాత స్వామి దర్శనం అందరికీ కావాలని స్వామిని ప్రార్ధించి, ముందు అడ్డంగా వున్న బండరాయిని పగులగొట్టించారు. అది కూడా స్వామి విగ్రహం బయటపడేవరకు మాత్రం పగులగొట్టగలిగారు. తర్వాత ప్రయత్నించినా ఆ రాయి పగుల లేదు. చిన్న ముక్క ఎగిరి వెళ్ళి దూరంగా పడేది. ఎన్నిసార్లు ప్రయత్నించినా అలాగే అయ్యేసరికి ఇంక వదిలేశారు. ఇంక దానిని అలాగే వదిలేసి, భక్తులు స్వామి దగ్గరగా వెళ్ళటానికి మెట్లు ఏర్పాటు చేశారు. అలాగే స్వామి ఆలయం వద్దన్నారుకదాని ఎండకీ, వానకీ, ఇబ్బంది లేకుండా పైన ఆఛ్చాదన ఏర్పాటు చేయాలని అనేక విధాల ప్రయత్నించినా సాగలేదు. డేరాలాగా వేసినా అది కాలిపోయేది. ప్రస్తుతం ఒక పక్కగా చిన్న గొడుగులాంటి ఆఛ్చాదన వున్నది. అది అక్కడి పురోహితులు పెద్దవారు, ఆయన ఎండధాటిని తట్టుకోలేరని వేసినది. తనకి ఆఛ్ఛాదన అక్కరలేకపోయినా, స్వామి భక్తులని కరుణించారన్నమాట.
స్వామివారి విగ్రహం పైన శంఖం, చక్రం ఆకారాలున్నయి. ఆవరణలోనే స్వామికి కొంచెం దూరంలో పాదాల ముద్రలు వున్నాయి. అక్కడ ఏనుగు పాదాలు, స్వామి పాదాలు వున్నాయి. స్వామి ఏనుగెక్కి వచ్చారని భక్తులు విశ్వసిస్తారు.
స్వామికి రోజూ ఉదయం 8 గం. లకి అభిషేకం జరుగుతుంది. అభిషేకం చేయించదలచిన భక్తులు ఒక పావుగంట ముందే అక్కడ వుండాలి అని బోర్డు పెట్టారు. అభిషేకం తర్వాత స్వామివారి విగ్రహం మొత్తాన్ని చందనంతో అల్లుతారు .
స్వామికి నిత్య పూజలు జరుగుతాయి. అవేకాక, భక్తుల కోరికమీద సత్యన్నారాయణ వ్రతాలు, పిల్లల తల నీలాల సమర్పణ, అన్నప్రాశన, పుట్టిన రోజు, అన్నదానాలు వగైరా కార్యక్రమాలన్నీ అక్కడ ఎక్కువగా జరుగుతూంటాయి. వాటికోసం విశాలమైన ఆవరణ చుట్టూ వచ్చినవారు వుండటానికి (కార్యక్రమం సమయంలో మాత్రమే) తగిన వసతి, వంటశాలలు, పూజా మందిరాలు నిర్మించారు.స్వామికి సమీపంలోనే పుట్ట, నాగదేవత విగ్రహం వుంటాయి.
మార్గం:
కరీంనగర్ నుంచి మంధని వెళ్ళే మార్గంలో ఎడమవైపు తిరిగి లోపలకి వెళ్ళాలి. రోడ్డు మొదట్లో బోర్డు వుంటుంది.