Online Puja Services

కృష్ణనామ స్మరణం - కలిదోష నాశనం

3.22.42.189
శ్రీకృష్ణ నామం ఎంతో మధురాతి మధురమైనది. కృష్ణనామాన్ని ఏ తీరుగా తలిచినప్పటికీ మన మనసులలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది. ‘కృష్ణా‘ అనే నామ సంకీర్తనం వల్ల కోటి చంద్రగ్రహణ, సూర్యగ్రహణ స్నానాలను చేయడంవల్ల కలిగే ఫలితం పొందుతారు. కృష్ణ నామం ఎన్ని పాతకాలను దహించగలదంటే అసలన్ని పాపాలను మానవులు ఎన్నటికీ చేయలేరు. పాప రూపాగ్నిలో దహనమై, చేసిన సత్కర్మలన్నీ శూన్యమైన వారికి కృష్ణనామం పరమ ఔషధం వంటిది.

మృత్యు సమయంలోకూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట.
భగవానుని గుణకర్మ, నామైక దేశ సంకీర్తన మాత్రం చేతనే పాపాలన్నీ సంపూర్ణంగా నశించుతాయని చెప్పబడింది. ఒక జీవిత కాలంలో జరిగే పాపమంతటినీ కలిపినప్పటికీ, సామాగ్ని ముందు గడ్డిపోచతో సమం అని పురాణ వచనం. పాపక్షయానికై నామస్మరణం ఏ ఇతర సాధనాలతోను సముచ్చయంగా ఉండవలసిన అవసరం లేదు. భగవన్నామ సంకీర్తన సాధనేతర నిరపేక్షంగానే పాపక్షయానికి సాధనమని పండితార్ధం కదా! కలియుగంలో నామ సంకీర్తనమే ముక్తికి సాధనంగా చెప్పబడింది.

కలి వల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవడం ఎట్లా అని ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని అడుగగా ‘సత్య యుగంలో ధ్యానంవల్ల, త్రేతాయుగంలో యజ్ఞాలవల్ల, ద్వాపర యుగంలో పూజలు, వ్రతాలవల్ల పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం నామస్మరణ వలన పొందుతారని ‘హరే రామ హరే రామ రామరామ హరేహరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అనే నామ మంత్రం ఉపదేశించాడు. ఈ మంత్రంలోని రామ శబ్దం, హరి శబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణుణ్ణే సూచిస్తాయి.

కృష్ణః’ అంటే పాపాలు పోగొట్టేవాడు. ‘కృష్ణః’ అన పదంలోని ‘క’కారం బ్రహ్మవాచకం, ‘ఋ‘కారం అనంత వాచకం. ‘ష’ కారం శివ సూచకం, ‘ణ’ కారం ధర్మబోధకం. చివర ఉన్న ఆ కారం శే్వత ద్వీప వాసియైన విష్ణు వాచకం.విసర్గం నర నారాయణార్ధకం. కనుక కృష్ణుడు సమస్త దేవతల తేజోరాశి.
కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ అని కృష్ణ భగవానుని నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రానికే పదివేల యజ్ఞాలు, కోటి తీర్థ స్నాన పుణ్యం లభిస్తుందని వ్రతాల వలన కూడా నశించని పాపాలు కృష్ణ అని నామోచ్చరణ చేయడంతో తొలగిపోతాయని, ‘కృష్ణ’ అంటూ కీర్తించే వావరి శరీరం ఎన్నటికీ అపవిత్రం కాజాలదని, జన్మ జన్మల పాపాలన్నీ తొలగి కృష్ణునిపై మనసు లగ్నమవుతుంది. శ్రీకృష్ణ నామ మహిమ గురించి సాక్షాత్తు శ్రీమహా విష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భం స్కందపురాణంలో ఉంది. ‘నా కృష్ణ నామోచ్ఛారణ చేయడం వల్ల నాకెంతో ప్రీతికలగుతుందంటే, ఇతర నామాలు కోటిసార్లు చేసినా నాకు అంత సంతోషం కలగదు’ అన్నాడు.

నామ స్మరణకే ప్రభావమున్నదని గ్రహించి, శ్రీకృష్ణ నామమునే సదా స్మరించి నారదాదులు ఆయన కృపకు పాత్రులయ్యారు. కనుక కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ నామ మహిమను, లోక ధర్మాలని చెప్పిన కారణంగా శ్రీకృష్ణావతారము కలియుగ ప్రజలందరికీ గొప్పది. ఆచరణానికి అనువైనది. ‘్భక్త దుఃఖ కర్షిం కృష్ణః’ అంటే భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు శ్రీకృష్ణుడు అని అర్ధం.
మానవ జీవితంలోని పాపాల్ని పోగొట్టుకోడానికి శాస్త్రాలలో అనేక ప్రాయశ్చితాలు చెప్పారు. చాంద్రాయణాదివ్రతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది. కానీ ఎన్ని చేసినా ఆ పాపం పోదు. కానీ శ్రీకృష్ణ నామం జపిస్తే ‘క్షోభం’ వల్ల కలిగిన పాపం కూడా నశిస్తుంది. అందుకు కారణం శ్రీకృష్ణ నామంలో క్లేశఘ్ని-పాపఘ్ని అనే బలవత్తరమైన శక్తులుండడమే నని-ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలతో విరాజిల్లుతున్నాడో అన్ని నామాలతో ఆయన పేర్కొనబడుతుంటాడు. కృష్ణ నామం పాపాన్ని నాశనం చేసి, పుణ్యాన్ని ఉత్పాదించి, భక్తిని తత్త్వజ్ఞానాన్ని, భగవతృప్తిని కలిగిస్తుంది. కృష్ణనామం జపం చేసేవారికి విపత్తియే సంపత్తిగా పరిణమిస్తుంది.

పురుషోత్తముడు, స్థితప్రజ్ఞుడైన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క మహోన్నతావతారం. పదారు కళల్లో మూర్త్భీవించిన పూర్ణావతారం. జీవులు తరించుటకు ఉపనిషత్సారమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమ మూర్తి. ద్వాపర యుగంలో రోహిణీ నక్షత్ర యుక్త శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణునిగా అవతరించాడు. అష్టమియొక్క అర్ధరాత్రి సమయంలో ఆకాశమందు అర్ధ చంద్రుడు ప్రకాశించగా, పృధ్వియందు పూర్ణ చంద్రుడు ఉదయించిననట్టు శరణాగత వత్సలుడు దేవకీదేవికి జననం. శ్రీకృష్ణావతారం సంపూర్ణావతారమనీ, శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని భాగవతం మనకు వెల్లడిస్తోంది. ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మకు భక్తి ప్రపుల్లాత్ములమై ప్రణమిల్లి మన జీవితాలను ధన్యం చేసుకుందాం.

-‘రసస్రవంతి’, ‘కావ్యసుధ’(sekarana from Sunday, 4 June 2017 ANDHRA BOOMI TELUGU DAILY )

- వెంకట కృష్ణప్రసాద్ ఏలేశ్వరపు

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore