Online Puja Services

భక్తి అంటే ఏమిటి?

3.16.44.178

భగవంతుని మనసా స్మరిస్తూ, అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీ ఆశించకుండా, కేవలం ఆ సర్వేశ్వరుణ్ని స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి. శివునిపై నందీశ్వరునికి ఉండేది భక్తి. గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవత్ తత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచీ పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతీ పనిలోనూ భక్తి  అంతర్లీనంగా ఉంటుంది. ఈ కాలంలో భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్లి మన కోర్కెల చిట్టా చదవడమే అనే ధ్యాసలో భక్తులున్నారు. కోర్కెల గురించి ఆ సర్వాంతర్యామిని ప్రార్ధించాలనుకునేవారికి అసలు భక్తి తత్వపు పరమార్ధం బోధపడనట్లే. ఆ సర్వేశ్వరుడు సర్వాంతర్యామి. ఆయనకు తెలియనిది లేదు. అలాంటి ఆ సర్వవ్యాపకునికి మన కోర్కెలు తెలిపి, ఇదీ నా ఫలానా నా అవసరం, దాన్ని తీర్చు అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కదా. మనతో పాటు, మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని సృష్టించిన ఆ దేవదేవుడికి, మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా..? సరిగ్గా ఆలోచిస్తే, భగవంతునితో మనం కోర్కెలు మొర పెట్టుకోవడం ఎంత హాస్యాస్పదపు పనో అర్ధమవుతుంది. భక్తి అంటే శ్రద్ధ. శ్రద్ధ అంటే తిరుగులేని నమ్మకము. భగవంతునిపై లేదా మనం నమ్మిన గురువులపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. వారు చూపిన బాట శిరసా వహించే భక్తునికే వారి అనుగ్రహం ఉంటుంది. సామాన్యుడికీ, భక్తుడికీ అక్కడే తేడా ఉంటుంది.


భక్తికి సరైన ఉదాహరణ, కృష్ణార్జునుల అనుబంధం. కృష్ణుడు అర్జునునికి రథసారథి. ఇది భౌతిక అర్ధం కాదు. జీవితమనే యుద్ధరంగంలో మనమున్న రథాన్ని నడిపే బాధ్యత పూర్తిగా ఆ సర్వేశ్వరునికే వదిలేస్తే, విజయగీత వినిపించి కార్యోన్ముఖుణ్ని చేస్తాడు ఆ అంతర్యామి. యుద్ధానికి ముందు ధుర్యోధనుణ్ని నేను కావాలా నా సైన్యం కావాలా అని అడుగుతాడు కృష్ణుడు. ఈ ఒక్కడిని నేనేం చేసుకుంటాను, సైన్యం ఉంటే సరిపోతుంది అన్న విషయ వాంఛాలోచనలో, సైన్యాన్నే కోరుకున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు మాత్రం, నీవే నా రథసారథి పరమాత్మా అని శరణువేడాడు. ఫలితం కురుక్షేత్ర విజయం. ఆ అనంత శక్తిని శరణువేడి నా జీవితమనే కురుక్షేత్రంలో నన్ను గెలిపించు తండ్రీ అని మనసా వాచా కర్మణా వేడిన నాడు, మనిషి తనకు కావాల్సింది అడగకుండానే సమకూరుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా, మాతృవాత్సల్యం లాంటి భగవంతుడి ప్రేమ మనపై అజరామరంగా కురుస్తుంది. భగవంతుణ్ని చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం అచంచల భక్తి మాత్రమే. 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba