పట్టు విడుపులు
చాలామందికి పసితనం నుంచీ పట్టుదల అలవాటు అయిపోతోంది. తల్లి ఒడి నుంచే- కావాలి అనుకున్నది పొందేవరకు విచారమే. ఎదిగే కొద్దీ విడుపు అలవరచుకోవాలి. ఈ సుఖాలు శాశ్వతం కాదు అనే ఎరుకలోకి రావాలి.
పసితనంలో సవతితల్లి చేతిలో అవమానం పొందాడు ధ్రువుడు. తండ్రి ఆదరణకు దూరమై, తల్లి దీవెనతో శ్రీహరి శరణు పొందాలని అనుకున్నాడు. తపస్సు చేయడానికి అడవులకు పయనమయ్యాడు. మార్గంలో నారదమహర్షి కనిపించి బాలధ్రువుణ్ని పరీక్షించడం కోసం తొలుత నిరాశపరచాడు. పట్టువదలని ధ్రువుడి భక్తికి సంతోషించిన నారదుడు మంత్రోపదేశం చేసి ప్రోత్సహించాడు. బాలభక్తుడి అద్వితీయ తపస్సుకు మెచ్చిన మహా విష్ణువు ప్రతక్షమయ్యాడు. భవిష్యత్తులో సూర్యచంద్రుల ప్రదక్షిణ మార్గంలో నక్షత్రమై శాశ్వత స్థానం పొందే వరమిచ్చాడు శ్రీహరి.
తిరిగి రాజ్యానికి వచ్చిన ధ్రువుడికి తండ్రి పట్టాభిషేకం చేశాడు. రాజ్యపాలన చేసే సమయంలో యక్షుల చేతిలో తన సోదరుడు ఉత్తముడు మరణించాడు. కుమారుడి మరణంతో పినతల్లి ప్రాయోపవేశం చేసింది. ఇందుకు కారణమైన యక్షులను ధ్రువుడు తీవ్రంగా దండించాడు. ధ్రువుడి పట్టుదల చూసి, తన వంశమూల పురుషుడైన స్వయంభువ మనువు ప్రత్యక్షమయ్యాడు. శ్రీహరిని ప్రసన్నం చేసుకొన్న నీకిది తగదని ధ్రువుణ్ని వారించాడు. ఇందువల్ల శివుడికి సన్నిహి తుడైన కుబేరుడనే యక్షుడికి ఆగ్రహం వచ్చిందని చెబుతాడు. ధ్రువుడు వెంటనే తన పట్టుదల వీడి అందరి మన్ననలను పొందాడు. త్వరలోనే యముడి ఆహ్వానంతో ఆయన వీపు మీదుగా దివ్య విమానం ఎక్కి పుణ్య లోకాలకు చేరాడు. ధ్రువ నక్షత్రమై శాశ్వత కీర్తి పొందాడు.
బాల్యంలో వారి స్థితిని గమనించి తల్లి, తండ్రి, గురువు తగిన ప్రోత్సాహాలు అందించినట్లయితే- ఆ బిడ్డ తమకు వంశానికి వన్నె అద్దుతాడు.
మాయలేడిని పంపి, రామ లక్ష్మణులు లేని సమయంలో సీతాపహరణం చేశాడు రావణుడు. పర్ణశాలకు తిరిగివచ్చిన రాముడికి ఎంత వెదికినా సీతమ్మ జాడ తెలియలేదు. రాముడు బేలగా అడవిలోని చెట్లను, పక్షులను, వన్యమృగాలను, నదులను సీతాదేవి జాడ చెప్పమని కోరాడు. రావణుడి భయంతో ఎవరూ సహకరించలేదు. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఒక్క బాణంతో ముల్లోకాలను ఇంకింపజేస్తాను అని సిద్ధమయ్యాడు శ్రీరాముడు.
ఎవరో చేసిన తప్పునకు అమాయక ప్రాణకోటిని దండించడం తగదని అన్నను లక్ష్మణస్వామి అనునయించాడు. లోకహితం కోరి తన పట్టుదలను వీడి సీతాన్వేషణ ప్రారంభించాడు శ్రీరామచంద్రుడు. అనతికాలంలోనే రావణసంహారం చేసి సీతాదేవిని పొందాడు రఘుకుల తిలకుడు. కాలం కలిసిరానప్పుడు ఓర్పు వహించి కార్యాన్ని చక్కబెట్టుకోవడం వివేకవంతుల లక్షణం. పట్టుదలతో ఎల్లప్పుడూ కార్యం సాధించగలమని అనుకోవడం అవివేకం. తమ హితులు చెప్పిన సూచనల్నీ స్వీకరించగలగాలి. కాలక్రమంలో ధర్మాత్ములకు విజయం తథ్యం.
కడుపున పుట్టిన వాడైనప్పటికీ అశ్వత్థామకు అన్ని అస్త్రవిద్యల్నీ నేర్పలేదు ద్రోణుడు. ధర్మానికి కట్టుబడ్డ శిష్యుడైన అర్జునుడినే తనకు మించిన విలుకాడిని చేశాడు ఆ ఆచార్యుడు. పాండవ వంశ నిర్మూలనకు పట్టుపట్టి ఉపపాండవులను అధర్మంగా సంహరించాడు అశ్వత్థామ. చివరకు ఉత్తర గర్భంలో ఉన్న పాండవ వంశాంకురాన్నీ వదిలిపెట్టకుండా బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. కృష్ణపరమాత్మ ఆ బ్రహ్మాస్త్రం నుంచి శిశువును కాపాడి ధర్మసంస్థాపన చేశాడు. ఆ శిశువే పరమ భాగవతుడైన పరీక్షిత్తుడిగా పేరుగాంచిన విష్ణురాతుడు.
ధర్మాధర్మ విచక్షణ లేని పట్టువిడుపులు వ్యక్తికైనా, వ్యవస్థకైనా మంచిది కాదు. పసితనం నుంచీ తల్లిదండ్రులు ఈ స్పృహ పెంపొందించడమే- ఆ వ్యక్తికి, సమాజానికి శ్రీరామరక్ష.