కారంపూడి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ చరిత్ర
పల్నాటి చరిత్ర లో ప్రముఖ స్థానం పొంది భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కారంపూడి శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ చరిత్ర
"కేశి" అనే దుర్మార్గుడైన రాక్షసుడు బ్రహ్మవరం చేత ఏ ఆయుధం చేత సంహరించకుండా వరం పొంది మునులను,ప్రజలను నానా ఇబ్బందులు పెడుతూ, ఒకనాడు తపస్సులో ఉన్న మార్కాండేయుని వద్దకు వెళ్లి తపోభంగం చేసి భాధించుచుండగా,మార్కాండేయుడు శేష తల్ప శయనుడైన విష్ణు మూర్తిని ప్రార్దించగా శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని విష జ్వాలల ద్వారా సంహరింపబడిన ప్రదేశం అయిన ప్రస్తుతం చెన్నకేశవ స్వామి వారు వెలసిన స్థలంలో మార్కాండేయుడు అభ్యర్దన మేర స్వయంస్వయంభూ గా వెలసాడని కధనం. కేశి ని సంహరించిన ఆదిశేషుడు స్వామి వారి హస్తంలో అస్త్రం లాగా మారి వెలసారని పురాణ కధనాలు ఉన్నాయి
ఒకప్పుడు పల్నాటి ప్రాంతాన్ని పరిపాలించిన చందోలు రాజ వంశీకులు కారంపూడి చెన్నకేశవ ఆలయం నిర్మించగా, పల్నాటి బ్రహ్నన్న గారి ఆరాధ్య దైవం అయిన చెన్నకేశవ స్వామి ఆలయాన్ని బ్రహ్మన్న గారు కూడా పునరుద్దించారని కధనాలు ఉన్నాయి.
16 వశతాబ్దంలో స్తానికి కారంపూడి ప్రభువు కాకతీయ రాజుల ప్రతినిధి రామనాయంకర్ కూడా చెన్నకేశవ ఆలయ అబివృద్ది చేసారు.. చెన్నకేశవ స్వామి దేవాలయం ఎదురు పల్నాటి యుద్ద సమయం లో ఒక బుంగ పట్టేట్లు ఒక బుగ్గ ఉన్నట్లు ఆ బుగ్గలో నుండి నీరు పైకి ఉబికేదట,ఆ నీరు త్రాగితే శరీరంలో,ఉద్రేక,పౌరుషాలు పెరుగాయని కనుక పల్నాటి వీరులు యుద్ద,సమయాల్లో ఈ నీరు త్రాగి యుద్దానికి వెళ్లేవారని ఒక చారిత్రక కధనం ప్రచారంలో ఉంది.
ప్రస్తుతం ఆ బుగ్గ పూడిపోయిందట. ఈ ఆలయంలో చెన్నకేశవ స్వామి వారికి పల్నాటి వీరాచార ఉత్సవాల సమయంలో 14 జిల్లాలనుండి వివిధ ప్రాంతాలనుండి వచ్చిన వీరులు పూజించి మొక్కులు తీర్చుకుంటారు.
వీరాచార ఉత్సవాల సమయంలో బ్రహ్మనాయుడు వాడిన నృశింహకుంతల ఆయుధం స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం ఆయుధానికి గ్రామోత్సవం నిర్వహిస్తారు.. ఈ ఆలయంలో శ్రీదేవి,భూదేవి అమ్మవార్లని భక్తిశ్రద్దలతో కొలుస్తారు..
ఈ ఆలయంలో చెన్నకేశవ స్వామి బహు సుందర రూపుడై ఎడమ చేతిలో చక్రం, కుడి చేతి యందు శంఖం,గదా,మాఘ హస్త్ర ధారి యై పాదముల చెంత కుడి వైపున శ్రీ చక్ర యంత్రం,ఎడమ వైపున శ్రీ చక్ర పెరుమాళ్ల కలిగి ఉండును. స్వామి వారి కుడిచేతి పక్క ఆలయంలో శ్రీ గోదాదేవి మాత విగ్రహం కలదు.
స్వామి వారికి ఎడమ వైపున ప్రత్యేక దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ అమ్మవారు పద్మాసీనులై చతుర్బుజామురాలై చేతులయందు కమలలను అభయ వరద హస్తములతో భక్తుల పూజలు అందుకుంటున్నారు పాదముల కింద పద్మం చుట్టూ మకర తోరణం కలిగి అవతార (విష్ణువు కు మారురూపు)గా భక్తులకు దర్శనమిస్తారు పాద పీఠం ముందు బ్రహ్మనాయుడి నృసింహ కుంతల ఆయుధం ఉండును.
వేల సంవత్సరాల క్రితం స్వయంభూ గా వెలసిన స్వామి వారిని ఋషులు,దేవతలు కొలిచేవారని గజారణ్య సంహితమందు ఉన్నట్లు ప్రతీతి. ఈ ఆలయంకు బ్రహ్మనాయుడు కాలంలో అనేక గ్రామాలు దానం ఇచ్చినట్లు దానశాసనాలు ఉన్నను,ప్రస్తుతం అవి కాలగర్బంలో కలసిపోయాయు.
భక్తుల,వీరాచార వంతుల సహకారంతో ప్రస్తుతం ఆలయంలో స్వామి వారికి వివిధ ఉత్సవాలు జరుగుతున్నాయి.
బ్రహ్మనాయని కాలం నాటి దేవాలయం శిధిలావస్థకు చేరటంతో దాతలు,భక్తుల సహకారంతో
22-11-2004 న ఆలయ పున:ప్రతిష్ట జరిగింది.ఉగాది,దేవీ నవరాత్రులు,శ్రీ కృష్ణాష్ణమి,దీపావళి,కార్తీక మాస ఉత్సవాలు, ధనుర్మాసంలో ప్రతి రోజు ప్రత్యేక పూజలు వీరుల తిరునాళ్ళ సమయంలో వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.
ప్రతి సంవత్సరం చైత్రశుధ్ర పౌర్ణమి రోజున స్వామి వారికి ఘనంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.
ప్రస్తుతం కారంపూడి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయ పూజారి అయిన కొమండూరి సత్యనారాయణ చార్యులు గారు వారి ధర్మపత్ని రాజ్యలక్ష్మీ గార్ల ఆధ్వర్యంలో భక్తుల,దాతల ప్రోత్సహంతో ఆలయం దినాదినాభివృద్ది పొందుతుంది..
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కృప,కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుచున్నాము.
వేముల శ్రీనివాసరావు.