Online Puja Services

*అంతా రామమయం !.. మన బతుకంతా రామమయం

3.15.228.32
ఒక దేశానికి, జాతికి సొంతమయిన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే *రామాయణం.*
ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ *రాముడు మనవెంట నడిచిన దేవుడు !*
మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన *ఆదర్శ పురుషుడు.*
మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన *అద్దం రాముడు.*
ధర్మం పోత పోస్తే *రాముడు !*
ఆదర్శాలు రూపుకడితే *రాముడు !*
అందం పోగుపోస్తే *రాముడు !*
ఆనందం నడిస్తే *రాముడు !*
వేదోపనిషత్తులకు అర్థం *రాముడు !*
మంత్రమూర్తి *రాముడు !*
పరబ్రహ్మం *రాముడు !*
లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు *రాముడు !*
ఎప్పటి త్రేతాయుగ రాముడు ?
ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ??
అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగునా *రాముడే.*
చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట - *శ్రీరామరక్ష సర్వజగద్రక్ష !*
బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - *రామాలాలి - మేఘశ్యామా లాలి.*
మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు *శ్రీరామ రక్ష - సర్వ జగద్రక్ష.*
మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - *అయ్యో రామా.*
వినకూడని మాట వింటే అనాల్సిన మాట - *రామ రామ.*
భరించలేని కష్టానికి పర్యాయపదం - *రాముడి కష్టం.*
తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - *రాముడు.*
కష్టం గట్టెక్కే తారక మంత్రం - *శ్రీరామ.*
విష్ణుసహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - *శ్రీరామ శ్రీరామ శ్రీరామ.*
అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - *అన్నమో రామచంద్రా !*
వయసుడిగిన వేళ అనాల్సిన మాట - *కృష్ణా రామా !*
తిరుగులేని మాటకు - *రామబాణం.*
సకల సుఖశాంతులకు - *రామరాజ్యం.*
ఆదర్శమయిన పాలనకు - *రాముడి పాలన.*
ఆజానుబాహుడి పోలికకు - *రాముడు.*
అన్నిప్రాణులను సమంగా చూసేవాడు - *రాముడు.*
*రాముడు* ఎప్పుడూ మంచి బాలుడే.
చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా - *రామా కిల్డ్ రావణ* ; *రావణ వాజ్ కిల్డ్ బై రామా.*
ఆదర్శ దాంపత్యానికి - *సీతారాములు.*
గొప్ప కొడుకు - *రాముడు.*
అన్నదమ్ముల అనుబంధానికి - *రామలక్ష్మణులు.*
గొప్ప విద్యార్ధి - *రాముడు* (వసిష్ఠ , విశ్వామిత్రలు చెప్పారు).
మంచి మిత్రుడు - *రాముడు* (గుహుడు చెప్పాడు).
మంచి స్వామి *రాముడు* (హనుమ చెప్పారు).
సంగీత సారం *రాముడు* (రామదాసు, త్యాగయ్య చెప్పారు).
నాలుకమీదుగా తాగాల్సిన నామం *రాముడు* ( పిబరే రామ రసం - సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు).
కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - *రాముడు.*
నోరున్నందుకు పలకాల్సిన నామం - *రాముడు.*
చెవులున్నందుకు వినాల్సిన కథ - *రాముడు.*
చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - *రాముడు.*
జన్మ తరించడానికి - *రాముడు, రాముడు, రాముడు.*
*రామాయణం పలుకుబళ్లు*
మనం గమనించంగానీ, భారతీయ భాషలన్నిటిలో *రామాయణం* ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. తెలుగులో కూడా అంతే.
ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా *రామాయణం* విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది.
చెప్పడానికి వీలుకాకపోతే - అబ్బో అదొక *రామాయణం.*
జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే - *సుగ్రీవాజ్ఞ, లక్ష్మణ రేఖ.*
ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే - అదొక *పుష్పకవిమానం.*
కబళించే చేతులు, చేష్ఠలు - *కబంధ హస్తాలు.*
వికారంగా ఉంటే - *శూర్పణఖ.*
చూసిరమ్మంటే కాల్చి రావడం - *హనుమ.*
పెద్ద పెద్ద అడుగులు వేస్తే - *అంగదుడి అంగలు.*
మెలకువలేని నిద్ర - *కుంభకర్ణ నిద్ర.*
పెద్ద ఇల్లు - *లంకంత ఇల్లు.*
ఎంగిలిచేసి పెడితే - *శబరి.*
ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - *ఋష్యశృంగుడు.*
అల్లరి మూకలకు నిలయం - *కిష్కింధ కాండ.*
విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - *అగ్ని పరీక్షలే.*
పితూరీలు చెప్పేవారందరూ - *మంథరలే.*
యుద్ధమంటే - *రామరావణ యుద్ధమే.*
ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - *రావణ కాష్ఠాలే !*
కొడితే బుర్ర *రామకీర్తన* పాడుతుంది (ఇది విచిత్రమయిన ప్రయోగం).
సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు.
బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు.
ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.
ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు.
ఒక ఊళ్లో నీళ్ళు తాగి ఉంటారు.
ఒంటిమిట్టది ఒక కథ..
భద్రాద్రిది ఒక కథ...
అసలు రామాయణమే మన కథ.
*అది రాస్తే రామాయణం - చెబితే మహా భారతం.*
 
- రమేష్ నాయుడు సువ్వాడ

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore