శ్రీదుర్గానాగేశ్వరస్వామి దేవాలయం –పెదకళ్ళేపల్లి
శ్రీదుర్గానాగేశ్వరస్వామి దేవాలయం –పెదకళ్ళేపల్లి సందర్శించే సమయం 6.00 a.m. to 12.00 p.m. and 5.00 p.m. to 8.00 p.m.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లి లో పవిత్ర క్రిష్ణానదీ తీరాన శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం ఉంది .చల్లపల్లికి 10కిలోమీటర్లు ,మచిలీపట్నానికి 30కిలో మీటర్ల దూరం .కదళీపురం లేక కదలీ క్షేత్రం అంటారు దీనికీ కాశీ కి చాలా పోలికలు ఉండటం చేత దక్షిణ కాశి అనికూడా అంటారు .కృష్ణానది ఇక్కడ కాశీలో గంగానది లాగా ఉత్తర వాహిని .అక్కడ ఉన్న కాల భైరవుడు ఇక్కడా ఉన్నాడు .ఇక్కడి క్షేత్ర పాలకుడు మదన గోపాలుడు .
ఈ ఆలయాన్ని క్రీ శ.1292లో సోమ శివా చార్యుడు అనే భక్తుడు నిర్మించాడు .అప్పటి నుండి నిత్య కల్యాణం పచ్చ తోరణం గా అభి వృద్ధి చెందుతోంది .అయన విగ్రహం కూడా ఉన్నది .తర్వాత చల్లపల్లి జమీందారులు దీని పోశాకులుగా ఉన్నారు . .కడలి అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న పల్లె కనుక కడలి పల్లె అనేవారు. అదే కళ్ళేపల్లి అయింది .స్థానిక అతిహ్యం ప్రకారం ఎనిమిది మంది సర్ప రాజులు విధి వశాన శాపగ్రస్తులై ,శాప విముక్తికోసం నాలుగు వైపులా కదళీ వనాలు అంటే అరటి తోటలు పెంచి శివుడిని నిశ్చలభక్తితో పూజించారు .వారి భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన పరమ శివుడు కదళీ వనాల మధ్య తనను పూజించారు కనుక ఈ క్షేత్రం ‘’కదళీ పురం ‘’పేరు తో పిలువబడు తుందని అనుగ్రహించాడు .
ఆలయానికి దక్షిణాన ‘’నాగ కుండం ‘’అనే సరస్సు ఉన్నది .పుణ్య తీర్ధాలన్నీ దీనిలో కలసి ఉండటం చేత దీనికి ‘’పరికర్నికా తీర్ధం ‘’అనే పేరొచ్చింది .స్వామి స్వయంభు .స్పాటిక లింగం .అయిదు అంతస్తుల రాజ గోపురం ఉన్నది .స్వామి గర్భాలయం లో పల్లం లోనే ఉంటాడు .స్వామిని పైకి లేపి ప్రతిస్ట చేద్దామని ప్రయత్నిస్తే అడుగున పెను శిలా వేదిక ఉండటం తో ఆ ప్రయత్నం విరమించారు .అమ్మవారు దుర్గాదేవి .అమ్మవారిని ‘’సిద్దేశ్వరి’’అంటారు .కోరిన కోర్కెలు తీర్చే దుర్గా నాగేశ్వర స్వామి ఈ ప్రాంత జనుల అభీష్ట దైవం .
ఆలయం దక్షిణ భాగాన రెండు మీటర్ల ఎత్తున ఉన్న శిలాస్తంభాన్ని ‘’సత్య స్థంభం ‘’అంటారు .దీనిపై ‘’బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధమ్మం శరణం గచ్చామి ‘’అని రాయ బడి ఉంది .ఈ స్థంభం మొదట్లో క్షేత్ర రూపుడైన కర్కోటక సర్ప రాజు ప్రతిస్తింప బడి ఉంటాడు .ఈ స్థంభం చుట్టూప్రదక్షినం చేసి నిలుచున్నా వారి నోటి నుండి అసత్యం వెలువడదు అని విశ్వాసం .దీని వెనుక ఒక కద ఉంది .పూర్వం వైశ్య సోదరులు డబ్బుకోసం తగాదా పడ్డారు .అందులో ఒకాయన ఒక కర్రలో తను సోదరుడి నుంచి దోచుకొన్న విలువైన వజ్రాలు రత్నాలు మొదలైనవి దాచి తాను నేరం చేయలేదని బుకాయించాడు .
అప్పుడు రెండవ వాడు అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి అబద్ధం ఆడలేదని శపథం చేయమన్నాడు .వాడు చేశాడు .ఇంతలో ఆ సత్య స్థంభం ఒరిగి వాడికర్ర మీద పడి కర్ర విరిగి అందులో దాచిన విలువైనవన్నీ బయట పడ్డాయి. అప్పటినుంచి ఎవరూ అక్కడ నిల్చుని అబద్ధం చెప్పరు .దీనికి ప్రదక్షిణ చేసిన తర్వాతే శ్రీ నాగేశ్వర స్వామిని దర్శిస్తారు .ఆలయం గోడలపై పంచముఖ గణేశ్వరుడు సింహాసనం పై కూర్చున్న భంగిమలో కనిపించి ఆశ్చర్య పరుస్తాడు .ఇది అరుదైన విగ్రహం గా భావిస్తారు .
ఆలయం లో అమ్మవారివి, అయ్యవారివి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు మహాశివరాత్రి నాడు స్వామి వారి కల్యాణోత్సవం రదోత్సవంకన్నుల పండువుగా నిర్వహిస్తారు .అప్పుడు వెలిగించే ఇక్కడి జగజ్జ్యోతి విశేషమైనది ..ఉత్తరాన శ్రీ చంద్ర మౌలీశ్వరస్వామి ఆలయం ఉన్నది .ఓంకార సమేత చంద్ర మౌలీశ్వర స్వామిస్వామి అంతరాలయం లో ఎడమవైపు పార్వతీ అమ్మవారు కుడివైపు భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ,నందీశ్వరుడు దర్శన మిస్తారు .కొత్తగా రామ లింగేశ్వార,మల్లీశ్వరాలయాలు నిర్మించారు .
సర్వేజనా సుఖినోభవంతు
- రామకృష్ణంరాజు గాదిరాజు