Online Puja Services

ద్రాక్షారామం

216.73.216.175
అత్యంత ప్రాచీన, మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారితో పాటు 14 అడుగుల ఎత్తైన ఆత్మలింగం ఇక్కడి ప్రత్యేకతలు.

ఇక్కడి భీమేశ్వర స్వామి వారు ఆత్మలింగ రూపంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు.

పురాణాల్లోనూ ఈ ప్రదేశానికి ప్రత్యేక స్థానం ఉంది. అసలు ద్రాక్షారామంలో పరమశివుని ఆత్మలింగం ఎలా ఏర్పడింది.

పురాణాల ప్రకారం... తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి సాక్షాత్కారం పొందుతాడు. తారకాసురుడి భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని అడగగా...

ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. దీంతో శివుడు తారకాసురుడికి ఆత్మలింగాన్ని వరంగా ప్రసాదిస్తాడు. బాలకుడి చేతిలో తప్ప మరెవ్వరి చేతిలోనూ తనకు మరణం ఉండకూడదనే వరాన్ని కూడా తారకాసురుడు పొందుతాడు. బాలకులు తనను ఏమీ చేయలేరనే భావనతో ఈ వరాన్ని కోరుకుంటాడు..

పరమేశ్వరుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని తన గొంతులో దాచుకుంటాడు. ఆ వర గర్వంతో దేవతలను, ఋషులను, ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. తారకాసుడి ఆగడాలను తట్టుకోలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి రక్షించమని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు... తారకాసురున్ని వధించడం ఎవరి వల్లా కాదని, శివాంశతో జన్మించిన బాలకుడి వలనే దీనికి పరిష్కారం లభిస్తుందని సెలవిస్తాడు.

దీంతో దేవతలు పరమేశ్వరున్ని శరణు వేడగా, పరమశివుడు పార్వతీదేవితో కలిసి కుమార స్వామికి జన్మనిస్తాడు. రుద్ర గణములకు ఆధిపత్యం వహించి కుమారస్వామి తారకాసురుడిపై యుద్ధం చేస్తాడు. ఆత్మలింగాన్ని ఛేదిస్తేనే తారకాసురున్ని వధించడం సాధ్యపడుతుందని తెలుసుకుని తారకాసురుని గొంతులో బాణాన్ని ప్రయోగిస్తాడు. దీంతో ఆత్మలింగం ఐదు ముక్కలుగా చెదిరి పడి తారకాసురుడు మరణిస్తాడు. భూమిపై ఐదు ముక్కలుగా పడిన ఆత్మలింగాలను అదే ప్రదేశంలో కుమారస్వామి, ఇతర దేవతలు ప్రతిష్టించారు. అవే ద్రాక్షారామం సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలు. చాళుక్య రాజైన భీముడు ద్రాక్షారామం ఆలయాన్ని నిర్మించడంతో దీనిని భీమేశ్వర ఆలయంగా పిలుస్తారు

మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు. మహాశివుని ఆత్మలింగంతో పాటు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ద్రాక్షారామంలో భక్తులకు దర్శనమిస్తారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ద్రాక్షారామం కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి విమాన మార్గం ద్వారా వచ్చే వారు రాజమండ్రి విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి బస్సు లేదా క్యాబ్ ద్వారా ద్రాక్షారామం చేరుకోవచ్చు. రైలు మార్గంలో వచ్చే వారు రాజమండ్రి లేదా సామర్లకోట స్టేషన్లలో దిగి ట్యాక్సీ, ఆటో, బస్సు మార్గాల ద్వారా వెళ్లవచ్చు.

- శ్రీనివాస గుప్తా వనమా

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya